వీసీలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
పాలమూరు : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయం నుంచి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లకు నిరంతర నీటి సరఫరా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న బాలికల వసతి గృహాల భవన నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
బాలికల వసతి గృహాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఒక్కో వసతి గృహాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు దత్తత తీసుకొని కనీస అవసరాలు కల్పించేందుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలకు ప్రహరీల నిర్మాణాలకు రూ.35కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యావలంటీర్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి అవకతవకలు జరుగకుండా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు.
అనంతరం కలెక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందున 1954మంది విద్యావలంటీర్ల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపగా, 1637మంది వలంటీర్లను నియమించుకునేందుకు అనుమతి వచ్చిందని చెప్పారు. మిగిలిన విద్యావలంటీర్లను కూడా నియమించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంలను ఈనెల చివరి వరకు అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, డీఈఓ విజయలక్ష్మిభాయి, డిప్యూటీ ఈఓ గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
Published Sat, Sep 12 2015 12:31 AM | Last Updated on Tue, Aug 21 2018 7:26 PM
Advertisement
Advertisement