
'రాహుల్ గాంధీది ఇంపోర్టెడ్ పాదయాత్ర'
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీది ఇంపోర్టెడ్ పాదయాత్ర అని తెలంగాణ న్యాయ, గృహనిర్మాణ మరియు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం హైదరాబాద్లో ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ... రాహుల్ గాంధీ చేపట్టి కిసాన్ రైతు భరోసా యాత్రలో స్థానికులు ఎవరు పాల్గొన లేదని... ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారే పాల్గొన్నారని ఆయన విమర్శించారు. రాహుల్ పాదయాత్రపై గాంధీభవన్లో వేలంవేసి డబ్బులు ఎవరు అధికంగా ఇస్తే వారి జిల్లాల్లోనే పాదయాత్ర ఏర్పాటు చేశారని విమర్శించారు.
ఆత్మహత్యల పాపం కాంగ్రెస్ పార్టీదేనని ఆయన స్పష్టం చేశారు. ఒక్క ఆదిలాబాద్లోనే కాదు.... తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకున్న అన్ని రైతు కుటుంబాలకు ఆర్థికసాయం చేయాలని రాహుల్ గాంధీకి ఈ సందర్భంగా ఇంద్రకరణ్రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు నేపథ్యంలో వారిలో భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆదిలాబాద్ శుక్రవారం కిసాన్ సందేశ్ యాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. దాంతో తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై విధంగా స్పందించారు.