సాక్షి, హైదరాబాద్: పోలీసుశాఖలో కానిస్టేబుల్, ఎస్‌ఐ స్థాయి నియామకాలకు బ్రేక్ పడింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ప్రకటన వెలువడిన నేపథ్యంలో నియామక ప్రక్రియ వాయిదాపడక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఎస్‌ఐ, కానిస్టేబుల్ స్థాయిలో 11,623 పోస్టులను భర్తీచేసేందుకు ప్రభుత్వం జూన్ మూడో తేదీన ఆమోదం తెలిపింది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా వెలువడిం ది. సివిల్, ఆర్మ్‌డ్ రిజర్వు, ఏపీఎస్పీతోపాటు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, జైళ్లు, అగ్నిమాపక శాఖ లలో పోస్టులను భర్తీచేయాల్సి ఉంది.
ప్రస్తుతం రాత పరీక్ష జరిగిన పోలీసు నియామక ఫలితాలను విడుదల చేసిన అనంతరం కొత్త నోటిఫికేషన్ ఇచ్చేవిధంగా రిక్రూట్‌మెంట్ బోర్డు సన్నాహాలు చేసింది. తీరా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన వెలువడటంతో పోలీసు నియామక ప్రక్రియకు బ్రేక్‌పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విభజన పక్రియ పూర్తయిన తరువాత ఆయా రాష్ట్రాలలో ఖాళీల సంఖ్యకు అనుగుణంగా నియామకాలు చేపట్టడమే మంచిదని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల ప్రకారం కానిస్టేబుల్, ఎస్‌ఐ నియామకాలు పూర్తిచేయడానికే మరో మూడు నెలలకాలం పట్టే అవకాశం ఉంది.
ఈ మూడు నెలలకాలంలో నియామకాల ప్రక్రియ పూర్తిచేసేవిధంగా పోలీసుశాఖ ప్రణాళిక రూపొందించింది. ఈ నేపథ్యంలో కొత్త నోటిఫికేషన్ల జోలికి వెళ్లకపోవడమే మంచిదని అధికారులు నిర్ణయించారు. దీంతో కొత్త నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థుల ఆశలు అడియాశలయ్యాయి. రాష్ట్రాల విభజన అనంతరం జనాభా ప్రాతిపదికన ఏ రాష్ట్రానికి ఎంత శాతం సిబ్బందిని కేటాయించాలనేది నిర్ణయించనున్నారు. అందుకు అనుగుణంగానే పోలీసు సిబ్బందిని రెండు రాష్ట్రాలకు బదలాయిస్తారు. జోన్లవారీగా నియామకాలు జరిగినందున సిబ్బంది కేటాయింపు విషయంలో సమస్యలూ తలెత్తే అవకాశం లేదు. కిందిస్థాయి సిబ్బంది బదలాయింపు ప్రక్రియను పూర్తిచేసిన అనంతరం ఖాళీలకు అనుగుణంగా రెండు రాష్ట్రాలలో వేర్వేరుగా నియామకాలు చేపడతారు. ఈలోగానే పాతనోటిఫికేషన్లకు సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తిచేసేందుకు పోలీసుశాఖ చర్యలు వేగవంతంచేసింది.
కొత్త రాష్ర్టం ఏర్పాటు తర్వాతే పోలీసు నియామకాలు
Published Wed, Aug 7 2013 5:38 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement