పేదలకు ఇళ్లు నిర్మించాలని ఇందిరాపార్క్ వద్ద మహాధర్నా
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే చర్యలు తీసుకోవాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. గత పాలకుల మాదిరిగా ఎన్నికల ముందు పేదలు, గుడిసెవాసులకు అనేక హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మోసగిస్తున్నారని ధ్వజమెత్తారు. గుడిసెవాసులకు పట్టాలివ్వాలని, నిరుపేదలకు రెండు పడకగదుల ఇళ్లు నిర్మించి ఇవ్వాలని బుధవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద సీపీఐ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు.
గోదావరి జలాల్లో పవిత్రస్నానాన్ని ఆచరిం చిన సీఎం కేసీఆర్ అదే పవిత్రహృదయంతో గుడిసెవాసులకు ఇళ్లస్థలాల పట్టాలిచ్చి డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకిచ్చిన ఎన్నికల హామీలన్నిం టినీ అమలు చేయాలని, లేదంటే కేసీఆర్ కళ్లు తెరిపించాల్సి వస్తుందని పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి ఈ సందర్భంగా హెచ్చరిం చారు. తెలంగాణ ఏర్పడితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని చెప్పిన కేసీఆర్ సీఎం అయ్యాక ఈ 14 నెలల్లో ఒక్కదానిని కూడా తీర్చలేదని, రోజుకో వాగ్దానం చేస్తూ కాలం గడుపుతున్నారని విమర్శించారు.
పేదలు, గుడిసెవాసులు ఎవరూ కూడా బంగారు తెలంగాణ కావాలని కోరుకోవడం లేదని, పేదలకు కావాల్సింది ఇళ్లస్థలాలు, పక్కాఇళ్లు, రెండుపడకగదుల ఇళ్లేనన్నారు. కేసీఆర్ ఇప్పటికైనా హామీలను అమలు చేయాలని, లేనియెడల పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామంటున్న సీఎం ముం దుగా పాత నగరంలోని 1,100 మురికివాడల ప్రజల కనీస సౌకర్యాల గురించి ఆలోచించాలని రాజ్యసభ మాజీ సభ్యుడు అజీజ్ పాషా సూచించారు.
హైదరాబాద్‌లోని పేదలకు లక్ష పట్టాలు పంపిణీ చేశామని సీఎం అబద్ధం చెబుతున్నారని, వాస్తవానికి 60 వేల దరఖాస్తులకుగాను ఇంకా 50 వేలు పెండింగ్‌లో ఉన్నాయని సౌత్‌జోన్ కార్యదర్శి ఈటి నర్సింహ అన్నారు. గుడిసెవాసుల సమస్యలు తెలుసుకోడానికి పదిరోజులు పాదయాత్ర చేసి మహాధర్నా నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు వీఎస్‌బోస్, ఎస్.ఛాయాదేవి, ప్రేంపావని పాల్గొన్నారు.
ఎన్నికల హామీలను అమలు చేయాలి: సీపీఐ
Published Thu, Jul 16 2015 3:41 AM | Last Updated on Mon, Aug 13 2018 3:55 PM
Advertisement
Advertisement