మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో కేటీఆర్, జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: చదువు రాని వారని రైతులను తక్కువ అంచనా వేయొద్దని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ మంత్రి కె.తారకరామారావు స్పష్టం చేశారు. స్మార్ట్ ఫోన్ల రాకతో వారు ఎంతో అవగాహన పెంచుకున్నారని తెలిపారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక వినియోగం పెరగాలని, రైతులకు ట్యాబ్‌లు అందించే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. డ్రోన్లు, ఇతర వ్యవసాయ ఆవిష్కరణల వైపు యువతను ప్రోత్సహించాలని కోరారు. సాగు రంగంపై వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గం ఉపసంఘం మంగళవారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో సమావేశమై చర్చించింది.
ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. పలు సూచనలు చేశారు. ‘ఆధునిక వ్యవసాయ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని 32 జిల్లాల్లో 50 నుంచి 100 ఎకరాల్లో డెమానిస్ట్రేట్ ఫార్మ్‌ల ఏర్పాటు చేయాలి. వ్యవసాయ వర్సిటీ కేంద్రంగా కొత్త ఆవిష్కరణలు రావాలి. ప్రొఫెసర్ స్వామినాథన్, జయతీ ఘోష్, పాలగుమ్మి సాయినాథ్, సుభాష్ పాలేకర్‌ను మంత్రివర్గ ఉపసంఘం సంప్రదించి సలహాలు, సూచనలు స్వీకరించాలి. అమెరికాలోని అయోవాలో ఉన్న అగ్రికల్చర్ మ్యూజియంను అధికారుల బృందం సందర్శించాలి’అని కేటీఆర్ కోరారు. 2021–22 సంవత్సరానికి గాను రైతుబీమా వార్షిక ప్రీమియం కింద రూ.1,450 కోట్ల చెక్కును ఎల్‌ఐసీకు ఈ కార్యక్రమంలో మంత్రులు అందజేశారు.
వేరుశనగ సాగును ప్రోత్సహించాలి...
యాసంగిలో వేరుశనగ సాగు వైపు రైతులను మళ్లించేందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ప్రోత్సహించాలని మంత్రి నిరంజన్‌రెడ్డి కోరారు. వేరుశనగ వంగడాల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. వరి ధాన్యం నుంచి ఇథనాల్ తయారీ పరిశ్రమలను ప్రోత్సహించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. ఆలుగడ్డ సాగును పెంచుకోవడానికి స్థానికంగా విత్తన లభ్యతను పెంచాల్సి ఉందన్నారు. రైతుకు మించిన శాస్త్రవేత్త లేడని, అగ్రి స్టార్టప్‌లను ప్రోత్సహించాలన్నారు.
రాష్ట్రంలో 150 సహకార సంఘాలు చురుకుగా పనిచేస్తున్నాయని, మిగతా సంఘాలను బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో వరి సాగు తగ్గించి, అధిక ఆదాయం వచ్చే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని మంత్రి జగదీశ్‌రెడ్డి కోరారు. చెరుకు సాగును ప్రోత్సహించాలన్నారు. గతంలో దిగుబడి సరిగ్గా లేక చెరుకు రైతులు నష్టపోయారని, ఇప్పుడు 60 నుంచి 100 టన్నుల దిగుబడినిచ్చే వంగడాలు మార్కెట్లోకి వచ్చాయన్నారు. చిన్న కమతాల్లో కూరగాయలు, పండ్ల సాగును ప్రోత్సహించాలని చెప్పారు. డిమాండ్ ఉన్న పంటలను పండించాలని కోరుతున్నా రైతుల్లో పెద్దగా స్పందన రావడం లేదని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లాలో పండ్లు, కూరగాయలు, పూల సాగు తగ్గిందని, మార్కెటింగ్ సమస్యలే దీనికి కారణమని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆర్గానిక్ సాగు వైపు ప్రోత్సహిస్తే పరిస్థితిలో మార్పు వచ్చే అవకాశం ఉందన్నారు. రైతులను పంట మార్పిడికి ప్రోత్సహించాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కోరారు.
మిద్దె తోటలకు ప్రోత్సాహం...
వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలి. సాగు పరిశ్రమగా మార్చేందుకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను బలోపేతం చేయాలి. వేరుశెనగ, టమాటా ఆధారిత ఉత్పత్తుల పరిశ్రమలతో పాటు మిద్దె తోట సాగును ప్రోత్సహించాలి.
దుర్భిక్షం నుంచి సుభిక్షం..
రాష్ట్ర వ్యవసాయ రంగం సంక్షోభం నుంచి సంవృద్ధి సాధించింది. ఇల్లంతకుంట ప్రాంతం ఒకప్పుడు దుర్భిక్షానికి చిరునామాగా ఉండేది. నేడు అక్కడ లక్ష టన్నుల వరకు దిగుబడి వస్తోంది.
– కేటీఆర్
Comments
Please login to add a commentAdd a comment