- తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు
గణపురం: కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలోని 600 మెగావాట్ల రెండోదశ ప్లాంట్‌లో 2015 మార్చి31 నాటికి వెలుగులు విరజిమ్ముతాయని తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు. గణపురం మండలం చెల్పూరు శివారులోని కేటీపీపీ రెండో దశ ప్లాంట్ పనులను శుక్రవారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రభాకర్‌రావు విలేకరులతో మాట్లాడారు. రెండో దశ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించడమే కాకుండా అధికారులు, కాంట్రాక్ట్ కంపెనీల ప్రతినిధులతో సమీక్షిస్తున్నామని చెప్పారు.
రెండో దశ ప్లాంట్ పనుల్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమే అయినప్పటికీ... నాలుగు నెలలుగా పనులు పుంజుకున్నాయన్నారు. 2014 డిసెంబర్‌లో బాయిలర్ హైడ్రాలిక్ టెస్ట్ ఉంటుందని, 2015 మార్చిలో ప్లాంటులో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నారు. వర్షాకాలంలో పనులు సక్రమంగా జరగని మాట వాస్తవ మేననని, నెలలో ఒకటి రెండు సార్లు ప్లాంటులో నిర్మాణ పనులను విద్యుత్ సౌధ అధికారులు వచ్చి పరిశీలిస్తున్నారని చెప్పారు.
ఇకపై తతాను నెలకోసారి వస్తానన్నారు. బొగ్గు కొరత రాకుండా తగిన ఏర్పాట్లల్లో ఉన్నామని, ప్రస్తుతం లక్ష మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయన్నారు. కరీంనగర్ జిల్లా తాడిచర్లలోని జెన్‌కోకు చెందిన బొగ్గుబ్లాకు రద్దయిన విషయం అందరికి తెల్సిందేనని ఆయన గుర్తు చేశారు. విద్యుత్ అవసరాల దృష్ట్యా తాడిచర్ల బ్లాక్‌ను తిరిగి జెన్‌కోకు కేటాయించే విధంగా కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకు వ చ్చే ప్రయత్నంలో ఉందన్నారు.
దుబ్బపల్లి గ్రామం తరలింపు పై దృష్టి సారించామని , పునరావాస ప్యాకేజీకి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇప్పటికే భూసేకరణ జరిగిందని, ములుగు ఆర్టీఓ ఖాతాలో రూ.27 కోట్లు జమ చేసినట్లు వెల్లడించారు. రెవెన్యూ అధికారులదే జాప్యమని, నాలుైగె దు చోట్ల భూములను కూడా పరిశీలించినట్లు పేర్కొన్నారు. అనంతరం అధికారులతో ఆయన సమీక్షించారు. పనుల్లో నిర్లక్ష్యంపై అధికారులను మందలించినట్లు సమాచారం.
కాంట్రాక్టు కంపెనీలకు సైతం జరిమానా విధిస్తామని హెచ్చరించినట్లు తెలిసింది. జెన్‌కో డెరైక్టర్ సచ్చితానందం, కేటీపీపీ సీఈ శివకుమార్, సివిల్ సీఈ అజయ్, ఎస్‌ఈలు సురేష్‌బాబు, వెంకటేశ్వరరావు ,ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. కాగా, తెలంగాణ జెన్‌కో సీఎండీ ప్రభాకర్ రావు కేటీపీపీని సందర్శించిన క్రమంలో వార్తల కవరేజీకి వచ్చిన ప్రింట్,ఎలక్ట్రానిక్ మీడీయా విలేకరులను ప్లాంట్‌లోనికి అనుమతించలేదు. దాదావు 8 గంటలపాటు అధికారులనుంచి పిలుపు రాకపోవడంతో ఆగ్రహించిన విలేకరులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. చివరకు ఈ విషయం సీఎండీ దృష్టికి తీసుకురాగా... ఇంకోసారి అలా జరగకుండా చూస్తానని పేర్కొన్నారు.