
జోరుగా గుడుంబా తయారీ
మంచిర్యాల రూరల్ : మండలంలో గుడుంబా గుప్పుమంటోంది. గ్రామాల్లో విచ్చలవిడిగా తయారు చేసి అమ్మకాలు కొనసాగిస్తున్నా ఎక్సైజ్ అధికారులకు పట్టడం లేదు. అడ్డూ అదుపు లేకపోవడంతో తయారీదారులు పెద్ద ఎత్తున సారా వ్యాపారానికి సిద్ధం అవుతున్నారు. బావులు, వాగులు, అడవుల్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ బెల్లం, జీడి గింజలు, ఇతరత్రా సామగ్రి దర్శనమిస్తున్నాయి.
కొత్త సంవత్సర వేడుకలు, సంక్రాంతి పండుగల నేపథ్యంలో గుడుంబా తయారీ జోరుగా సాగుతోంది. మండలంలోని ముల్కల్ల, పెద్దంపేట గ్రామాల్లో నాటుసారా తయారీ కేంద్రాలు ఎక్కువగా ఉన్నాయి. ముల్కల్ల తయారీదారులు ర్యాలీవాగు పరిసర ప్రాంతాలు, శివారులోని అటవీ ప్రాంతంలో ఎక్కువగా గుడుంబా తయారు చేస్తున్నారు. ఇక్కడ తయారైన గుడుంబాను సింగరేణి గ్రామాలతోపాటు మండలంలోని ఇతర గ్రామాలకు నిత్యం సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉండే ముల్కల్ల గ్రామంలో విచ్చలవిడిగా గుడుంబా తయారీ కేంద్రాలు ఉన్నాయి.
అయినా ఎక్సైజ్ అధికారులు పట్టించుకోవడం లేదు. నెల నెలా ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దంపేట గ్రామంలో గుడుంబా తయారు చేసి, విక్రయాలు జరిపే వారు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది జీవనోపాధి సైతం ఇదే కావడం గమనార్హం. ఈ గ్రామం అటవీ ప్రాంతంకు దగ్గరగా ఉండడంతో, చెట్ల చాటున, పొదల్లో గుట్టు చప్పుడు కాకుండా గుడుంబా తయారు చేస్తున్నారు. మండలంలోని 25 గ్రామాలకు సరఫరా అవుతోంది. తయారీదారులు లీటరు రూ.25 వరకు విక్రయిస్తే, ఆయా గ్రామాల్లోని వ్యాపారులు లీటరు గుడుంబాను రూ.50 వరకు అమ్ముతున్నట్లు సమాచారం.
నూతన సంవత్సరం, సంక్రాంతి పండగల నేపథ్యంలో వ్యాపారులు ముందస్తుగానే వేలాది లీటర్ల గుడుంబాకు అడ్వాన్సులు ఇచ్చినట్లు తెలుస్తోంది. నూతన సంవత్సరం సమయంలో, ఆ తర్వాత సంక్రాంతికి ముందు గ్రామాల్లో జరిగే కోడి పందేలు, చిత్తు బొత్తు ఆట వంటివి ఆడనుండడం, ధాన్యం అమ్మిన డబ్బులు రైతుల వద్ద అధికంగా ఉండడంతో గ్రామాల్లో పెద్ద మొత్తంలో గుడుంబా అమ్మకాలు జరగనున్నాయి. దీన్ని అవకాశంగా ఎంచుకున్న పలువురు వ్యాపారులు గుడుంబా విక్రయాలు భారీగా చేపట్టేందుకు ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
చర్యలు తీసుకుంటాం
- శ్రీనివాస్, ఎక్సైజ్ సీఐ, మంచిర్యాల
గ్రామాల్లో గుడుంబా తయారీ జరుగుతుందని సమాచారం ఉంది. ముల్కల్ల, పెద్దంపేట గ్రామాల్లో దాడులు చేసి, తయారు చేసిన గుడుంబా డ్రమ్ములను ధ్వంసం చేసి, కేసులు నమోదు చేశాం. ఇప్పటికే నిల్వ ఉంచిన ప్రదేశాలను గుర్తిస్తున్నాం. వాటిపై కూడా దాడులు జరిపి ఎలాంటి విక్రయాలు లేకుండా చూస్తాం.