
ఇంకెన్నాళ్లీ వివక్ష
- {పగతికి నోచని ముస్లింవాడలు
- దశాబ్దాలుగా తీరని వెతలు
- జనాభా ఘనం.. జీవనం అధ్వానం
- వైఎస్ హయాంలోనే వెలుగులు..
- పలు నియోజకవర్గాల్లో గెలుపోటముల్లో వీరి ఓట్లే కీలకం
సాక్షి, సిటీబ్యూరో/చార్మినార్: గతమంతా ఘన చరిత.. వర్తమానం దీనావస్థ.. నాటి వైభవం నేడు ప్రాభవం కోల్పోయింది. నాడు నగరానికి ఏలికలు.. నేడు నకనకలాడే కడుపులతో ఆకలికేకలు.. ఇదీ హైదరాబాద్ ముస్లింల జీవన చిత్రం. పట్టెడన్నం కోసం ఒళ్లంతా రెక్కలు ముక్కలు చేసుకొంటున్న వారు కొందరు.. పొట్టచేత పట్టుకుని ఎడారి దేశాలకు వలస వెళ్లి రెక్కలు తెగుతున్న వారు ఇంకొందరు.. హైదరాబాద్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో గెలుపోటముల్ని ప్రభావితం చేయగల సంఖ్యా బల మున్న ముస్లింలు బతుకీడ్చడానికి మాత్రం నానా అగచాట్లు పడుతున్నారు.
ఇరుకు రోడ్లు, పొంగే డ్రైనేజీలు, శిథిలావస్థకు చేరిన నివాసాలు.. చదువుకునే వయసులో కుటుంబ పోషణ కోసం బరువెత్తిన బాల్యం.. అభివృద్ధి జాడలేని మురికివాడలు.. తాగు నీరు కలుషితం.. వెలగని వీధి దీపాలు.. ఇదీ పాత నగరం దయనీయ దృశ్యం. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్న దక్షిణ మూసీ ప్రాంతమైన చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, చాంద్రాయణగుట్ట, మలక్‌పేట నియోజకవర్గాల్లోని మురికివాడల్లో పాలకుల వివక్ష తాలూకు క్రీనీడలు కళ్లెదుట కదలాడుతాయి.
ఏవీ ఆ రోజులు..
పాతబస్తీ ఒక వెలుగు వెలిగిందీ.. అసలుసిసలు ప్రగతిని చూసిందీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే. ఆయన ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. 2009లో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఇక్కడ పలు దఫాలుగా పర్యటించారు. పాతబస్తీ అభివృద్ధికి రూ.2 వేల కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు. ఈ నిధులతో అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ, సీసీ, బీటీ రోడ్లు, ఫ్లైఓవర్లు, ఆర్‌ఓబీలు, మంచినీటి రిజర్వాయర్లు, పైప్‌లైన్లు, పాఠశాల భవనాలు వంటి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
నిజాం కాలం నాటి డ్రైనేజీ వ్యవస్థ ఆధునికీకరణకు ఆయన చూపిన చొరవను పాతబస్తీ ప్రజలు ఎన్నటికీ మరువరు. వైఎస్ మరణానంతరం పట్టించుకునే వారు లేక పాతబస్తీని చీకట్లు ముసురుకున్నాయి. ఇప్పుడు పరిస్థితి మళ్లీ షరా మామూలు. ఎన్నికల వేళ నేతలు హామీలతో ఊదరగొడుతున్నారు. ముస్లింలు మాత్రం ఇంకెన్నాళ్లీ వివక్ష అని ప్రశ్నించడానికి, నిలదీయడానికి సిద్ధమవుతున్నారు.
పేదరికంతో సహవాసం
గ్రేటర్ హైదరాబాద్‌లోని 2 (మొత్తం 3) పార్లమెంట్, 15 (మొత్తం 24) అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటముల్ని ముస్లిం ఓటర్లు ప్రభావితం చేయగల సంఖ్యలో ఉన్నారు. జనాభాలో, ఓటర్లలో ముస్లింల గణాంకాలు ఘనంగానే ఉన్నా జీవన ప్రమాణాలు అధ్వానంగా ఉన్నాయి. కాసుల కోసం కన్నపేగుల్ని ముసలి అరబ్ షేక్‌ల చేతుల్లో పెడుతున్న పేద కుటుంబాల దయనీయ ఉదంతాలు నేటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. ముస్లింల జనాభాలో కాయకష్టం చేసుకుంటూ బతుకీడ్చే వారే ఎక్కువ.
చదువుకు సెలవు
ముస్లిం విద్యార్థుల డ్రాపవుట్స్ రాష్ట్రం మొత్తమ్మీద నగరంలోనే ఎక్కువ. ఇందుకు సాంఘిక, ఆర్థిక అంశాలతో పాటు మైనార్టీలపై పాలకుల చిన్నచూపూ కారణమే. ఒకటి నుంచి రెండో తరగతికి వెళ్లేలోపే 10 శాతం మంది బడి మానేస్తున్నారు. బాలికల్లో ఇది 16 శాతంగా ఉంది. 2వ తరగతిలో 5 శాతం, 3వ తరగతిలో 6, 4వ తరగతిలో 5, 5వ తరగతిలో ఏకంగా 16 శాతం, 6వ తరగతిలో 6, 7వ తరగతిలో 11 శాతం మంది బడి మానేస్తున్నారు. ఉర్దూ మీడియంలో చదువుతున్న పిల్లలు 3 శాతంలోపే ఉన్నారు.
వక్ఫ్ ఆస్తులు పరాధీనం
వందల కోట్ల విలువైన వక్ఫ్ భూములు, ఆస్తులు పరాధీనమైపోతున్నాయి. ఒకవైపు పాలకులే స్వయంగా వక్ఫ్ ఆస్తులను అడ్డగోలుగా ప్రైవేటు పరం చేస్తుండగా మరోవైపు అక్రమార్కులు కబ్జాలకు తెరలేపుతున్నారు. వక్ఫ్ భూముల లీజులు, ఆస్తులపై వచ్చే అద్దె లు తదితర ఆదాయంతో పేద ముస్లింల అభివృద్ధితో పాటు ప్రాథమిక విద్య సునాయాసంగా అందించవచ్చు. వక్ఫ్ చట్టమూ ఇదే చెబుతున్నా.. ఆచరణలో అమలు కావట్లేదు.
ముస్లిం విద్యార్థులకు వరం.. వైఎస్సార్ 4 శాతం రిజర్వేషన్
ముస్లింలకు విద్య, ఉద్యోగ రంగాల్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్ పలువురికి భరోసానిచ్చింది. ముస్లిం విద్యార్థులు ఇంజనీరింగ్, మెడిసన్‌తో పాటు ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ, మూడేళ్ల-ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ, ఎంటెక్, ఎం.ఫామ్ తదితర కోర్సుల్లో సీట్లు సాధించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఉపకార వేతనాలతో వేలాది మంది ఉన్నత చదువులు పూర్తి చేయగలిగారు. రిజర్వేషన్ కేటగిరిలో పలువురు ఉద్యోగాలు పొందారు. ఇక, వైఎస్ ప్రవేశపెట్టిన సామూహిక వివాహాల పథకం నిరుపేద ముస్లిం యువతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ముస్లిం వితంతువులకు పెన్షన్ అందింది. విద్యార్థుల కోసం ప్రత్యేక ఇంగ్లిష్ మీడియం గురుకుల విద్యాలయాలు ప్రారంభమయ్యాయి.
ఐటీ ఉద్యోగం చేస్తున్నా..
మా కుటుంబంలో ఉన్నతవిద్య కు నోచుకున్నది నేనొక్కడినే. ఇది వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ వల్లనే సాధ్యమైంది. ఇదే లేకపోతే ఇంటర్ తరువాత ఏదో చిన్న ఉద్యోగం చేసుకొనే వాడినేమో. ప్రస్తుతం నేను ఓ ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నా.
- మహ్మద్‌ఖాన్, గోల్కొండ
నా చదువు ఆయన చలవే..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు యువత కోసం రాజీ వ్ ఉద్యోగ శ్రీ పథకం ప్రవేశపెట్టి మాకు దారి చూపారు వైఎస్. ఆయన కల్పించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాను.
- ఎస్‌కే సికిందర్, బీటెక్
(మెకానికల్) మూడో ఏడాది
ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చదువుకున్నా..
ఉన్నత చదువులు అభ్యసించాలనే అభిలాష ఉన్న మాలాంటి పేద విద్యార్థులను డాక్టర్ వైఎస్ వెన్నుతట్టి ప్రోత్సహించారు. ఆయనిచ్చిన స్కాలర్‌షిప్‌లు మా ఉన్నతికి బాటలు వేశాయి.
- అబ్దుల్ హఫీజ్, బీటెక్ సెకండియర్
ఇంటరే కష్టమనుకున్నా..
ఇంటర్మీడియట్ చదవడమే కష్టమనుకున్నా.. అదే సమయంలో అప్పటి సీఎం వైఎస్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకం నాలో భరోసా నింపింది. ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుకోగలుగుతున్నాను.
- మేరాజ్‌బేగ్, సమతాకాలనీ
ఉపాధి కోసం గల్ఫ్‌బాట
రాష్ట్రం నలుమూలల నుంచి నగరానికి ఉపాధి కోసం ఏటా లక్షల్లో జనం వస్తుంటారు. కానీ, నగర ముస్లిం, మైనార్టీలు మాత్రం ఉపాధి కోసం గల్ఫ్ బాట పడుతున్నారు. ఇలా వెళ్లే వారు ప్రతి ఇంటా ఒకరో ఇద్దరో ఉంటారు. అక్కడి నుంచి అంతోఇంతో పంపితే కానీ ఇక్కడ పూట గడవదు. ఇక, గల్ఫ్ వెళ్లే క్రమంలో ఏజెంట్ల చేతుల్లో, ఎడారి దేశాల్లో దగా పడుతున్న వారెందరో. ఇటీవల సౌదీ ప్రభుత్వం అమలు చేసిన కార్మిక చట్టం నతాఖా ప్రభావంతో నగరానికి చెందిన సుమారు పదివేల మంది అర్ధంతరంగా స్వస్థలాలకు తిరిగొచ్చారు.
ఇదీ నగర ముస్లింల ఎజెండా...
ముస్లింల అభివృద్ధి, సంక్షేమానికి ప్రత్యేక మైనార్టీ సబ్‌ప్లాన్
పేద ముస్లిం యువతుల సామూహిక వివాహాలకు ఆర్థిక సహాయం రూ.25 వేల నుంచి రూ. లక్షకు పెంచాలి
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమల్లో నగరంలోని ముస్లింలకు ప్రత్యేకంగా కనీసం పది శాతం కోటాను కేటాయించాలి
మైనార్టీల విద్యాభివృద్ధికి పాతబస్తీలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒక మైనార్టీ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి డివిజన్ కేంద్రంలో మైనార్టీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలి
పారిశ్రామిక రంగంలో ముస్లిం నిరుద్యోగ యువత ప్రోత్సాహానికి ఏపీఐఐసీలో ప్రత్యేకంగా పది శాతం కోటా కేటాయించాలి
స్వయం ఉపాధి కల్పనకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.1 లక్ష నుంచి రూ. 5 లక్షల వరకు నేరుగా రుణాలు అందించాలి
వక్ఫ్ ఆస్తుల అద్దె, లీజు తదితర ఆదాయాలతో పేద ముస్లింల సంక్షేమం, అభివృద్ధి చేపట్టాలి
వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో అన్ని మసీదుల ఇమామ్‌లకు నెలకు రూ.3 వేలు, మోజన్‌లకు రూ.2 వేలు అందించాలి