
కొత్త పారిశ్రామిక విధానం లేనట్టే!
రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ఇప్పట్లో ప్రకటించే అవకాశం కనిపించడం లేదు.
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక విధానాన్ని ఇప్పట్లో ప్రకటించే అవకాశం కనిపించడం లేదు. కేంద్రం మనోగతం బహిర్గతమయ్యే వరకూ ఈ విషయంలో మౌనంగా ఉండాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. పారిశ్రామిక విధానంపై ఇప్పటివరకు చేసిన కసరత్తును కూడా మూలన పడేసింది. తాజా పరిణామాలతో పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర నిరాశ చోటు చేసుకుంది.
కేంద్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రానికి ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీని ప్రకటించి ఇతర ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నాయని పేర్కొంది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించి ఆదాయ వనరుల్లో ఏర్పడిన వ్యత్యాసంపై అంతర్గత మంత్రుల కమిటీ పరిశీలిస్తుందని, మిగతా ప్రతిపాదనలు పరిశీలించి నిర్ణయానికొచ్చే ముందు తాత్కాలికంగా రూ.500 కోట్లు సాయంగా అందిస్తున్నట్టు కేంద్ర ఆర్థికశాఖ ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పేరుతో బుధవారం ప్రకటన జారీ చేయడం తెలిసిందే.
దీంతో అంతర్గత మంత్రుల కమిటీ బృందం రాష్ట్రంలో పర్యటించి, అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్న తర్వాత మరిన్ని రాయితీలపై ఒక నిర్ణయానికి వచ్చే వీలుందని రాష్ట్రప్రభుత్వం అంచనా వేస్తోంది. ఇదిలావుండగా కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెలలో ప్రారంభమవుతాయి. ఈలోగా ఈ ప్రక్రియ పూర్తి కావడం సాధ్యంకాదు. కాబట్టి ఈ ఏడాది బడ్జెట్‌లో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి సంబంధించిన ఎలాంటి ఆర్థిక వెసులుబాటు ఉండే అవకాశం కన్పించడం లేదు.
అదీగాక ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం కనీసం 15 ఏళ్లపాటు రాయితీలు ఇవ్వాలని, పన్ను మినహాయింపు కల్పించాలని ప్రభుత్వం కోరింది. దీనిపైనా కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టత రాలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రతిపత్తి కల్పిస్తే కొన్నిరకాల పరిశ్రమలకు భారీగా రాయితీలందే వీలుంది. టెక్స్‌టైల్ ఇండస్ట్రీస్‌తోపాటు భారీ పెట్టుబడులు(రూ.50 లక్షలు దాటిన) ఉండే పరిశ్రమలకు దిగుమతి, వాణిజ్య సుంకం నుంచి మినహాయింపు ఉండే వీలుంది. కేంద్రం ఇందుకు సుముఖంగా ఉన్నట్టుగా కనిపించడంలేదని తెలుస్తోంది.
భరోసా ఇవ్వలేకపోతున్న రాష్ట్రప్రభుత్వం..
ఈ ఏడాది జనవరి వరకూ రాష్ట్రంలో దాదాపు 80 భారీ పరిశ్రమల స్థాపనకు పారిశ్రామికవేత్తలు ముందుకొచ్చారు. వారంతా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలిచ్చే సబ్సిడీల గురించే వివరాలు కోరుతున్నారు. మరో 175 మధ్యతరహా, 2000కుపైగా చిన్న పరిశ్రమలకు సంబంధించి ఔత్సాహికులు వివరాలు కోరారు. అయితే రాష్ట్రప్రభుత్వం మాత్రం వారికి ఎలాంటి భరోసా ఇవ్వలేకపోతోంది.
పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ ఏక గవాక్ష(సింగిల్‌విండో) విధానంలో అందిస్తామని, దీనికి ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తామని మాత్రమే సర్కారు ప్రకటించింది. ఈ హామీని పారిశ్రామిక వర్గాలు ఎంతమాత్రం విశ్వసించలేదు. దీనివల్ల తమకు ఎలాంటి ప్రయోజనం ఒనగూరే అవకాశమూ లేదని చెబుతున్నారు. జపాన్, సింగపూర్‌కు చెందిన సంస్థలు సైతం ఇదే వాదన విన్పిస్తున్నట్టు తెలిసింది. విదేశీ యంత్ర సామాగ్రిని దిగుమతి చేసుకునేందుకు అవసరమైన మౌలిక వసతులు లేకపోవడం, పలు మార్గాల్లో రాష్ట్రానికి వాటిని రప్పించడం భారంగా పేర్కొంటున్నారు.
కేంద్రం ప్యాకేజీ దేనికి?
కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రకటించిన ప్రత్యేక అభివృద్ధి ప్యాకేజీ పరిశ్రమలకు ఎంతమాత్రం మేలు చేయదనే వాదన వినిపిస్తోంది. ఉత్తరాంధ్రలోని మూడు, రాయలసీమలోని నాలుగు జిల్లాలనే ఈ పరిధిలోకి తెచ్చారు. ఫలితంగా రాజధాని నగరం ఏర్పాటు చేసే గుంటూరు, దానికి ఆనుకునే ఉన్న కృష్ణాతోపాటు ఉభయగోదావరి జిల్లాలకు ఎలాంటి ప్రయోజనం లభించేందుకు అవకాశం లేదు. ఇచ్చిందికాస్తా వసతులకే సరిపోతుందని అంటున్నారు.