దగ్గుమందు కేసుపై సీబీ‘ఐ’
- రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన డీసీఏ
- సీఐడీ నివేదికపై అసంతృప్తి
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన దగ్గు మందు అక్రమ రవాణా వ్యవహారం కొలిక్కి రావట్లేదు. ఇతర దేశాలకు దగ్గు మందు అక్రమ రవాణా వ్యవహారంలో నేర పరిశోధన విభాగం (సీఐడీ) సమర్పించిన విచారణ నివేదికపై ఔషధ నియంత్రణ విభాగం (డీసీఏ) అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. దగ్గు మందు అక్రమ రవాణా అంశాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారిస్తేనే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని అభిప్రాయపడింది. ఈ మేరకు డీసీఏ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించినట్లు సమాచారం. సీఐడీ అధికారులు సరిగా దర్యాప్తు చేయలేదని పేర్కొంది.
డీసీఏ ప్రతిపా దనపై రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. 2015 అక్టోబర్‌లో అసోంలోని భారత సరిహద్దులో దగ్గు మందు సిరప్‌ను అక్రమ రవాణా చేస్తున్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్ లోని ఓ కంపెనీ ఉత్పత్తి చేసిన ఈ మందుల లారీ హైదరాబాద్ నుంచి వెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. కొన్ని దుకాణాలు, డీలర్ల వద్ద తనిఖీలు చేసి ఔషధ నియంత్రణ అధికారులు స్వాధీనం చేసుకున్న దగ్గు మందు కొనుగోలు బిల్లులను పరిశీలించగా మందును విక్రయించి నట్లు రికార్డుల్లో పేర్కొన్నా, వాటిని ఎక్కడా సరఫరా చేయలేదని విచారణలో తేలింది. నేరుగా ఇతర దేశాలకు తరలించారని నిర్ధారించారు.
విచారణలో లోపాలు..
ఈ కేసును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఇక్కడే వ్యవహారం దారితప్పినట్లు తెలుస్తోంది. డీసీఏ విభాగం అధికారులు నమోదు చేసిన అభియోగాలకు అనుగుణంగా ఎలాంటి ఆధా రాల్లేవని సీఐడీ విభాగం కోర్టుకు తెలిపింది. దీంతో దీనిపై అభిప్రాయం తెలపాలని డీసీఏ కు కోర్టు సూచించింది. దగ్గు మందు అక్రమ రవాణా వ్యవహారంలో సీఐడీ విభాగం సరిగా విచారించలేదని, దాదాపు రూ.300 కోట్ల విలువైన దగ్గు మందు తెలంగాణ నుంచి అక్రమ రవాణా అయిందని రాష్ట్ర ప్రభుత్వానికి డీసీఏ నివేదించింది. కేసును సీబీఐకి అప్పగిస్తేనే అసలు వ్యవహారం బయటపడుతుందని పేర్కొంది. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి డీసీఏ ఈ అంశంపై కోర్టుకు నివేదించనుంది.
కాసుల కక్కుర్తితో...
మన రాష్ట్రంలోనే సరఫరా చేయాల్సిన దగ్గు మందు (ఫెన్సిడిల్) బంగ్లాదే శ్‌కు అక్రమంగా రవాణా అవుతోంది. ఈ మందును కొద్ది పరిమాణంలో తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. ఇదే మందును ఎక్కువ పరిమాణంలో తీసుకుంటే మత్తు వస్తుంది. మన దేశంలో ఈ మందు నిల్వపై ఆంక్షలు ఉన్నాయి. ఒక్కో ఔషధ దుకాణంలో ఐదు సిరప్‌ల కంటే ఎక్కువగా అందుబాటులో ఉండనివ్వరు. హైదరాబాద్‌లో ఫెన్సిడిల్ మందు రూ.65కు లభిస్తోంది. బంగ్లాదేశ్ లో దీన్ని రూ.260కు విక్రయిస్తున్నారు. అక్కడ ఈ మందుకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీంతో ఫార్మా నిర్వాహ కులు కాసులకు కక్కుర్తి పడి బంగ్లాదేశ్‌కు అక్రమ రవాణా చేస్తున్నారు.