సర్కారు ఆర్డర్లు వద్దు సారూ! | The impact of GST on cotton | Sakshi
Sakshi News home page

సర్కారు ఆర్డర్లు వద్దు సారూ!

Published Sat, Dec 2 2017 2:43 AM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

The impact of GST on cotton - Sakshi

సిరిసిల్ల: మొన్నటివరకు ఆశతో, ఆసక్తిగా వర్క్‌ ఆర్డర్లు స్వీకరించిన రాజన్న సిరిసిల్ల జిల్లా నేతకార్మికులు ఇప్పుడు సర్కారు ఆర్డర్లు వద్దంటున్నా రు. పవర్‌లూమ్‌ కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం స్కూల్‌ యూనిఫామ్స్, సంక్షేమ శాఖలకు అవసరమైన వస్త్రాలు, బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్‌ పండుగ దుస్తులు ఉత్పత్తి చేసే బాధ్యతను ఇక్కడి నేత కార్మికులకు ఇచ్చింది. అయితే, గతంలో తయారు చేసిన వస్త్రానికి నేటికీ నిధులు విడుదల కాకపోవటం.. నూలుపై జీఎస్టీ బాదుడు, ధరలు గిట్టుబాటు కాకపోవటంతో సర్కారీ ఆర్డర్లను నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.  

వస్త్రోత్పత్తి ఆర్డర్లు సిద్ధం..
సిరిసిల్లలోని నేత కార్మికుల కోసం ప్రభుత్వ ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయి. రాజీవ్‌ విద్యామిషన్‌(ఆర్వీఎం) ద్వారా రూ. 42 కోట్ల విలువైన కోటి మూడు లక్షల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్‌ ఉంది. అలాగే, వచ్చే క్రిస్మస్‌కు అవసరమైన రూ.6.73 కోట్ల విలువైన 25.52 లక్షల మీటర్లు, సంక్షేమశాఖకు చెందిన రూ.12 కోట్ల విలువైన 40 లక్షల మీటర్ల ఆర్డర్లు రెడీగా ఉన్నా.. వాటిని తీసుకునేందుకు నిరాకరిస్తున్నారు. ఇవిపూర్తి కాగానే క్యాలెండర్‌ ప్రకారం మళ్లీ బతుకమ్మ చీరలు ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. జీఎస్టీకి ముందు నిర్ణయించిన ధరతోనే వస్త్ర ఉత్పత్తికి ఆర్డర్లు ఇవ్వడంతో వస్త్రోత్పత్తిదారులు ప్రభుత్వ ఆర్డర్లపై ఆసక్తి చూపడంలేదు.  

మళ్లీ అవే నష్టాలు..  
వస్త్రోత్పత్తికి అవసరమైన నూలుపై గతంలో 2 శాతం సీఎస్టీ విధించేవారు. జీఎస్టీ అమలు చేయటంతో ఇప్పుడది 18 శాతం శ్లాబులోకి వెళ్లింది. దీంతో నూలు ధరలు పెరిగాయి. ఆ మేరకు ప్రభుత్వం వస్త్రం ధరను పెంచలేదు. అంతేకాకుండా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ నేతన్నకు రూ.15 వేలకు తగ్గకుండా కూలి ఇవ్వాలని ఆదేశించిన విషయం తెల్సిందే.

ఈ మేరకు నేత కార్మికులకు మీటరుకు రూ.2.25, ఆసాములకు రూ.2.75 చెల్లించాలని జౌళిశాఖ అధికారులు నిబంధన పెట్టారు. వస్త్రపరిశ్రమకు అనుబంధంగా ఉన్న వైపని, వార్పిన్, టాకాలుపట్టే కార్మికులు, హమాలీలు సైతం కూలి రేట్లు పెంచేసుకున్నారు. ప్రభుత్వం ఆర్వీఎం ఆర్డర్ల ద్వారా సూటింగ్‌ మీటరు వస్త్రం రూ.54, షర్టింగ్‌కు రూ.34, ఓణీ వస్త్రానికి రూ.31, ప్యాకెట్‌ క్లాత్‌కు రూ.28 చెల్లిస్తోంది. 2016 నాటి ఒప్పం దం మేరకు ఈ ధరలు అమలవుతున్నాయి. కానీ, జీఎస్టీ బాదుడుతో కూలి రేట్లు గిట్టుబాటు కావడం లేదని వస్త్రోత్పత్తిదారులు అంటున్నారు.  

బిల్లుల చెల్లింపుల్లో జాప్యం..
సర్కార్‌ ఆర్డర్లు పొంది వస్త్రం సరఫరా చేస్తే.. ఆరు నెలలదాకా బిల్లు రావడంలేదు. దీంతో కార్మికుల వేతనాలు చెల్లించడం ఇబ్బందిగానే మారింది. చివరికి 10 శాతం బిల్లును అధికారులు ఆపేసి నాణ్యతనిర్ధారణ చేసిన తర్వాత చెల్లించడంతో ఆసాములు ఇబ్బందిపడుతున్నారు.

మంత్రి కేటీఆర్‌పైనే ఆశలు..
స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్‌కు సిరిసిల్ల నేత కార్మికులు, యజమాని, ఆసామి అనే మూడంచెల వస్త్రోత్పత్తి రంగంపై అవగాహన ఉంది. ప్రభుత్వ ఆర్డర్లకు సంబంధించి వస్త్రోత్పత్తి రేట్లను సవరించి, జీఎస్టీకి అనుగుణంగా ధర పెంచాలి. శాస్త్రీయంగా విశ్లేషించి వాస్తవాలను పరిగణనించాలి. ఇలాగైతేనే ప్రభుత్వ ఆర్డర్లకు ఆసాములు ముందుకు వచ్చే అవకాశం ఉంది.


టెక్నికల్‌ కమిటీ దృష్టికి తీసుకెళ్లాం
వస్త్రోత్పత్తిదారులకు ఇచ్చేందుకు ప్రస్తుతం ఆర్వీఎం ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయి. వీటిని పొందేందుకు పవర్‌లూమ్‌ మ్యాక్స్‌ సంఘాలు, చిన్నతరహా పరిశ్రమల(ఎస్‌ఎస్‌ఐ)యజమానులు ముందుకు రావడంలేదు. వస్త్రం ధర గిట్టుబాటు కావడం లేదని చెబుతున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రాష్ట్రస్థాయిలో టెక్నికల్‌ కమిటీ రేట్ల నిర్ధారణను పరిశీలిస్తోంది. – వి.అశోక్‌రావు, చేనేత, జౌళిశాఖ ఏడీ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement