
పునర్నిర్మాణంలోనూ ఉద్యోగులదే కీలకపాత్ర
చిలకలగూడ,న్యూస్‌లైన్: తెలంగాణ పునర్మిర్మాణంలో కూడా ఉద్యోగులే కీలకపాత్ర పోషించాలని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొ.కోదండరాం స్పష్టంచేశారు. శుక్రవారం జీహెచ్‌ఎంసీ సికింద్రాబాద్ సర్కిల్ అధికారుల ఆధ్వర్యంలో జోనల్ కార్యాలయం వద్ద జరి గిన తెలంగాణ ఆవిర్భావ సంబురాలకు ముఖ్యఅతి థిగా విచ్చేసిన కోదండరాం మాట్లాడారు.
ఎందరో త్యా గాల ఫలితంగా సిద్ధించిన తెలంగాణను బంగారు తెల ంగాణగా మార్చేందుకు ప్రతిఒక్కరూ తమవంతు కృషిచేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఉద్యోగులు సికింద్రాబాద్ క్లాక్‌టవర్ సమీపంలోని అమరవీ రులస్థూపం వద్ద నివాళులర్పించి జీహెచ్‌ఎంసీ కార్యాలయం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.
నాటితరం పోరాటయోధులకు సన్మానం : తెలంగాణ ఆవిర్భావ సంబరాల్లో భాగంగా నాటితరం తెలంగాణ పోరాటయోధులకు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. 1969 ఉద్యమంలో ప్రత్యేకరాష్ట్రం కోసం పోరాడిన మాజీ డిప్యూటీమేయర్ మేడం రామచంద్రయ్య, పీజే సూరి, హరినారాయణయాదవ్, రంజిత్‌సిన్హాలను సికింద్రాబాద్ డీసీ విజయ్‌రాజ్ శాలువాలు కప్పి సన్మానించారు. మేడం రామచంద్రయ్య మాట్లాడుతూ..‘తనకు 95 ఏళ్లని, ప్రత్యేక తెలంగాణను చూస్తాననుకోలేదని, నాటి ఆశలు నేడు సాకారం కావడం ఎంంతో సంతోషంగా ఉందని’ నాటి ఉద్యమ ఘటనలు గుర్తుచేసుకున్నారు.
దుమ్మురేపిన ధూంధాం : తెలంగాణ అవిర్భావ సంబరాల్లో నిర్వహించిన ధూంధాం కార్యక్రమం దుమ్మురేపింది. సాయిచందు నేతృత్వంలో కళాకారులు ఆలపించిన తెలంగాణ ఉద్యమగీతాలు ఆహుతుల్లో మరింత ఉత్సాహం నింపాయి. నాటితరం తెలంగాణ పోరాటయోధులు సైతం చిందేసి తమ ఆనందాన్ని పంచుకున్నారు.