ధర్మపురి: కుటుంబ పోషణ కోసం పరాయి దేశం వెళ్లిన ఐదుగురు రాష్ట్ర వాసులు ఏజెంట్ల మోసంతో జైలుపాలై.. చివరికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఏ తప్పు చేయని వీరు ఇరాక్‌లో ఏడాదిపాటు జైల్లో నరకయాతన అనుభవించారు. ఇందులో ముగ్గురు ఎట్టకేలకు విడుదలై మంగళవారం స్వగ్రామాలకు చేరుకున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దొంతాపూర్ అనుబంధ గ్రామం మగ్గిడికి చెందిన దుర్గం శాంతయ్య, పసుల లక్ష్మణ్, జక్కి రాజుతోపాటు మంచిర్యాల జిల్లా దండెపెల్లి మండలానికి చెందిన కోడి రాజన్న, నిర్మల్ జిల్లాకు చెందిన దుర్గం నారాయణ బతుకుదెరువుకోసం 2016, జూన్ 17న ఇరాక్ వెళ్లారు. ఇందుకోసం ధర్మపురికి చెందిన ఓ ఏజెంట్‌కు రూ.1.40 లక్షలు ఇచ్చారు.
ఆ ఏజెంట్ కంపెనీ వీసా అని చెప్పి విజిట్ వీసాపై ఈ ఐదుగురినీ ఇరాక్ పంపించాడు. ఏడాదికి రూ.లక్ష వేతనం ఉంటుందని నమ్మించాడు. అయితే అక్కడికి వెళ్లాక పరిస్థితి మారింది. అక్కడ ఓ కంపెనీలో ఆరునెలలపాటు నెలకు కేవలం 400 దినార్ల వేతనంతో పనిచేశారు. వేతనం చాలకపోవడంతో అక్కడ మరో ఏజెంట్‌ను కలిశారు. ఎక్కువ వేతనం వచ్చే కంపెనీలో ఉద్యోగం పెట్టిస్తానని సదరు ఏజెంట్ చెప్పడంతో వీరు ఇంటి నుంచి మరో రూ.1.30 లక్షలు తెప్పించి ఆ ఏజెంట్‌కు ఇచ్చారు. అయితే అతడు ఉద్యోగం చూపకపోవడంతో కొంతకాలం అతని చుట్టూ తిరిగారు. చివరకు విధిలేని పరిస్థితిలో 2017, మే 14న ఇంటికి తిరుగు ముఖం పట్టారు.
నకిలీ వీసాగా గుర్తించి జైలుకు..
ఏజెంట్లను నమ్మి వారికి ఒక్కొకరు రూ.2.70 లక్షలు ముట్టజెప్పినా ఫలితం లేకపోవడంతో ఇంటికి బయల్దేరిన వలస బాధితుల వీసాలను అక్కడి విమానాశ్రయంలో తనిఖీ చేయగా, అవి విజిట్ వీసాలు అని తేలింది. గడువు ముగిసిన తర్వాత కూడా ఇరాక్‌లో ఉన్నందుకు పోలీసులు ఐదుగురినీ అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మే 14 నుంచి సుమారు 10 నెలలు జైల్లో నరకం చూశామని బాధితులు తెలిపారు. కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదని వారు కన్నీటి పర్యంతమయ్యారు. తమ వద్ద ఉన్న సెల్‌ఫోన్లు, బ్యాగులు, ఇంటికి తీసుకొచ్చేందుకు కొనుగోలు చేసిన సుమారు 60 వేల విలువైన వస్తువులను కూడా అక్కడి పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేయని తప్పుకు తాము శిక్ష అనుభవిస్తున్నామని అక్కడివారి ద్వారా తెలుసుకున్న కుటుంబ సభ్యులు తమను విడిపించుకునేందుకు అనేక పాట్లు పడ్డారని బాధితులు తెలిపారు. కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను కూడా కలవడానికి ఢిల్లీ వెళ్లారని, మంత్రి కేటీఆర్, నిజామాబాద్ ఎంపీ కవిత తదితరులను కలసి వినతిపత్రాలు అందించారని వివరించారు. తమ కుటుంబ సభ్యుల ప్రయత్నాలు ఫలించి ఎట్టకేలకు విముక్తి కలిగిందన్నారు. జక్కి రాజు, దుర్గం నారాయణ మరో 15 రోజులకు స్వగ్రామానికి వస్తారని తెలిపారు.
జైల్లో నరకం చూశా
పొట్టకూటి కోసం పరాయి దేశం వెళ్లిన మమల్ని జైల్లో బంధించారు. జీతం చాలక ఇంటికి వచ్చేముందు ఎయిర్‌పోర్టులో వీసాలు చూసి జైలుకు పంపించారు. పది నెలలు జైల్లో నరకం చూశాం. కటుంబం ఎట్లుంటదో తెలియదు. ఏజెంటు చేసిన మోసానికి బలయ్యాం. ప్రభుత్వం ఆదుకోవాలి.
– పసుల లక్ష్మణ్, మగ్గిడి
Comments
Please login to add a commentAdd a comment