
చిన్న పరిశ్రమలకే పెద్దపీట
♦ కొత్త పారిశ్రామిక విధానంలో మార్గదర్శకాలు
♦ ఇండస్ట్రియల్ పార్కుల్లో 20 శాతం ప్లాట్లు
♦ కేంద్రం తరహాలో రుణసాయానికి ట్రస్టు
♦ జిల్లాల్లో పారిశ్రామిక పార్కులు
♦ వనరులు, భూ లభ్యతపై కసరత్తు కొలిక్కి
సాక్షి, హైదరాబాద్: సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు నూతన పారిశ్రామిక విధానంలో పెద్దపీట వేసేలా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
టీఎస్ ఐపాస్ పేరిట నూతన విధానానికి రాష్ట్ర అసెంబ్లీ ఇదివరకే ఆమోద ముద్ర వేసింది. మార్గదర్శకాలను మాత్రం జూన్ 12న పారిశ్రామిక దిగ్గజాలు, ప్రముఖుల సమక్షంలో సీఎం కేసీఆర్ విడుదల చేయనున్నారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణతో దెబ్బతిన్న చిన్న పరిశ్రమలను ఆదుకోవడంతో పాటు, పూర్వ వైభవం దిశగా నూతన విధానంలో ప్రతిపాదనలు చేస్తున్నారు.
ఇప్పటికే అభివృద్ధి చేసిన పారిశ్రామికవాడలతో పాటు, కొత్తగా ప్రతిపాదిస్తున్న ఇండస్ట్రియల్ పార్కుల్లో 20 శాతం ప్లాట్లను చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కేటాయించనున్నారు. టీఎస్‌ఐఐసీ ద్వారా కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఇండస్ట్రియల్ పార్కుల్లో అవసరాలు, డిమాండును బట్టి 100 చదరపు గజాల విస్తీర్ణమున్న ప్లాట్లను కూడా కేటాయించనున్నారు.
మినీ పారిశ్రామిక వాడల ఏర్పాటు
పట్టణాలు, జిల్లా కేంద్రాల్లో మోటారు మెకానిక్ షెడ్లు, మోటారు వైండింగ్ షాపులు వంటి సూక్ష్మ తరహా పరిశ్రమలను ఒకచోట చేర్చి మినీ పారిశ్రామిక వాడలు ఏర్పాటు చేయనున్నారు. భారీ పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ చిన్న, మధ్య తరహా పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు పరిశ్రమల శాఖ ప్రణాళిక రూపొందిస్తోంది. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్రెడిట్ గ్యారంటీ ట్రస్టు (సీజీటీఎంఎస్‌ఈ) తరహాలో రాష్ట్రంలోనూ ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.
జిల్లాల వారీగా ప్రత్యేక పార్కులు
హైదరాబాద్ సరిహద్దుగా ఉన్న జిల్లాల్లో సుమారు 50 వేల ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వం 28 కొత్త ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటును ప్రతిపాదించింది. అయితే కేవలం రాజధాని సమీపంలో ఉన్న జిల్లాలకే పరిమితం కాకుండా ఇతర జిల్లాల్లోనూ పారిశ్రామిక వాడల ఏర్పాటుపై టీఎస్‌ఐఐసీ కసరత్తు చేస్తోంది.
జిల్లాల వారీగా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ లభ్యత (ల్యాండ్ బ్యాంక్), వనరులపై గతంలోనే టీఎస్‌ఐఐసీ నివేదిక సిద్ధం చేసింది. వరంగల్‌లో టెక్స్‌టైల్ పార్కు కోసం ఇప్పటికే 100 ఎకరాల భూమిని కేటాయించారు. ఇలాగే మిగతా జిల్లాల్లో అవసరమైన ఇండస్ట్రియల్ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూ సమీకరణపై అధికారులు దృష్టి సారించారు.