సూత్రధారి బాసే! | in revanth reddy case cm chandrababu main person! | Sakshi
Sakshi News home page

సూత్రధారి బాసే!

Published Mon, Jun 8 2015 1:50 AM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

సూత్రధారి బాసే! - Sakshi

సూత్రధారి బాసే!

⇒ అడ్డంగా దొరికిన చంద్రబాబు
⇒ స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణ ఆడియో టేపు బట్టబయలు
⇒ ఎమ్మెల్యేల బేరసారాల సూత్రధారి ఏపీ ముఖ్యమంత్రే
⇒ రేవంత్‌రెడ్డి చెప్పిన ప్రతీ మాటకు కట్టుబడతామని స్పష్టమైన హామీ
⇒ కంగారు పడాల్సిందేమీ లేదని భరోసా ఇచ్చిన ఏపీ సీఎం
⇒ ఏ క్షణంలోనైనా చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం
⇒ ఈ విషయాన్ని గవర్నర్‌కు తెలియజేసిన సీఎం కేసీఆర్
⇒ చంద్రబాబు పాత్రకు సంబంధించి ఏసీబీ వద్ద మరిన్ని ఆధారాలు
⇒ టీడీపీ అధినేత అరెస్టుకు అవకాశం ఉందంటున్న ఉన్నతాధికారవర్గాలు

 
 సాక్షి, హైదరాబాద్:  ఎప్పుడూ నీతి నిజాయితీ అంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు నిజ స్వరూపం బట్టబయలైంది. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి అయినా ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకొనేందుకు ఏపీ సీఎం చేసిన కుట్ర తేటతెల్లమైంది. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు ముడుపులు ఇవ్వజూపిన వ్యవహారంలో సూత్రధారి చంద్రబాబే అన్నది స్పష్టంగా తేలిపోయింది. ‘బాస్’ పంపితే వచ్చానన్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి మాటల్లోని ‘బాస్’ చంద్రబాబే అని మీడియాకు అందిన ఆడియో రికార్డుల్లో స్పష్టంగా వెల్లడైంది. స్టీఫెన్‌సన్‌తో ఆ ‘బాస్’ చంద్రబాబు నేరుగా ఫోన్‌లో మాట్లాడారు. రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటామని స్వయంగా భరోసా ఇచ్చారు. అన్ని విషయాల్లో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సంభాషణ రికార్డులు మీడియాకు విడుదల అయ్యాయి.
 ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీని గెలిపించుకోవడానికి సరిపోయే బలం తెలంగాణ టీడీపీకి లేకపోయినా చంద్రబాబు పార్టీ తరఫున అభ్యర్థిని బరి లోకి దింపారు. ఆ అభ్యర్థిని గెలిపించుకోవడానికి అన్ని అడ్డదారులు తొక్కారు. ఎనిమిది మంది ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారు. నిధుల సేకరణకు పారిశ్రామికవేత్తలను ఉపయోగించుకున్నారు. ఎమ్మెల్యేలతో బేరసారాలు చేసే బాధ్యతను తెలంగాణ టీడీపీ నేతలకు అప్పగిం చారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు ముందు రోజు అంటే మే 31న (ఆదివారం) సాయంత్రం నామినేటెడ్ ఎమ్మెల్యేకు రూ.50 లక్షలులంచం ఇస్తూ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.

లేకపోతే ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి కచ్చితంగా 20 ఓట్లు వచ్చి ఉండేవి. హైదరాబాద్‌లో రేవంత్ పట్టుబడటంతోనే ఇతర ఎమ్మెల్యేలకు అడ్వాన్స్ రూపంలో ఇచ్చేందుకు తీసుకెళుతున్న డబ్బు మూటలు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాయి. అప్పటికే అడ్వాన్స్ తీసుకున్న ఎమ్మెల్యేలు వాటిని తిప్పిపంపారు. ఇలా ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో స్టీఫెన్‌సన్‌తో బాబు మాట్లాడిన రికార్డులే కాకుండా ఇతరత్రా ఆధారాలను కూడా ఏసీబీ ఇప్పటికే సేకరించింది.

 ఏక్షణంలోనైనా ఆయనకు నోటీసులు
 ఎమ్మెల్యేల బేరసారాల కేసులో సూత్రధారి అయిన చంద్రబాబును ప్రశ్నించేందుకు ఏసీబీ అధికారులు ఏ క్షణంలోనైనా ఆయనకు నోటీసులు జారీచేసే అవకాశముంది. చంద్రబాబును విచారించేందుకు అవసరమైన అన్ని ఆధారాలను ఏసీబీ ఇప్పటికే సేకరించి పెట్టుకుంది. రేవంత్ ఇవ్వజూపిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందన్న వివరాలు కూడా ఏసీబీ దగ్గర ఉన్నాయి. మంగళవారం (9వ తేదీన) విచారణకు హాజరు కావాల్సిందిగా చంద్రబాబుకు నోటీసులు జారీచేసే అవకాశం ఉందని అత్యున్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఎమ్మెల్యేల కొనుగోలుకు పార్టీ నేతలను ప్రోత్సహించిన ఘటనలు దేశంలో ఇప్పటిదాకా లేవు. ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించుకునేందుకు చంద్రబాబు సాగించిన అక్రమాల పర్వంలో మరిన్ని ఆధారాలు కూడా త్వరలో బయటపడతాయని... ఈ బేరసారాల్లో ప్రధాన పాత్ర వహించిన టీడీపీకి చెందిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, తెలంగాణ టీడీపీ కీలక నేత ఒకరిని కూడా విచారించే అవకాశం ఉందని ఏసీబీ వర్గాలు చెప్పాయి. చంద్రబాబుకు నోటీసు ఇవ్వడంతో పాటు ఆయనను అరెస్ట్ చేసే అవకాశం లేకపోలేదని ఆ వర్గాలు వెల్లడించాయి.

 గవర్నర్‌కు వివరించిన కేసీఆర్..
 స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు బేరసారాల నేపథ్యంలో ఆయనపై చర్య తీసుకునే విషయాన్ని సీఎం కేసీఆర్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. బాబును విచారించేందుకు ఏ క్షణంలోనైనా నోటీసు జారీ చేస్తారని తెలియజేశారు. ఆదివారం రాత్రి రాష్ట్ర అవతరణ ముగింపు ఉత్సవాల్లో గవర్నర్‌తో వేదిక పంచుకున్న కేసీఆర్.. ఉత్సవాలు ముగిసిన వెంటనే రాజ్‌భవన్‌కు వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

 రూ.5 కోట్లు ఇస్తామన్న రేవంత్..
 ఓటుకు నోటు వ్యవహారంలో అరెస్ట్ కావడానికి ముందు స్టీఫెన్‌సన్‌కు రేవంత్‌రెడ్డి అనేక హామీలు ఇచ్చారు. టీడీపీ అభ్యర్థికి ఓటేస్తే రూ.5 కోట్లు ఇస్తామని ప్రలోభ పెట్టారు. రూ.2 కోట్ల వరకు ఇచ్చేందుకు తనకు అనుమతి ఉందని, రూ.5 కోట్లు కాబట్టి ‘బాస్’తో మాట్లాడిస్తానని చెప్పారు. ఈ వ్యవహారాన్ని టీఆర్‌ఎస్ గుర్తించి ఇబ్బంది పెడితే ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నామినేటెడ్ ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు. చంద్రబాబుతో ఫోన్‌లో మాట్లాడించారు. రేవంత్ ఇచ్చిన ఈ హామీలన్నింటికీ తాను కట్టుబడి ఉన్నట్లు స్టీఫెన్‌సన్‌కు చంద్రబాబు స్వయంగా భరోసా ఇచ్చారు.
 
 
 స్టీఫెన్‌సన్‌తో చంద్రబాబు ఫోన్ సంభాషణ
 
     చంద్రబాబు అనుచరుడు: హలో.. యా బ్రదర్.. బాబుగారు గోయింగ్ టు టాక్ టు యూ.. బి ఆన్ ద లైన్ (హలో బ్రదర్. బాబు గారు మీతో మాట్లాడతారు. లైన్‌లో ఉండండి)
     స్టీఫెన్‌సన్: యా..
     చంద్రబాబు: హలో..
     స్టీఫెన్‌సన్: సార్...
 గుడ్ ఈవెనింగ్ సార్..
     చంద్రబాబు: గుడ్ ఈవెనింగ్ బ్రదర్.. హౌ ఆర్ యూ (మీరు ఎలా ఉన్నారు..?)
     స్టీఫెన్‌సన్: ఫైన్.. థాంక్యూ సర్
     చంద్రబాబు: మన వాళ్లు బ్రీఫ్‌డ్ మి.. ఐయామ్ విత్ యూ.. డోంట్ బాదర్ (మనవాళ్లు నాకు అంతా వివరిం చారు. మీకు అండగా నేనున్నాను. కంగారు పడాల్సిందేమీ లేదు)
     స్టీఫెన్‌సన్: యస్ సార్.. రైట్ సార్ (మంచిది సర్)
     చంద్రబాబు: ఫర్ ఎవ్రీ థింగ్ అయామ్ విత్ యూ.. వాట్ ఆల్ దే స్పోక్... విల్ ఆనర్ (దేనికైనా మీకు నేను అండగా ఉంటా.. వాళ్లు మీతో మాట్లాడినవన్నీ నెరవేరుస్తాం)
     స్టీఫెన్‌సన్: యస్ సార్.. రైట్ సార్
     చంద్రబాబు: ఫ్రీలీ యూ కెన్ డిసైడ్.. నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్ (మీరు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు. ఎలాంటి సమస్యా లేదు)
     స్టీఫెన్‌సన్: ఓకే సార్.. (మంచిది సార్)
     చంద్రబాబు: దటీజ్ అవర్ కమిట్‌మెంట్.. వియ్ విల్ వర్క్ టుగెదర్ (అది మా హామీ.. మనం కలసి పనిచేద్దాం)
     స్టీఫెన్‌సన్: రైట్.. థాంక్యూ సార్..
     చంద్రబాబు: థాంక్యూ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement