అతను జనగాం జిల్లా వైద్యాధికారుల్లో కీలక స్థానంలో ఉన్నాడు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన సొంత క్లినిక్‌లో రాత్రివేళ కరోనా లక్షణాలున్న వారి నుంచి శాంపిళ్లను సేకరిస్తున్నాడు. వాటిని హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయిస్తున్నాడు. అనుమతి లేకున్నా అక్రమంగా స్వాబ్‌లను సేకరించి పరీక్ష చేయించేందుకు రూ. 3,500 వసూలు చేస్తున్నాడు.
వరంగల్‌లోనూ ఒక ప్రభుత్వ వైద్యుడు ఇదే నిర్వాకానికి తెరలేపాడు. అనేకచోట్ల శాంపిళ్లు ఇచ్చేందుకు అవకాశం లేకపోవడంతో సొంత నర్సింగ్ హోంలో అక్రమ దందా నిర్వహిస్తున్నాడు. అక్కడ శాంపిళ్లను సేకరించి ఈయన కూడా హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ల్యాబ్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గత్యంతరం లేక కొందరు లక్షణాలున్న బాధితులు రూ. 3 వేల నుంచి 4 వేలు ఇచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో కొందరు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు అక్రమ దందాకు తెరలేపారు. జనగాం జిల్లాకు చెందిన ఆ వైద్యాధికారి తన క్లినిక్‌కు వచ్చే వారిలో లక్షణాలున్న వారిని రాత్రి వేళ రమ్మని చెప్పి శాంపిళ్లను సేకరిస్తున్నారు. ఒక ప్రభుత్వ ఉద్యోగే ఆ క్లినిక్‌లో శాంపిళ్లు ఇవ్వడం గమనార్హం. 3 రోజుల్లో హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ల్యాబ్ నుంచి పాజిటివ్ వచ్చిందంటూ అతనికి ఫలితాల రిపోర్టు ఇచ్చా రు. పాజిటివ్ వచ్చాక ఆ జిల్లాస్థాయి అధికారే ఆయనకు వైద్యం చేశాడు. ఇలా కొందరు అక్రమంగా శాంపిళ్లు సేకరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు.
శాంపిళ్లు సేకరించే అధికారం ఎక్కడిది?
రాష్ట్రంలో ఐసీఎంఆర్ నిర్దేశించిన ప్రభుత్వ ఆసుపత్రుల్లో, ప్రైవేట్‌లోని కొన్ని ఆసుపత్రులు, లేబోరేటరీల్లో మాత్రమే కరోనా శాంపిళ్లు సేకరించే అవకాశం, పరీక్ష నిర్వహించే వెసులుబాటుంది. కరోనా వైద్యం చేసే చాలా ఆసుపత్రులకు శాంపిళ్లు సేకరించి పరీక్ష చేసే వెసులుబాటు లేదంటే కేంద్ర ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
అంతెందుకు రాష్ట్రంలో ఐసీఎంఆర్ అనుమతి పొందిన పేరు మోసిన ప్రైవేట్ లేబరేటరీలు, కార్పొరేట్ ఆసుపత్రుల్లోనే సక్రమంగా శాంపిళ్ల సేకరణ, పరీక్షలు జరగడంలేదంటూ ఐసీఎంఆర్ గుర్తించడం, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తనిఖీలు చేయడం విదితమే. వాటిల్లో 12 లేబరేటరీలకు ప్రభుత్వం నోటీసులు కూడా జారీచేసిన సంగతి తెలిసిందే. అలాంటిది అడ్రస్‌లేని క్లినిక్‌లు, నర్సింగ్‌హోంలలో కరోనా లక్షణాలున్న వారినుంచి శాంపిళ్లను సేకరించడంపై విమర్శలు వస్తున్నాయి. పైగా ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రులకు ఇచ్చిన అనుమతి ప్రకారం ఒక పరీక్షకు రూ. 2,200 మాత్రమే తీసుకోవాలి. కానీ జనగాం క్లినిక్‌లో ఏకంగా రూ. 3,500 తీసుకోవడం గమనార్హం.
ప్రత్యేక శిక్షణ ఉండాల్సిందే...
కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించేందుకు గొంతు లేదా ముక్కులో నుంచి స్వాబ్ నమూనాలను సేకరిస్తారు. అది సేకరించాలంటే ప్రత్యేకంగా శిక్షణ పొందిన పారామెడికల్ సిబ్బంది అవసరం. లేకుంటే పరీక్ష ఫలితాలు తారుమారు అయ్యే అవకాశాలుంటాయని అంటున్నారు. సరైన పరిమాణంలో స్వాబ్ సేకరణ జరగకుంటే, ఒక్కోసారి పరీక్ష నిర్వహించడం కూడా సాధ్యంకాదని నిపుణులు అంటున్నారు. జిల్లాల్లో విరివిగా పరీక్షలు నిర్వహించే అవకాశం లేకపోవడంతో అనేకమంది బాధితులు ఇలాంటి అక్రమార్కుల వలలో పడుతున్నారు.
జిల్లా ఆసుపత్రుల్లో, కొన్ని అనుమతి ఉన్నచోట్ల మాత్రమే శాంపిళ్లు సేరిస్తుండటం, అక్కడ రద్దీ ఎక్కువ ఉండటంతో కొందరు అక్రమార్కులు తమ ప్రైవేట్ క్లినిక్‌లలో అక్రమంగా శాంపిళ్లు సేకరించి పంపిస్తున్నారు. ఇలా రాష్ట్రంలో పలువురు ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులు ప్రజల్లో ఉన్న కరోనా భయాన్ని కరెన్సీగా మార్చుకుంటున్నారు. రూ. 3,500 వసూలు చేసి, ల్యాబ్‌కు సగం ఇచ్చి, తాము సగం తీసుకుంటున్నట్లు సమాచారం. అటువంటి పరీక్షలు రిపోర్టులు ఐసీఎంఆర్ పోర్టల్‌లో అప్‌లోడ్ కావడంలేదని ఒక వైద్య నిపుణుడు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment