సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీసుశాఖలో డీఎస్పీల పదోన్నతుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది.1995 ఎస్సైల బ్యాచ్‌లో చేరిన వరంగల్ రేంజి వారంతా నిబంధనల ప్రకారం..ఇప్పటికి డీఎస్పీలుగా ఉండాలి. కానీ, వారు నేటికీ సీఐలుగానే కొనసాగుతున్నారు. మరోవైపు వారితోపాటే విధుల్లో చేరిన హైదరాబాద్ రేంజ్ పరిధి ఎస్సైలు మాత్రం ప్రస్తుతం డీఎస్పీలయ్యారు. పదోన్నతుల విషయంలో వరంగల్ రేంజ్ ఎస్సైలకు ఉమ్మడి రాష్ట్రం నుంచీ ఇదే సమస్య ఎదురవుతోంది.ఇక్కడ ఎంతకాలం పనిచేసినా తమ బ్యాచ్‌మేట్లకు సెల్యూట్లు కొట్టడం అలవాటుగా మారిపోతోందని పలువురు సీఐలు ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.
కలిసొచ్చిన కొత్త కమిషనరేట్లు...
హైదరాబాద్ రేంజ్‌లో 20 ఏళ్ల క్రితం హైదరాబాద్ కమిషనరేట్ ఒక్కటే ఉండేది. తర్వాత సైబరాబాద్, రాచకొండ ఆవిర్భవించాయి. పోలీసుస్టేషన్లు, పోస్టులు పెరిగాయి. ఫలితంగా ఇక్కడ విధులు నిర్వహించే ఎస్సైలకు పదోన్నతుల విషయంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా దక్కాయి. పైగా సీఐ, డీఎస్పీల పదోన్నతుల విషయంలో కానిస్టేబుల్ నుంచి వచ్చిన వారికి 30 శాతం, ఎస్సైగా చేరిన వారికి 70 శాతం వెయిటేజీ ఇస్తారు. హైదరాబాద్ రేంజ్‌లో ఇలాంటివి ఎక్కడా పాటించలేదు. వరంగల్ రేంజ్‌లో పోలీస్‌స్టేషన్ల విస్తరణ అంతగా లేదు. దీంతో కొత్త పోస్టులకు అవకాశం లేకుండాపోయింది. పైగా ఇక్కడ ఉన్నతాధికారులు పదోన్నతుల విషయంలో కానిస్టేబుల్, ఎస్సై వెయిటేజీని పక్కాగా అమలుచేస్తున్నారు. ఫలితంగా పదోన్నతుల విషయంలో వీరికి ప్రతీసారి మొండిచేయే ఎదురవుతోంది.
పాతికేళ్లయినా సీఐలుగానే..
1995 ఎస్సై బ్యాచ్‌ల వారు 2016 నుంచి 2019లో దశలవారీగా పదోన్నతులు పొంది డీఎస్పీలుగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ బ్యాచ్‌లో మొత్తం 360 మందికిపైగా ఉండగా, హైదరాబాద్‌లో ఉన్న దాదాపు 310మందికి పైగా సీఐలు డీఎస్పీలు అయ్యారు. కానీ, వరంగల్ రేంజ్‌లో ఉన్న 54 మందికి మాత్రం నేటికీ పదోన్నతి దక్కలేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. 1991 ఎస్సైల బ్యాచ్‌కు చెందిన వారికి వరంగల్ రేంజిలోనూ ఇలాగే జరిగితే సీఎం కేసీఆర్ స్వయంగా చొరవ తీసుకుని అప్పటికప్పుడు 145 సూపర్‌న్యూమర్ పోస్టులు సృష్టించి వారికి డీఎస్పీలుగా పదోన్నతులు కల్పించారు. అంతేకాదు, 1996 ఎస్సై బ్యాచ్‌కు చెంది హైదరాబాద్ రేంజ్‌లో ఉన్న 64 మందికి డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. దీనితో 1995 ఎస్సై బ్యాచ్‌ల బ్యాచ్‌కు చెందిన వరంగల్ రేంజ్ సీఐలంతా సీఎంను కలసి మొరపెట్టుకున్నారు.
సీఎం సూచన ల మేరకు డీజీపీ ఆఫీసు వీరికి పదోన్నతులు కల్పించే ఫైల్‌ను తయారు చేసి ఫిబ్రవరిలో సీఎంవోకు పంపింది. కరోనా కారణంగా దానికి గ్రహణం పట్టుకుంది. 25 ఏళ్లలో ఒకే ఒక్క పదోన్న తి పొందిన తాము మానసిక వేదనతో ఉన్నామని పలువురు సీఐలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకంటే జూనియర్లకు పదోన్నతులు సిద్ధమవుతుంటే.. తమకు మాత్రం రేపు మాపు అంటూ నిలుపుదల చేయడం సరికాదంటున్నారు. సీనియా రిటీలో తమ కంటే ముందున్న హైదరాబాద్ రేంజ్ బ్యాచ్‌మేట్లు అడిషనల్ ఎస్పీలుగా పదోన్నతులు పొందినా.. తాము సీఐలుగానే మిగిలిపోతామన్న ఆందోళన వేధిస్తోందని ఆవేదన చెందుతున్నారు.
ఇక్కడ డీఎస్పీలు.. అక్కడ ఇంకా సీఐలే..!
Published Tue, Jun 2 2020 5:13 AM | Last Updated on Tue, Jun 2 2020 5:13 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment