రాత్రికిరాత్రి మార్చేశారు!
► జిల్లాల విభజనపై ప్రొఫెసర్ కోదండరాం
► నోటిఫికేషన్ ఓ రకంగా తుది ప్రకటన మరో రకంగానా..?
► ప్రజాభీష్టాన్ని పట్టించుకోకుండా విభజించారని ఆరోపణ
► ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్
సాక్షి, హైదరాబాద్: ‘జిల్లాల పునర్విభజన ప్రజల అభీష్టం మేరకు జరగలేదు. అందుకే చాలా ప్రాంతాల్లో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఆందోళనలే ఇందుకు నిదర్శనం. ఆందోళన చేస్తున్న వారిని ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించాలి. అలా కాకుండా పోలీసులను పెట్టి అణచివేసే ప్రయత్నం చేయటం సరికాదు. తమ డిమాండ్లను పట్టించుకోవటం లేదన్న ఆవేదనతో ఇటీవల ముగ్గురు ఆత్మహత్యకు యత్నించగా.. ఇద్దరు మృతి చెందారు. ప్రభుత్వం వెంటనే మేల్కొనకపోతే ఈ ఆత్మహత్యలు పెరిగే ప్రమాదం ఉంది. ప్రజలు నేరుగా మాట్లాడే అవకాశాన్ని ముఖ్యమంత్రి కల్పించాలి. సహేతుకమైన ఆందోళనలకు తమ పూర్తి మద్దతు ఉంటుంది’ అని తెలంగాణ జేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. జిల్లాల విభజనలో భాగంగా మండలాలు, గ్రామాల విలీనాలకు సంబంధించి ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరుతూ సోమవారం జేఏసీ ప్రతినిధులతో కలసి ఆయన సీఎస్ రాజీవ్ శర్మకు వినతి పత్రం అందజేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసుకున్నాక..
జిల్లాల విభజనకు సంబంధించి తొలుత నోటిఫికేషన్ ఓ రకంగా వెలువడగా, తుది నిర్ణయం మరోలా వచ్చిందని విమర్శించారు. ప్రజలతో ప్రమేయం లేకుండా రాజకీయ నేతల ఒత్తిళ్లతోనో, మరే కారణాలతోనో రాత్రికిరాత్రే మార్పులు చేర్పులు జరగటం స్థానికులను ఆందోళనకు గురి చేసిందన్నారు. గట్టుప్పల్ మండలం ఉంటుందని ప్రకటన వెలువడటంతో స్థానికంగా మండల కేంద్రం ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాక.. ముందురోజు రాత్రి దాన్ని రద్దు చేయటమే ఇందుకు నిదర్శనమన్నారు. దీన్ని జీర్ణించుకోలేక బొడిగ సోని అనే యువతి ఆత్మహత్య చేసుకుందని, ఏర్పుల యాదయ్య అనే యువకుడు ఆత్మహత్యకు యత్నించి తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
నిజామాబాద్ (పాత) జిల్లా పరిధిలోని నాగిరెడ్డిపేట మండలాన్ని సమీపంలోని మెదక్ జిల్లాలో కలపాలని స్థానికులు గట్టిగా కోరగా, దూరంగా ఉన్న కామారెడ్డి జిల్లాలో కలపటంతో మనస్తాపం చెందిన స్థానిక దళిత యువకుడు రాజు హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌పై ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. వెనకబడ్డ నారాయణపేట ప్రాంతాలను ప్రత్యేక జిల్లా చేయాలనే కోరిక స్థానికుల్లో బలంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోకపోవటంతో అక్కడ ఆందోళనలు కొనసాగుతున్నాయని వివరించారు. కొడంగల్, దౌల్తాబాద్ మండలాలను వికారాబాద్ జిల్లాలో విలీనం చేయటాన్ని అక్కడి ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ఆ డిమాండ్లను పరిశీలించకుండా పోలీసులతో అణచివేస్తుండటం దారుణమని విమర్శించారు.
రంగారెడ్డి-నల్లగొండ సరిహద్దులో ఉన్న మాల్ గ్రామం రెండు జిల్లాల పరిధిలో సగంసగం కలవటం గందరగోళాన్ని సృష్టిస్తోందన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన, యత్నించిన వారి కుటుంబాలను ఆదుకోవటంతోపాటు ఆందోళనల సందర్భంగా పెట్టిన పోలీసు కేసులను ఎత్తేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనకారులతో చర్చ లు జరిపి సమస్య పరిష్కరించాలని కోరారు.
సమాధానం తెలుసుగా..
ప్రజలకు సీఎం అపాయింట్‌మెంట్ దొరికితే నేరుగా సమస్యలు చెప్పుకుంటారని, పెద్ద సారుకు విన్నవించినందున సమస్యలు పరిష్కారమవుతాయన్న సంతృప్తితో వెనుదిరుగుతారని కోదండరాం పేర్కొన్నారు. విన్నపాన్ని నేరుగా సీఎంకు కాకుండా సీఎస్‌కు ఎందుకిచ్చారని విలేకరులు ప్రశ్నించగా, ‘సమాధానం ఏం వస్తుందో తెలిసి ఈ ప్రశ్న వేయటమెందుకు’ అంటూ దాటవేశారు. కొంతకాలంగా కోదండరాంకు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ లభించటం లేదని ఆయన అనుయాయులు పేర్కొంటున్న సంగతి తెలిసిందే.