సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్(ఏవీజీసీ) పరిశ్రమలకు ఊతమిచ్చేందుకు నిర్మిస్తున్న ఇమేజ్ టవర్ రాష్ట్రానికి మరో చార్మినార్‌లా కీర్తిప్రతిష్టలు తెచ్చి పెడుతుందని పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. సృజనాత్మక రంగ పరిశ్రమలకు హైదరాబాద్‌ను కేంద్రంగా మారుస్తామని, అందుకే ఇమేజ్ టవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
ఆదివారం రంగారెడ్డి జిల్లా రాయదుర్గంలోని పదెకరాల స్థలంలో ఇమేజ్ టవర్ నిర్మాణ పనులకు మంత్రి పట్నం మహేందర్‌రెడ్డితో కలసి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏవీజీసీ పరిశ్రమలకు అత్యాధునిక సదుపాయాలు కల్పించాలన్న ప్రభుత్వ ఆశయాలకు ఇమేజ్ టవర్ అద్దం పడుతుందన్నారు. ప్రైవేటు–పబ్లిక్ భాగస్వామ్యంతో రూ.945 కోట్ల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నామని, 2020 నాటికి పూర్తవుతుందని చెప్పారు.
16 లక్షల చదరపు అడుగుల్లో నిర్మించే ఈ భవనంలో మోకాప్ స్టూడియోలు, ట్రీన్‌మ్యాట్ స్టూడియోలు, సౌండ్స్ అండ్ అక్విస్టిక్ స్టూడియోలు, కలర్ కోడింగ్ అండ్ డీఐ స్టూడియోలు, రెండర్ ఫారŠమ్స్, డాటా సెంటర్, హై డెఫినేషన్ బ్యాండ్ విడ్త్, షేర్డ్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ తదితర సదుపాయాలు కల్పిస్తామన్నారు. గేమింగ్, యానిమేషన్ పరిశ్రమల అభివృద్ధికి ఈ భవనం చోదక శక్తిగా ఉపయోగపడుతుందన్నారు. ఏవీజీసీ రంగానికి సంబంధించి సకల సదుపాయాలను ఇలా ఒకే గొడుగు కింద అందించడం ఆసియా, ఫసిపిక్ దేశాల్లో ఇదే తొలిసారి అని, యూకేలోని మీడియా సిటీ, సియోల్‌లోని డిజిటల్ సిటీలను తలదన్నేలా ఈ భవనం ఉంటుందని పేర్కొన్నారు.
ఏ దిక్కు నుంచి చూసినా ఆంగ్ల అక్షరం ‘టీ’ఆకారంలో కనిపించే విధంగా ఈ భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. టెక్నాలజీ ఎగుమతులు, ఉద్యోగాల సృష్టిని మరింత ఎత్తుకు తీసుకెళ్లడానికి ఏవీజీసీ పరిశ్రమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇప్పటికే ఐటీ/ఐటీఈఎస్ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా ఉండగా.. ఏవీజీసీ రంగాన్ని ప్రోత్సహించేందుకు అమలు చేస్తున్న విధానాలతో సృజనాత్మక పారిశ్రామిక కేంద్రంగా తెలంగాణ రూపు దిద్దుకుంటుందని చెప్పారు.
ఫైన్ ఆర్ట్స్ కోర్సుల్లో యానిమేషన్
డిగ్రీ స్థాయిలోని అన్ని ఫైన్ ఆర్ట్స్ కోర్సులు, ఐటీఐ, ఇతర నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోర్సుల్లో యానిమేషన్, గేమింగ్‌లను చేరుస్తామని కేటీఆర్ తెలిపారు. టాస్క్ ద్వారా ఏవీజీసీ రంగంలో యువతకు శిక్షణ కల్పిస్తామన్నారు. ఇమేజ్ యానిమేషన్ రంగాల్లో స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు 27,000 చదరపు అడుగుల స్థలంలో ఇన్‌క్యుబేటర్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యానిమేషన్, గేమింగ్ పరిశ్రమలకు దేశంలో మంచి వ్యాపార అవకాశాలున్నాయని, అయినా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్నాయని అన్నారు.
యానిమేషన్, గేమింగ్‌కు పుట్టినిళ్లు
విజువల్ ఎఫెక్టŠస్ స్టూడియోలు, 2డీ, 3డీ యానిమేషన్, గేమింగ్ రంగాలకు చెందిన 100 పరిశ్రమలు హైదరాబాద్‌లో ఉన్నాయని, 30 వేల మంది వృత్తి నిపుణులు ఇందులో పని చేస్తున్నారని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఏవీజీసీ పరిశ్రమలు ఏటా 300 బిలియన్ డాలర్ల ఉత్పత్తులను ఇక్కడ రూపొందిస్తున్నాయన్నారు. ‘‘విజువల్ ఎఫెక్టŠస్ ద్వారా సినీ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన బాహుబలి, లైఫ్ ఆఫ్ పై, అరుంధతి, మగధీర, ఈగ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలకు రాష్ట్రం పుట్టినిళ్లు. ప్రపంచంలోని అత్యుత్తమ యానిమేషన్ గేమ్స్ అయిన ఫార్మ్ విల్, ఎస్కేప్ ఫ్రం మడాగాస్కర్‌లను హైదరాబ్‌లోనే అభివృద్ధి చేశారు.
విజువల్ ఎఫెక్టŠస్‌కు సంబంధించి ఎన్నో ఇంగ్లిష్ బ్లాక్ బస్టర్ సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ పనులు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి’’అని మంత్రి వివరించారు. యానిమేషన్, గేమింగ్స్ రంగంలో యువతకు శిక్షణ కల్పించేందుకు డిసెంబర్ 16న ప్రముఖ సంస్థతో ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, టీఎస్‌ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి, రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి, వైస్ చైర్మన్ బసిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment