సిద్దిపేట రూరల్/పటాన్‌చెరు/మునిపల్లి : జిల్లాలోని వేర్వేరు ప్రాంతల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్ద రు గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట పట్టణంలోని భారత్ నగర్‌కు చెందిన లక్ష్మినారాయణ (50) బుధవారం రాత్రి ఎన్సాన్‌పల్లి రోడ్డులో నిల్చున్నాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని ట్రాక్టర్ వెనకాల వచ్చి ఢీ కొట్టింది. దీంతో లక్ష్మినారాయణను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
దీంతో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్‌టౌన్ ఎస్‌ఐ సత్యనారాయణ తెలిపారు.
బైక్, లారీ ఢీ..
పటాన్‌చెరు : జాతీయ రహదారిపై బైక్‌ను లారీ ఢీకొట్టిన సంఘటనలో ఒకరు మృతి చెందాడు. పటాన్‌చెరు సీఐ కృష్ణయ్య కథనం మేరకు.. నారాయణఖేడ్ నియోజకవర్గం కల్హేర్ మండలం ఖాజాపూర్ గ్రామానికి చెందిన సీహెచ్ నరసింహులు ద్విచక్రవాహనంపై హైదరాబాద్ హైదర్‌నగర్‌లో ఉంటున్న అత్తారింటికి బయలుదేరాడు. అయితే పటాన్‌చెరు మండల పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌పేట ైబె పాస్ రోడ్డు చౌరస్తాకు వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న లారీ (ఏపీ 21ఎన్ 7270) ఢీ కొంది. ప్రమాదంలో బైక్‌ను నడుపుతున్న నరసింహు లు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సంగారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు. మృతుడికి భార్య నలుగురు పిల్లలు ఉన్నారు.
రెండు బైకులు ఢీ..
పటాన్‌చెరు : జాతీయ రహదారిపై రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన మండలంలోని లక్డారం గ్రామ శివారులో జాతీయ రహదారిపై బుధవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ వెంకటేశం కథనం మేరకు.. లక్డారం గ్రామానికి చెందిన ఉప్పరి దేవేందర్ తన ఇంటి నుంచి పటాన్‌చెరు వైపునకు బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న మరో ద్విచక్రవాహనం దేవేందర్ ప్రయాణిస్తున్న బైక్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో దేవేందర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో స్థానికులు అతడిని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటేశం తెలిపారు.
లారీ, జీపు ఢీ : ఒకరికి గాయాలు
మునిపల్లి : మండలంలోని బుదేరా శివారు 65 నంబర్ జాతీయ రహదారిలో గురువారం తెల్లవారుజామున ఎదురెదురుగా లారీ, మహీంద్రా జీపు ఢీకొనడంతో ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలిలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ వైపు ట్రావెల్ లారీ వెళుతుండగా.. జహీరాబాద్ నుంచి హైదరాబాద్ వైపు మహీంద్రా జీపు వస్తోంది. అయితే ఈ వాహనాలు బుదేరా శివారులోకి రాగానే లారీ మహీంద్రా జీపును ఢీకొంది. ఈ సంఘటనలో జీపు నుజ్జు నుజ్జు కాగా అందులో డ్రైవర్‌గా పనిచేస్తున్న కోహీర్ మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మల్లికార్జున్ గాయపడ్డాడు. స్థానికులు 108లో మల్లిఖార్జున్‌ను సదాశివపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురి మృతి
Published Fri, Feb 27 2015 4:28 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement