Andhra Pradesh: పారిశ్రామిక అభివృద్ధిలో నూతన విప్లవం | 2023 2027 New industrial policy innovation | Sakshi
Sakshi News home page

Andhra Pradesh: పారిశ్రామిక అభివృద్ధిలో నూతన విప్లవం

Published Tue, Mar 28 2023 4:16 AM | Last Updated on Tue, Mar 28 2023 9:01 AM

2023 2027 New industrial policy innovation - Sakshi

సాక్షి, విశాఖపట్నం : రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో నూతన విప్లవానికి తెరతీస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. 2023–27 సంవత్సరాలకు రూపొందించిన ఈ పాలసీని పారిశ్రామికవేత్తల సమక్షంలో ఆవిష్కరించడం విశేషం. పాత పాలసీ గడువు ముగియకముందే కొత్త పాలసీని ప్రకటించడం కూడా ఇదే తొలిసారి. సోమవారం విశాఖలో పారిశ్రామికవేత్తలతో కూడిన సమావేశంలో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించారు.

రాష్ట్ర సర్వతోముఖా­భివృద్ధికి దోహదం చేసేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా నిర్మాణాత్మక ఇండస్ట్రియల్‌ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. నూతన విధానం పారిశ్రామి­కాభివృద్ధిలో విప్లవాన్ని సృష్టిస్తుందని పారిశ్రామిక­వేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నెల 31తో పాత విధానం ముగియనుండటంతో ఏప్రిల్‌ 1 నుంచి నూతన పారిశ్రామిక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనుంది.

ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ సలహాదారు శ్రీధర్, ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, జేడీ రామలింగరాజు, డైరెక్టర్‌ డా.జి. సృజన, ఏపీఐడీసీ చైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల, సీఐఐ ఏపీ చాప్టర్‌ వైస్‌ చైర్మన్‌ డా.మురళీకృష్ణ, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

నంబర్‌ వన్‌ ఇండస్ట్రియల్‌ రాష్ట్రంగా ఏపీ :మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌
ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా, నంబర్‌ వన్‌ ఇండస్ట్రియల్‌ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ ముందడుగు వేస్తోంది. సాధారణంగా ప్రభుత్వాలు పాలసీ కాల పరిమితి పూర్తయినప్పటికీ కూడా కొత్త పాలసీని తేవడానికి  కొంత సమయం తీసుకుంటాయి. దీనివలన పారిశ్రామికవేత్తలు ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇకపై ఈ పరిస్థితి ఉండకూడదని, పాత పాలసీ ముగియకముందే కొత్తది అమలు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశించారు.

నూతన విధానం ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, ఉపాధి కల్పనపై తనకున్న నిబద్ధతను సీఎం జగన్‌ చాటుకున్నారు. కొత్త పాలసీ రాష్ట్ర ఆర్థిక ప్రగతికి దోహదం చేస్తుంది. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన రంగాలకు  పెద్దపీట వేశాం. పారిశ్రామిక రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలకు అధిక ప్రాధాన్యమిస్తున్నాం. ఫుడ్‌ ప్రాసెసింగ్, వైద్య పరికరాల తయారీ, గ్రీన్‌ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనవనరుల రంగా­ల్లో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నా­యి.

డిఫెన్స్, ఏరోస్పేస్‌ రంగాల్లో రూ.15 వేల కోట్ల జాయింట్‌ వెంచర్‌ ప్రారంభిస్తున్నాం. రాష్ట్రంలోని 974 కిలోమీటర్ల సముద్రతీర ప్రాంతాన్ని పూర్తిస్థా­యిలో సద్వినియోగం చేసుకుంటూ పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణంతో పాటు, వీటిని ఆనుకుని సుమారు 48 వేల ఎకరాలలో పోర్టు ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించారు. జల రవాణాను కూడా ప్రోత్సహిస్తున్నాం.

పీపీపీ కింద ఇండస్ట్రియల్‌ పార్కులతో పాటు ప్రైవేట్‌ ఎంఎస్‌ఎంఈ పార్కుల్ని ఏర్పాటు చేస్తున్నాం. వాక్‌ టు వర్క్‌ కాన్సెప్ట్‌ని అన్ని పరిశ్రమలకు తీసుకొస్తాం. ఇన్నోవేషన్‌ రంగాన్ని ప్రోత్సహించేందుకు విశాఖలో ఐ స్పేస్‌ పేరుతో ఐకానిక్‌ టవర్‌ నిర్మించనున్నాం. నూతన పారిశ్రామిక విధానాన్ని సద్వినియోగం చేసుకుని పారిశ్రామికవేత్తలు రాష్ట్ర ఆర్థిక ప్రగతికి తోడ్పడాలి.

దుబాయ్‌ తరహాలో ఇండస్ట్రియల్‌ పార్క్‌ : స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌
ప్రపంచం నలుమూలల నుంచి పెట్టుబడుల్ని ఆక­ర్షించడంతో పాటు అన్ని వర్గాల పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించే అత్యుత్తమ పారిశ్రామిక విధానమిది. పరిశ్రమల్ని ఏపీలోనే ఎందుకు ఏర్పాటు చేయాలి,  ఇక్కడి ప్రత్యేకతలు, వనరులు మొదలైన అంశాలన్నీ తెలిసేలా నూతన విధానాన్ని రూపొందించాం. కొత్త పాలసీ ద్వారా  వైజాగ్‌లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో ఆవిష్కరణల్ని, స్టార్టప్‌లకు చేయూతనందిస్తాం. ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో ఆర్‌ అండ్‌ డీ సెంటర్స్‌ని ప్రోత్సహిస్తాం.

పాలసీ అద్భుతంగా ఉంది:సీఐఐ ఏపీ చాప్టర్‌ వైస్‌ చైర్మన్‌ డా.మురళీకృష్ణ
ప్రస్తుత పాలసీకంటే అద్భుతంగా కొత్త విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించింది. ఒక పారిశ్రామికవేత్త ఏం కోరుకుంటారో వాటన్నింటినీ ఇందులో పొందుపరిచారు.

లాజిస్టిక్స్‌ రంగానికి ప్రాధాన్యమివ్వడం అద్భుతం : శ్రవణ్‌ షిప్పింగ్‌ ఎండీ సాంబశివరావు
2023–27 పారిశ్రామిక విధానంలో అనేక నూతన అవకాశాలు, వనరులు, ప్రోత్సాహకాలు అందించారు. ఇది పారిశ్రామిక రంగానికి కొత్త ఊపిరి పోసినట్లే. దీర్ఘకాలంగా డిమాండ్‌ చేస్తన్న లాజిస్టిక్స్, వేర్‌ హౌసింగ్‌కు పరిశ్రమ హోదా ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నాం.

ఎంఎస్‌ఎంఈలకు పెద్ద పీట : ఏపీ చాంబర్స్‌ ప్రెసిడెంట్‌ పైడా కృష్ణప్రసాద్‌
నూతన విధానం అత్యధిక మందికి ఉపాధి కల్పించే ఎంఎస్‌ఎంఈ రంగాన్ని ప్రోత్సహించేలా రూపొందించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ,  మైనార్టీలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడంతోపాటు ఎస్‌జీఎస్టీ 100 శాతం రీయింబర్స్‌మెంట్‌ మంచి సంకేతం.

పరిశ్రమలకు కావాల్సింది మౌలిక వసతులే:ఫ్యాప్సీ అధ్యక్షుడు కరుణేంద్ర
పరిశ్రమలు ఆర్థిక రాయితీలకంటే మౌలిక వసతుల కల్పనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దీనికి అనుగుణంగా నూతన పాలసీలో ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పారిశ్రామిక మౌలిక వసతులు, సులభతర వాణిజ్యంకు పెద్ద పీట వేయడాన్ని స్వాగతిస్తున్నాం.

పరిశ్రమలకు ఊతమిచ్చే పాలసీ :సీఐఐ ఏపీ చాప్టర్‌ చైర్మన్‌ ఎం.లక్ష్మీ ప్రసాద్‌
రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిచ్చే విధంగా నూతన పారిశ్రామిక విధానం ఉంది. భారీ పరిశ్రమల నుంచి ఎంఎస్‌ఎంఈల వరకు పెట్టుబడులను ఆకర్షించే విధంగా పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. పరిశ్రమలకు చెందిన 96 అనుమతులు ఒకే చోట లభించేలా వైఎస్సార్‌ ఏపీ వన్‌ యాప్‌ను తేవడం హర్షణీయం.

పోర్టు ఆధారిత వ్యాపారాభివృద్ధి, ప్రపంస్థాయి మౌలిక వసతులు, రెడీ టు బిల్డ్‌ ఫ్యాక్టరీల నిర్మాణం, ప్రైవేటు రంగంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధి, స్టార్టప్‌ల కోసం ఐ–స్పేస్‌ పేరుతో టవర్‌ నిర్మాణం వృద్ధికి దోహదం చేస్తాయి.

నూతన విధానంలో ప్రధానాంశాలు..
ప్లగ్‌ అండ్‌ ప్లే విధానానికి అనుగుణంగా పాలసీ
వనరుల ఆధారంగా అత్యాధునిక మౌలిక సదుపాయాల కల్పన
వ్యాపారాన్ని సులభతరం చేయడం, పెద్ద ఎత్తున ఉపాధి కల్పన లక్ష్యం
పరిశోధనలకు చేయూత, అంకుర పరిశ్రమలకు ప్రోత్సాహం
తయారీ, అనుబంధ రంగాలు సహా అన్ని రకాలపరిశ్రమల పెట్టుబడిదారులకు పలు రాయితీలు
ఎర్లీబర్డ్‌ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు
ఎలాంటి ఆంక్షలు లేని పెట్టుబడుల వాతావరణం
లో కాస్ట్, లో రిస్క్‌ బిజినెస్‌
పీపీపీ విధానంలో ఇండస్ట్రియల్‌ పార్కుల అభివృద్ధి
ప్రైవేట్‌ ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటు
అంతర్జాతీయ కనెక్టివిటీ, తయా­రీ రంగంలో ఎకో సిస్టమ్‌
దుబాయ్‌ తరహాలో బెస్ట్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ అభివృద్ధి
పర్యావరణ పరిరక్షణ, అన్ని జిల్లాల్లోనూ పారిశ్రామిక వికేంద్రీకరణ
తొలిసారిగా ఆపరేషనల్‌ గైడ్‌లైన్స్‌లో భూ కేటాయింపులు, రద్దు మొదలైనవి

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement