కాటేస్తే.. కాటికే
► వర్షాకాలంలో పెరిగిన పాముకాటు మరణాలు
► ఆసుపత్రుల్లో అందుబాటులో లేని యాంటీ వీనమ్ వాయిల్స్
► ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాముకాటు మందుల కొరత æ
► మరొకొన్ని చోట్ల మందులున్నా.. పరికరాల్లేవు
► ఇబ్బందులు ఎదుర్కొంటున్న శివారు ప్రాంత ప్రజలు
► పాముకాటుకు గురైతే ప్రాణాలు గాల్లోకే..
► పీహెచ్‌సీల్లో మరీ దారుణం
ప్రభుత్వ ఆస్పత్రుల్లో పాముకాటు చికిత్సకు మందులు దొరకడం లేదు. పాముకాటు చికిత్సకు యాంటీ వీనమ్ వాయిల్స్ ఉపయోగిస్తారు. జిల్లాలోని కమ్యూనిటీ, ఏరియా ఆస్పత్రుల్లో ఈ వాయిల్స్ అందుబాటులో ఉన్నా.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనే పూర్తిస్థాయిలో అందుబాటులో లేవు. శుక్రవారం ‘సాక్షి’ బృందం జిల్లా ఆస్పత్రితోపాటు ఇబ్రహీంపట్నం, శంషాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, వనస్థలిపురం, రాజేంద్రనగర్, చేవెళ్ల ఏరియా ఆస్పత్రులు, పీహెచ్‌సీలను సందర్శించింది.
ముఖ్యంగా చాలా పీహెచ్‌సీల్లో వాయిల్స్ స్టాక్ లేదని సిబ్బంది ‘సాక్షి’తో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ ఆస్పత్రులకు సరఫరా చేసే సెంట్రల్ డ్రగ్ స్టోర్‌లో మాత్రం యాంటీ వీనమ్ వాయిల్స్ ఉన్నట్లు డీఎంహెచ్‌ఓ బాలాజీ పవార్ తెలిపారు. అవసరంమేరకు ఆయా ఆస్పత్రుల నుంచి క్రమం తప్పకుండా మందులు తీసుకెళ్లాల్సి ఉంటుందన్నారు. కొన్ని ఆస్పత్రులు అందుకు దూరంగా ఉండడంతోనే అటువంటి పరిస్థితి తలెత్తి ఉండవచ్చని చెప్పారు. ఆయా ఆస్పత్రులపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇబ్రహీంపట్నంలో మందులు నిల్
ఇబ్రహీంపట్నం: గ్రామం చుట్టూ గుట్టలు, అడవి.. తరుచు పాములు సంచరిస్తుంటాయి. కూతవేటు దూరంలోనే మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉంది. కానీ ఆ ఆసుపత్రిలో పాము కాటుకు మందులు దొరకవు. ఇబ్రహీంపట్నం మండల పరిధి దండుమైలారం పీహెచ్‌సీలో ఇది దుస్థితి. ఈ ప్రాంతంలో 90 శాతం ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తారు. ప్రజలంతా పొద్దున లేచింది మొదలు ఎక్కువ సమయం పొలాల్లోనే సంచరిస్తుంటారు. ఎవరైనా పాము కాటుకు గురైతే వారి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే. ఇటీవల కాలంలో పాము కాటుకు గురై ఓ వ్యక్తి ఆసుపత్రికి వస్తే మందులు అందుబాటులో లేక వేరే ఆసుపత్రికి వెళ్లాలని డాక్టర్లు సూచించిన సందర్భం. అటవీ ప్రాంతంలో ఆస్పత్రిలో మందులు అందుబాటులోకి తీసుకురావాలన్న ధ్యాసే వైద్యాధికారులకు లేకపోయింది.
మందులొస్తాయ్ ...
పాము కాటుకు సంబంధించిన మెడిసిన్ ప్రస్తుతం ఆసుపత్రిలో లేదు. ముందుల కావాలని ఉన్నత వైద్యాధికారులకు చెప్పాం. త్వరలో పాముకాటు మెడిసిన్ వస్తుంది. పాము కాటుకు గురైన సంఘటనలు ఇటీవల కాలంలో ఒక్క కేసు మాత్రమే వచ్చింది. – లీలావతి, పబ్లిక్ హెల్త్ నర్సు
11 మందికి పాముకాటు
చేవెళ్ల: మండల పరిధిలోని రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాము కాటుకు సంబంధించిన విరుగుడు మందులు అందుబాటులో ఉన్నాయి. పాము కాటుకు గురై ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్యం అందిస్తున్నారు. శుక్రవారం మండలంలోని చేవెళ్ల, ఆలూరు గ్రామాల్లో ఉన్న ఆసుపత్రులను ‘సాక్షి విజిట్’ చేసింది. చేవెళ్ల మండల కేంద్రంలోని ఏరియా కమ్యూనిటీ ఆసుపత్రిలో ప్రస్తుతం 50 యునిట్‌ల పాముకాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
ఆసుపత్రిలో జనవరి నుంచి ప్రస్తుతం మొత్తం 39 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ వర్షకాలం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 11పాముకాటు కేసులు వచ్చినట్లు తెలిపారు. ఆలూరులోని మరో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కూడా 5 యునిట్‌ల మందు అందుబాటులో ఉందని డాక్టర్ మోహన్ తెలిపారు. ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఆయన తెలిపారు. ఈ రెండు ఆసుపత్రుల్లో వసతులు ఉన్నా సిబ్బంది కొరత ఎక్కువైందన్నారు. దీంతో ప్రజలకు సకాలంలో వైద్యం అందడం లేదని అంటున్నారు. దీనిపై దృష్టిసారించి సరిపడా సిబ్బందిని నియమించాలని కోరుతున్నారు.
పరికరాల కొరత
యాచారం(ఇబ్రహీంపట్నం): మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము కాటుకు కావాల్సిన స్నేక్ వీనమ్ యాంటిసిరఫ్‌లు ఉన్నాయని యాచారం పీహెచ్‌సీ ఇన్‌చార్జ్ డాక్టర్ కరుణశ్రీ తెలిపారు. కానీ అధిక విషమున్న పాములు కొన్ని.. విషం లేనివి కొన్ని ఉంటాయి. పాము కాటేసిన తర్వాత పరీక్షలు జరిపే పరికరాలు లేకపోవడంతో సడన్‌గా స్నేక్ వీనమ్ యాంటీసిరఫ్‌లు వేస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉందని అన్నారు. పాము కాటుకు గురైనవారు ఎవరూ ఆస్పత్రికి రావడం లేదన్నారు. ఆస్పత్రిలో 5 స్నెక్ వీనమ్ యాంటిసిరఫ్‌లు ఉన్నాయని ఆమె తెలిపారు.
నార్సింగిలో నయం..
మణికొండ(రాజేంద్రనగర్): పాటు కాటు మందులు ఉన్నా.. గండిపేట మండలం నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గత సంవత్సర కాలంగా ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. మహానగరాన్ని అంటిపెట్టుకొని ఉన్న మండలం కావటంతో పెద్దగా పాముల సమస్య ఉండదని, దాంతో కేసులు రావటం లేదని డాక్టర్ కిరణ్ పేర్కొన్నారు. నార్సింగి పీహెచ్‌సీ గాంధీ ఆసుపత్రి వారి నిర్వహణలో ఉన్నందున అన్ని రకాల మందులు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
నెల రోజులుగా మందులే లేవు..
కందుకూరు(మహేశ్వరం): మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాము కాటుకు విరుగుడు ఇంజక్షన్స్ గత నెల రోజులకు అందుబాటులో లేవు. స్టాక్ రావాల్సి ఉందని సిబ్బంది తెలుపుతున్నారు. పాము కాటుకు గురైన వారికి ఇక్కడ కేవలం ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన చికిత్స కోసం మహేశ్వరంలోని సివిల్ ఆస్పత్రికి పంపిస్తామంటున్నారు. పాము కాటు మందు తప్ప మిగతా అన్ని మందులు అందుబాటులో ఉన్నాయి.
నాలుగు నెలల్లో 25 కేసులు
ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం ప్రభుత్వ సివిల్ అస్పత్రిలో గడచిన నాలుగు నెలల్లో 25 పాముకాటు కేసులు నమోదైనట్లు వైద్యురాలు రజని తెలిపారు. పాముకాటు మందులు అందుబాటులో ఉన్నాయని, కాటేసిన పాము విషపూరితమైందా..? లేదా..? అని తెలుసుకొని చికిత్స చేయాల్సివుంటుందన్నారు. పాము కాటుకు గురైన వారికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వైద్యసేవలకు నగరంలోని ప్రభుత్వాసుపత్రులకు రిఫర్ చేస్తున్నట్లు చెప్పారు. – రజని, ప్రభుత్వాసుపత్రి వైద్యురాలు, ఇబ్రహీంపట్నం