- ఈ ఏడాది చివరినాటికి 1200 మంది పదవీ విరమణ
- అధ్వానంగా మారనున్న నగర పోలీసు కమిషనరేట్ పరిస్థితి
సాక్షి, సిటీబ్యూరో: అరకొర సిబ్బందితో నెట్టుకొస్తున్న నగర పోలీసు కమిషనరేట్ పరిస్థితి మరింత అధ్వానంగా మారనుంది. కమిషనరేట్‌లో వివిధ విభాగాల్లో పని చేస్తున్న 1200 మంది సిబ్బంది వచ్చే 8 నెలల్లో పదవీ విరమణ పొందనుండటమే దీనికి కారణం. కమిషనరేట్ ఏర్పడ్డాక భారీ స్థాయిలో ఇంతమంది రిటైర్ కాబోతుండటం ఇదే తొలిసారి. 1947 నాటి నగర జనాభా లెక్కల ప్రకారం కమిషనరేట్‌కు 12401 పోస్టులు మంజూరు చేశారు.
అందులో 8697 పోస్టులను మాత్రమే భర్తీ చే యగా ఇంకా 3704 పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. అయితే, సివిల్, ట్రాఫిక్, ఆర్మూడ్ రిజర్వు తదితర విభాగలలో ఈ ఏడాది చివరి నాటికి 1200 మంది పదవీ విరమణ పొందుతుండడంతో ఆయా విభాగాల్లో ఖాళీల సంఖ్య 4904కి పెరుగుతోంది. తాజా జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుంటే ఈ ఖాళీల సంఖ్య సుమారు 10 వేలకు చేరుతోంది.
త్వరలో హెచ్‌సీలకు పోస్టింగ్‌లు...
కానిస్టేబుల్ నుంచి హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొంది, శిక్షణ పూర్తి చేసుకుని వచ్చిన వారిలో కొందరు ఇప్పటికీ కానిస్టేబుల్‌గానే విధులు నిర్వహిస్తున్నారు. హెడ్‌కానిస్టేబుల్ పోస్టింగ్‌లు ఖాళీ లేకపోవడంతో పదోన్నతి పొందినా పాత పోస్టింగ్‌లోనే పని చేయాల్సి వస్తోంది. అయితే ఈ ఏడాది భారీ సంఖ్యలో హెడ్‌కానిస్టేబుళ్లు పదవీ విరమణ పొందుతుండటంతో వీరికి త్వరలోనే పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశాలున్నాయి.
గతేడాది హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందిన 294 మందిలో 107 మందికి మాత్రమే పోస్టింగ్‌లు ఇచ్చారు. మిగిలిన 187 మందికి ఇవ్వలేదు. వీరందరికీ నాలుగైదు నెలల్లోనే పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంది. ఇక పదవీ విరమణ పొందుతున్న వారిలో ఏఎస్‌ఐల సంఖ్య కూడా ఎక్కువగానే ఉండడంతో సీనియారిటీ ఉన్న హెడ్‌కానిస్టేబుళ్లకు ఏఎస్‌ఐలుగా పదోన్నతులు రాబోతున్నాయి. నగర పోలీసు కమిషనరేట్‌లో ఏఎస్‌ఐ నుంచి కానిస్టేబుల్ వరకు ప్రస్తుతం ఉన్న సిబ్బంది వివరాలు ఇలా ఉన్నాయి.