తీగలాగితే.. డొంక కదిలింది!
కామారెడ్డి : దేశ సరిహద్దులు దాటిన దగ్గుమందు అక్రమ దందా రాకెట్‌కు సంబంధించి విచారణ కొనసాగుతోంది. కామారెడ్డి కేంద్రంగా సాగిన ఈ స్మగ్లింగ్‌తో ఇతర ప్రాంతాల మెడికల్ ఏజెన్సీలకూ సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై గుంటూరులోనూ సోదాలు నిర్వహించారని ఔషధ నియంత్రణ శాఖ అధికారుల ద్వారా తెలిసింది.
ఫెన్సిడిల్ అక్రమదందా వ్యవహారాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలతో ఔషధ నియంత్రణ శాఖ అధికారులు స్పందించారు. ఫెన్సిడిల్ అక్రమ రవాణా కేసులో ఇప్పటికే కామారెడ్డి అజంతా మెడికల్ ఏజెన్సీ అనుమతులను రద్దు చేసిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు విచారణను మరింత వేగవంతం చేశారు. దందాతో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాలు సేకరించారు.
ఈ రాకెట్‌లో గుంటూరుకు చెందిన శేషు ఏజెన్సీకీ భాగస్వామ్యం ఉన్నట్టు గుర్తించిన అధికారులు.. అక్కడికి వెళ్లి రికార్డులను సీజ్ చేశారు. ఆ ఏజెన్సీ నుంచి 3.20 లక్షల ఫెన్సిడిల్ బాటిళ్లు అక్రమ రవాణ అయినట్టు అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు నగరంలో ప్రముఖ మెడికల్ ఏజెన్సీగా శేషు ఏజెన్సీకి గుర్తింపు ఉంది. ఈ ఏజెన్సీకి ఫెన్సిడిల్ అక్రమదందాలో భాగస్వామ్యం ఉందని అనుమానించిన అధికారులు ఇటీవల సోదాలు నిర్వహించారు. అలాగే భీమవరం, నర్సరావుపేట ప్రాంతాలకు చెందిన డ్రగ్ వ్యాపారులకూ ఈ అక్రమ దందాలో భాగస్వామ్యం ఉన్నట్టు సమాచారం.
నిజామాబాద్ జిల్లాకు చెందిన ఔషధ నియంత్రణ శాఖ అధికారులు ఇటీవల గుంటూరుకు వెళ్లి అక్కడి అధికారుల సాయంతో శేషు ఏజెన్సీ రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఫెన్సిడిల్ అక్రమ రవాణా వ్యవహారంలో సదరు ఏజెన్సీకి చెందిన బిల్లులు, రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకుని కోర్టులో సమర్పించినట్టు సమాచారం.
అజంతాకు ఆగిపోయిన బిల్లుల చెల్లింపులు
ఫెన్సిడిల్ అక్రమ దందా కేసులో అనుమతులు రద్దయిన అజంతా ఏజెన్సీకి వివిధ ప్రాంతాల నుంచి రావాల్సిన బిల్లులు నిలిచిపోయినట్టు సమాచారం. అజంతా ఏజెన్సీ నుంచి నాలుగైదు జిల్లాలకు చెందిన వందలాది ఏజెన్సీలు, దుకాణాలకు మందులు సరఫరా చేసేవారు. కోట్ల రూపాయల్లో వ్యాపారం నడిచేది. అయితే అజంతా ఏజెన్సీ కేసుల్లో ఇరుక్కోవడం, అందులో తమ వద్ద మందులు తీసుకునే రిటైలర్లకు ఫెన్సిడిల్ సరఫరా చేసినట్టు బోగస్ బిల్లులు తయారు చేసుకున్న వ్యవహారంలో ఆయా మెడికల్ షాప్‌ల వారు విచారణకు హాజరుకావాల్సి వచ్చింది.
తమకు సంబంధంలేని వ్యవహారంలో ఇరికించి ఇబ్బందులకు గురిచేశారని ఆగ్రహంతో ఉన్న సదరు దుకాణాదారులు అజంతాకు చెల్లించాల్సిన బిల్లులను నిలిపివేసినట్లు తెలుస్తోంది. బిల్లుల వసూళ్ల కోసం అజంతా ఏజెన్సీ యజమానులు ఒత్తిడి తెచ్చినా చాలా మంది ససేమిరా అంటున్నట్టు సమాచారం.