రెండో సారి షీకి చిక్కితే నిర్భయ కేసు
రెండు నెలల్లో 80 మంది అరెస్టు
అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా
సిటీబ్యూరో: ఈవ్‌టీజింగ్ కేసులో రెండో సారి పట్టుబడితే వారిపై నిర్భయ చట్టం ప్రయోగిస్తామని అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్ అండ్ సిట్) స్వాతిలక్రా హెచ్చరించారు. రెండు నెలల క్రితం ఏర్పాటు చేసిన ‘షీ టీమ్’లకు శనివారం వరకు 80 మంది యువకులు చిక్కారని ఆమె తెలిపారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో స్వాత్రిలక్రా వివరాలు వెల్లడించారు. షీ బృందాలకు చిక్కిన వారిలో 16 మందిని కోర్టులో హాజరుపర్చగా, ఎనిమిది మందికి జైలు శిక్ష పడిందన్నారు. ఈవ్‌టీజింగ్ ఎక్కువగా మెహదీపట్నంలోని సెయింట్ ఆన్స్ కళాశాల, దిల్‌సుఖ్‌నగర్ లోని ఎన్‌ఆర్‌ఐ కళాశాల, మలక్‌పేటలోని వాణి కళాశాల, కోఠి, ఎస్‌ఆర్‌నగర్, నారాయణగూడ, ట్యాంక్‌బండ్ బస్టాప్‌లు, సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేషన్‌లలో చోటు చేసుకున్నాయన్నారు. బాధితుల నుంచి 100కు ఫోన్‌లు రాగానే సీసీఎస్ ఏసీపీ కవిత వెంటనే స్పందించి ఆ ఏరియాలోని షీ టీమ్స్‌ను అప్రమత్తం చేస్తున్నారని తెలిపారు.
రద్దీ ప్రాంతాల్లో షీ టీమ్స్ సిబ్బంది కరపత్రాలు, బుక్‌లెట్లు పంచుతూ ఈవ్‌టీజింగ్‌పై ఫిర్యాదు చేయాలని మహిళలకు ధైర్యం చెబుతున్నారని వివరించారు. నగరంలో అన్ని పాఠశాలలో త్వరలో చైల్డ్ అబ్యూజింగ్ మేనేజింగ్ కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ప్రయివేటు సంస్థలు కూడా మహిళా ఉద్యోగుల రక్షణ కోసం కమిటీలు వేసుకోవాలని సూచించారు. ఈవ్‌టీజింగ్‌పై షార్ట్‌ఫిలింలు రూపొందించామని, వాటిని సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తామన్నారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడి, పట్టుబడిన కొందరు యువకులు మీడియాతో మాట్లాడుతూ, తాము సైతం ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు సహకారం అందిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో డీసీపీ పాలరాజు, అదనపు డీసీపీ జె.రంజన్త్రన్, ఏసీపీ కవితలు పాల్గొన్నారు.