కేటీపీపీ ప్లాంట్
- తరచూ విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం
- దిక్కుతోచని స్థితిలో కేటీపీపీ అధికారులు
గణపురం : చెల్పూరు సమీపాన ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రంలో తరచూ సాంకేతిక లోపాలు ఏర్పడుతున్నాయి. ఫలితంగా విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతుం దో అధికారులకు అంతుపట్టడం లేదు. కారణాలు కనుక్కోలేక పోతున్నారు. 500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్‌లో తరచూ టర్బైన్ జనరేటర్‌కు ఆవిరి అందించే బాయిల ర్ ట్యూబ్స్ పలిగిపోవడం విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడుతోంది.
శనివారం మళ్లీ అదే జరిగింది. ప్లాంట్‌లో మరో నాలుగైదు చిన్న చిన్న లోపాలు కూడా వెలుగుచూస్తుండడంతో సరి చేయడానికి తప్పని పరిస్థితుల్లో అధికారులు ప్రతీసారి యూనిట్‌ను షట్‌డౌన్ చేస్తున్నారు. గడిచిన మూడేళ్లలో సుమారు 80 సార్లు ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తికి అంతరా యం ఏర్పడింది. అందులో సగం సార్లు బాయిలర్ పైపులు పలిగిపోవడం, ఆవిరి లీకు కావడం తదితర సమస్యలే కారణమయ్యాయి.
ఇలా ప్రతీ 24 గంటలకు 12 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోంది. అంటే రోజుకు మూడు రూ.కోట్ల చొప్పున నష్టం కేటీపీపీ ఖాతాలో జమఅవుతోంది. శనివారం విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం కలిగిన వెంటనే ప్లాంట్‌లో మరమ్మతులు ప్రారంభించారు. పూర్తయ్యే సరికి రెండు రోజుల సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లల్లో ఎక్కడా తలేత్తని సమస్యలు కేటీపీపీలోనే ఎందుకు ఉత్పన్నమవుతున్నాయో అంతుపట్టకుండా ఉంది.