ఏజెన్సీలో వైద్య సేవలు మెరుగుపర్చాలి
కొత్తగూడెం రూరల్: సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న దృష్ట్యా ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలను మెరుగుపర్చాలని డీఎంహెచ్‌ఓ భానుప్రకాష్‌ను ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మండలంలోని పెనుగడప గ్రామాన్ని ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లుతో కలిసి ఎంపీ సోమవారం సందర్శించారు. తొలుత పెనుగడప ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. రోజుకు ఎంతమంది ఓపీలను పరీక్షిస్తున్నారని, ఎంత మంది వైద్యు లు ఉన్నారని డాక్టర్ గురుభార్గవ్‌ను అడిగి తెలుసుకున్నారు. రోజుకు సుమారు వంద మందిని పరీక్షిస్తున్నామని, ఇద్దరు డాక్టర్లు ఇద్దరే ఉన్నారని గురుభార్గవ్ తెలిపారు. దీంతో డీఎంహెచ్‌ఓతో ఎంపీ ఫోన్‌లో మాట్లాడారు.
ఏజెన్సీలో విష జర్వాలు ప్రబలుతున్నాయని, మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. వైద్యులు తక్కువ ఉన్నచోట అదనంగా నియమించాలని ఆదేశించారు. పెనుగడప లో విషజర్వాలు తగ్గుముఖం పట్టే వరకూ వైద్య శిబిరం కొనసాగించాలన్నారు. జర్వ పీడితుల రక్తం సేకరించి పరీక్షలు నిర్వహించాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలకు పూర్తి స్థాయిలో అవగహన కలిగి ఉండాలన్నారు. వర్షా కాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు రాకుండా అధికారులు పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు. ఇదిలా ఉండగా ఓపెన్‌కాస్ట్ వల్ల తాము ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోం దని పలువురు గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకొచ్చారు.
దీనిపై సింగరేణి అధికారులతో మాట్లాడుతానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం పెనుగడపలో విష జర్వంతో మృతి చెందిన కమాలుద్దీన్ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ఎంపీ పర్మామర్శించారు. డెంగ్యూ తో బాధపడుతున్న జలీల్‌ను పరామర్శించారు. కార్యక్రమంలో ఎంపీపీ బాణోతు కేస్లీ, సర్పంచ్ మాళోతు కళావతి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, మిట్టపల్లి పాండురంగచార్యులు, వైఎస్సార్‌సీపీ నాయకులు జె. బి.ఎస్.చౌదరి, కందుల సుధాకర్‌రెడ్డి, తహశీ ల్దార్ అశోక్ చక్రవర్తి, ఎంపీడీవో శాంత దేవి, ఈఓపీఆర్డీ రమేష్, ప్రబాకర్, రాజేశ్వరి, పెనుగడప గ్రామ కమిటీ అధ్యక్షుడు గోర్రె బాబు, దుర్గ, కిరణ్, కారం సీతయ్య, వేముల రాము, సుధాకర్, విజయ భాస్కర్ పాల్గొన్నారు.
ట్రాక్టర్ల తయారీలో కొత్త టెక్నాలజీ రావాలి
ఖమ్మం అర్బన్ : వ్యవసాయ రంగానికి మరింత ఉపయోగపడేలా ఆధునిక టెక్నాలజీతో ట్రాక్టర్లు తయారీ జరగాలని ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మంలోని బైపాస్‌రోడ్డులో ఏర్పాటు చేసిన పవర్ ట్రాక్ కంపెనీకి చెందిన శ్రీవెంకట పద్మావతి ట్రాక్టర్ల షోరూంను ఎంపీ సోమవారం సందర్శించారు. కూలీల కొరత, పెరుగుతున్న వ్యవసాయ పెట్టుబడులను దృష్టిలో పెట్టుకుని తక్కువ ఖర్చుతో ఆయా కంపెనీలు ట్రాక్టర్ల తయారీ చేపట్టాలన్నారు. ఎంపీతో వెంట శ్రీవెంకట పద్మావతి ట్రాక్టర్ షోరూం మేనేజింగ్ డెరైక్టర్ కోయ రాజేష్‌కుమార్, ప్రోప్రైటర్ కోయ రామయ్య, వైఎస్సార్‌సీపీ నాయకుడు ఆకుల మూర్తి తదితరులు ఉన్నారు.
రామయ్య సన్నిధిలో పొంగులేటి
భద్రాచలం టౌన్: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి దేవస్థానంలో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అశ్వారావుపేట, పినపాక ఎమ్మేల్యేలు తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు సోమవారం ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఏఈఓ శ్రవణ్‌కుమార్, ప్రధాన అర్చకుడు పొడిచేటి జగన్నాథాచార్యులు ఆల య మర్యాదలతో స్వాగతం పలికారు. ఎంపీ, ఎమ్మెల్యేలు ఆలయ చుట్టూ ప్రదక్షిణలు చేసి, అంతరాలయంలో మూలమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ లక్ష్మీతాయారు అమ్మవారు, అభయాంజనేయస్వామి వారి ఉపాలయాల్లో పూజలు జరిపారు.
ఆలయ ప్రాశస్థాన్ని అర్చకులను అడిగి తెలుసుకున్నారు. రుష్యమూఖ మ్యూజియంలో సీతారామ లక్ష్మణుల ఆభరణాలను తిలకించి వాటి గురించి వివరాలు తెలుసుకున్నారు. దేవస్థానం తరఫున ఎంపీ, ఎమ్మేల్యేలకు ఏఈఓ శ్రావణ్‌కుమార్ జ్ఞాపిక, స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ భద్రాచలం నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ తెల్లం వెంకట్రావ్, బీసీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యులు కడియం రామాచారి, సీనియర్ నాయకులు మంత్రిప్రగడ నర్సింహారావు, గంటా కృష్ణ, మహిళా నాయకురాలు దామర్ల రేవతి, మహేష్, బిజ్జెం శ్రీనివాసరెడ్డి, వీరంరెడ్డి వెంకటేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.