ఇక టీఎస్ 2
తిమ్మాపూర్ : తెలంగాణ రాష్ట్రంలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు సిరీస్ విషయంలో సందిగ్ధతకు తెరపడింది. తెలంగాణ స్టేట్ (టీఎస్)గా కేంద్రం నుంచి గెజిట్ నోటిఫికేషన్ రావడంతో అటు రవాణా శాఖాధికారులతో పాటు ఇటు వాహనదారుల్లో అయోమయం తొలిగింది. అయితే జిల్లాల వారీగా కోడ్ నంబర్లు సర్కారు అధికారికంగా ప్రకటిం చాల్సి ఉంది.
గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అల్ఫాబెటిక్ క్రమంలో కోడ్ నంబర్లు ఉండగా, జిల్లాకు ఏపీ 15 ఉం డేది. ప్రస్తుతం రాష్ట్రంలో భౌగోళిక పరిస్థితుల ఆధారంగా అదిలాబాద్‌కు టీఎస్ 1, కరీంనగర్ టీఎస్ 2 సీరిస్ కేటాయించినట్లు సమాచారం. దీనిపై ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన వెంటనే జిల్లాలో టీఎస్ 2 సిరీస్‌పై వాహనాల రిజస్ట్రేషన్ చేసేందుకు రవాణా శాఖ సన్నద్ధమైంది. ఈ విషయమై ఆర్టీవో దుర్గాప్రమీలను వివరణ కోరగా.. గురువారం రాత్రి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని తెలిపారు. శుక్రవారం ఉదయం ఆదేశాలు వస్తే దాని ప్రకారం రిజిస్ట్రేషన్లు చేస్తామన్నారు.
పాత వాహనాలకు సైతం..
ఇక కొత్త వాహనాలకు తెలంగాణ స్టేట్ (టీఎస్) పైనే రిజిస్ట్రేషన్లు జరుగనుండగా, పాత వాహనాలకు సైతం నాలుగు నెలల్లోగా టీఎస్‌గా మార్చుకోవాలని రవాణా శాఖ సూచిస్తోంది. సిరీస్, కోడ్ నంబరుతో పాటు వాహనాల నంబర్ కూడా మారుతుందనే ప్రచారం జరుగుతండడంతో వాహనాదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫ్యాన్సీ నంబర్లు తీసుకున్న వాళ్లలో ఈ ఆందోళన అధికంగా ఉంది. అయితే పాత నంబర్లు మారవని, ఏపీ స్థానంలో టీఎస్ సిరీస్‌తో పాటు కోడ్ నంబరు మాత్రమే మారుతుందని సర్కారు పేర్కొంది. ఈ విషయంపై మరింత స్పష్టత కోసం అటు రవాణా శాఖ అధికారులు, ఇటు వాహనదారులు ఎదురుచూస్తున్నారు.