
ఓడిన స్నేహం.. గెలిచిన మృత్యువు
► అనారోగ్యంతో తనువు
► చాలించిన యువకుడు
► ఏడాదిగా మంచానికే
► పరిమితమైన తల్లిదండ్రులు
మృత్యువు ముంచుకొస్తున్నా ఆ యువకుడు మంచానికే పరిమితమైన తల్లిదండ్రులకు సేవ చేయడం గురించే ఆలోచించేవాడు.. అలాంటి వ్యక్తిని బతికించుకునేందుకు స్నేహితులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. చివరకు తనువు చాలించడంతో కన్నీరు మున్నీరయ్యారు.
గట్టు : మండల కేంద్రానికి చెందిన అంజనమ్మ, గుర్రం బజారి దంపతులకు ఇద్దరు కూతుళ్లతోపాటు కుమారుడు వెంకటేష్ (24) ఉన్నారు. వీరిది పేద కుటుంబం. స్థానికంగా వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గతంలోనే పెద్ద కూతురు వివాహం చేశారు. కాగా, తల్లిదండ్రులు ఏడాదికాలంగా అనారోగ్యంతో మంచాన పడ్డారు. దీంతో డిగ్రీ వరకు చదివిన కొడుకు ఓ ఎలక్ట్రానిక్ షాపులో, చిన్న కూతురు కూలి పనికి వె ళ్లొచ్చి ఇంట్లో వారికి సపర్యలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే 15రోజుల క్రితం అనారోగ్యానికి గురైన కొడుకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చూపించుకున్నాడు. కిడ్నీ, ఉపిరితిత్తుల సంబంధమైన వ్యాధులతో బాధపడుతున్నట్లు వైద్యు లు నిర్ధాంచారు. ఈ విషయం తెలుసుకున్న తోటి స్నేహితులు మొదట్లో కర్నూలుకు తరలించారు. అనంతరం హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తీసుకెళ్లారు.
మిత్ర బృందంతోపాటు కొర్విపాటి వినోద్‌కుమార్ రూ.లక్ష వరకు ఆర్థికసాయం చేయడానికి ముందుకు వచ్చారు. అలాగే గ్రామస్తులు మరో రూ.లక్ష పోగు చేసి ఇచ్చినా ప్రయోజనం దక్కలేదు. అక్కడే చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం ఆ యువకుడు మృతి చెందడతో వారు శోకసంద్రంలో మునిగిపోయారు.