హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయంగా మాతా, శిశు సంరక్షణకు సంబంధించి అమెరికా ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్ (యూఎస్‌ఏఐడీ) ప్రపంచంలోనే తొలి హెల్త్ ఇంపాక్ట్ బాండ్‌ను ఆవిష్కరించింది. ఈ ’ఆరోగ్య అభివృద్ధి బాండ్ల’ పథకాన్ని తొలుత మాతా, శిశు మరణాల రేటు అత్యధికంగా ఉంటున్న రాజస్తాన్‌లోని 14 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. రాజస్తాన్ డెవలప్‌మెంట్ ఇంపాక్ట్ బాండ్ పేరిట ఆవిష్కరించిన ఈ పథకాన్ని ’ఉత్కృష్ట’ ఇంపాక్ట్ బాండ్‌గా వ్యవహరించనున్నట్లు యూఎస్‌ఏఐడీ అడ్మినిస్ట్రేటర్ మార్క్ గ్రీన్ వెల్లడించారు.
వైద్యానికి సంబంధించి మౌలిక సదుపాయాలు మెరుగుపర్చడం ద్వారా మాతా, నవజాత శిశువుల మరణాలను నివారించేందుకు ఇది ఉపయోగపడగలదని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఈ బాండ్ విధానం పనిచేస్తుందని గ్లోబల్ ఎంట్రప్రెన్యూర్‌షిప్ సదస్సులో పాల్గొన్న సందర్భంగా గ్రీన్ గురువారమిక్కడ తెలిపారు. ముందుగా ప్రైవేట్ పెట్టుబడులతో రాజస్తాన్‌లోని ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాల్లో వైద్య సేవలు, మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తామన్నారు. నిర్దేశిత ప్రమాణాలు, లక్ష్యాలు సాధిస్తేనే యూఎస్‌ఏఐడీ ఆ పెట్టుబడులను తిరిగి చెల్లిస్తుందని గ్రీన్ చెప్పారు. యూఎస్‌ఏఐడీ, మెర్క్ ఫర్ మదర్స్, ది యూబీఎస్ ఆప్టిమస్ ఫౌండేషన్, హెచ్‌ఎల్‌ఎఫ్‌పీపీటీ, పీఎస్‌ఐ సంస్థల భాగస్వామ్యంతో ఇది అమలవుతుంది.
ప్రాథమికంగా 35 లక్షల డాలర్ల నిధులు..
ఐదేళ్ల వ్యవధిలో సుమారు 10 వేల మంది దాకా మహిళలు, నవజాత శిశువుల ప్రాణాలు కాపాడవచ్చని అంచనా వేస్తున్నట్లు గ్రీన్ వివరించారు. ఈ బాండ్ కోసం యూబీఎస్ ఆప్టిమస్ ఫౌండేషన్ ప్రా«థమికంగా సుమారు 35 లక్షల డాలర్ల వర్కింగ్ క్యాపిటల్ సమకూర్చనుంది. హెచ్‌ఎల్‌ఎఫ్‌పీపీటీ, పీఎస్‌ఐ ఈ నిధులతో దాదాపు 440 ప్రైవేట్ హెల్త్‌కేర్ సెంటర్స్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చడానికి వెచ్చిస్తాయని గ్రీన్ చెప్పారు. మరోవైపు క్షయ వ్యాధిపై అవగాహన పెంచేందుకు, 2025కల్లా క్షయ వ్యాధిరహిత దేశంగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు మరో 10 లక్షల డాలర్లు కేటాయిస్తున్నట్లు ఆయన వివరించారు.
ఫీడ్ ది ఫ్యూచర్ పేరిట ఆఫ్రికాలోని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు తోడ్పాటునిచ్చేందుకు 20 లక్షల డాలర్లు వెచ్చించనున్నట్లు గ్రీన్ చెప్పారు. అటు డిజిటల్ టెక్నాలజీని మహిళలకు కూడా మరింతగా చేరువ చేసే దిశగా వచ్చే ఏడాది తొలినాళ్లలో ఉమెన్ కనెక్ట్ చాలెంజ్ మొదలైనవి ప్రకటించనున్నట్లు గ్రీన్ వివరించారు.
అంచనాలు మించిన జీఈఎస్..
మూడు రోజులపాటు జరిగిన జీఈఎస్‌కి అంచనాలను మించిన స్పందన లభించిందని మార్క్ గ్రీన్ హర్షం వ్యక్తం చేశారు. స్థానికంగా లభించిన ఆదరణ, యువ ఎంట్రప్రెన్యూర్స్ ఉత్సాహంగా పాలుపంచుకున్న తీరు ఎంతో స్ఫూర్తిదాయకమని ఆయన చెప్పారు. స్వయం సమృద్ధి సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్న భారత్‌తో అమెరికాకు దృఢమైన బంధం ఉందని గ్రీన్ పేర్కొన్నారు. సుమారు 60 ఏళ్ల క్రితం అమెరికా నుంచి ఆహారపరమైన సాయం అందుకున్న స్థాయి నుంచి ప్రస్తుతం భారత్ సమాన భాగస్వామి స్థాయికి ఎదగడం అభినందనీయమని పేర్కొన్నారు. అమెరికా, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు పటిష్టం కావడానికి జీఈఎస్ దోహదపడగలదని యూఎస్‌ఏఐడీ సీనియర్ డిప్యూటీ అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటర్ మిషెలీ బెకరింగ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment