ఓఆర్‌ఆర్ శంకుస్థాపన కార్యక్రమంలో అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్, నాటి ముఖ్యమంత్రి వైఎస్సార్
సాక్షి, హైదరాబాద్ : మహానేత.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి దూరదృష్టి, దార్శనికతతో హైదరాబాద్ మహానగరానికి మణిహారం లాంటి ఔటర్ రింగ్ రోడ్డు కల సాకారమైంది. సుమారు పుష్కర(12 ఏళ్లు) కాలం పాటు సాగిన ఈ మహా నిర్మాణానికి వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బీజం పడింది. ఆయన హయాంలోనే ఔటర్ పనులకు శ్రీకారం చుట్టారు. తాజాగా కండ్లకోయ జంక్షన్ పూర్తితో 158 కిలోమీటర్ల మార్గంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చింది.
భవిష్యత్‌ను దృష్టిలోఉంచుకుని..
విశ్వనగరం బాటలో దూసుకెళుతోన్న హైదరాబాద్ శరవేగంగా విస్తరిస్తోందన్న అంశాన్ని వైఎస్సార్ సీఎంగా ఉన్నప్పుడే గుర్తించారు. భవిష్యత్ అవసరాలను, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని నగరంపై పడుతున్న ట్రాఫిక్ ఒత్తిడిని తగ్గించాలన్న ఉద్దేశంతో ఔటర్ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి సుమారు 6,043 ఎకరాల మేర పట్టా, ప్రభుత్వ, ఫారెస్ట్ భూముల సేకరణ ప్రక్రియను రికార్డు సమయంలో పూర్తి చేసి బాధితులకు సకాలంలో రూ.873 కోట్ల పరిహారాన్ని పంపిణీ చేయడం విశేషం. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం పంపిణీతోపాటు హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేసిన ప్రణాళికాబద్ధ లేఔట్లలో ప్లాట్లు(ఇళ్ల స్థలాలు) కేటాయించారు. ఆ తర్వాత అలైన్‌మెంట్ ఖరారు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలుపెట్టారు.
పూర్తిస్థాయిలో అందుబాటులోకి..
భూసేకరణకు కొందరు రైతులు సహకరించకపోవడంతో కండ్లకోయ జంక్షన్ వద్ద కొన్నేళ్లుగా నిలిచిపోయిన 1.10 కిలోమీటర్ల పనులు పూర్తవడంతో మంగళవారం నుంచి ఓఆర్‌ఆర్ పూర్తిస్థాయిలో అంటే 158 కిలోమీటర్ల మార్గంలో అందుబాటులోకి వచ్చింది. ఓఆర్‌ఆర్ రోడ్డుకు కలుపుతూ కండ్లకోయ వద్ద ఇంటర్ చేంజ్ రోడ్డు ఎనిమిది లైన్లతో 2 ఎంట్రీ(ప్రవేశ), 2 ఎగ్జిట్(బయటకు) ర్యాంపులు నిర్మించారు. మంగళవారం పురపాలక మంత్రి కేటీఆర్ ఓఆర్‌ఆర్ కండ్లకోయ జంక్షన్‌ను లాంఛనంగా ప్రారంభించారు. 158 కిలోమీటర్ల మేర పూర్తిస్థాయిలో ఓఆర్‌ఆర్ అందుబాటులోకి రావడంతో గిన్నిస్ రికార్డుకు దరఖాస్తు చేసేందుకు హెచ్‌ఎండీఏ సన్నాహాలు చేస్తుండటం విశేషం.
కండ్లకోయ జంక్షన్ ఆలస్యానికి కారణమిదే.
కండ్లకోయ జంక్షన్‌కు సంబంధించి కొందరు రైతులు భూసేకరణలో నష్టపరిహారం తగిన విధంగా లేదని సుప్రీంకోర్టుకు వెళ్లడంతో ఈ పనులు కొన్నేళ్లపాటు ఆగాయి. రెండేళ్ల క్రితం కండ్లకోయ జంక్షన్ పనులు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంతో మళ్లీ పనులు మొదలెట్టారు. రూ.125 కోట్ల వ్యయం కాగల ఈ పనులను ఆరు నెలల నుంచి వేగాన్ని పెంచి పూర్తి చేశారు. దీంతో నేషనల్ హైవే, స్టేట్ హైవే నెట్‌వర్క్‌తో పాటు సిటీ రోడ్లను అనుసంధానించే మొత్తం 158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ అందుబాటులోకి వచ్చింది. నార్సింగ్, కోకాపేట, పటాన్‌చెరు, మేడ్చల్, శామీర్‌పేట, ఘట్‌కేసర్, పెద్దఅంబర్‌పేట, శంషాబాద్, టీఎప్‌పీఏ, నానక్‌రామ్‌గూడ, గచ్చిబౌలి ప్రాంతాల మీదుగా ఓఆర్‌ఆర్ వాహనదారులకు సేవలను అందిస్తోంది.
నిత్యం 85 వేల వాహనాల రాకపోకలు..
ఓఆర్‌ఆర్ మార్గంలో నిత్యం 85 వేలకుపైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. శివారు ప్రాంతాల ప్రజలతో పాటు విజయవాడ, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లావాసులు నగరంలోకి వచ్చేందుకు ఓఆర్‌ఆర్‌ను వినియోగిస్తున్నారు. ఎనిమిది లేన్లు కలిగిన ఓఆర్‌ఆర్‌లో 19 యాక్సెస్ పాయింట్లు ఉన్నాయి. రెండు లేన్లతో సర్వీసు రోడ్లను కూడా అభివృద్ధి చేశారు. రింగ్ రోడ్డును అనుసంధానించేందుకు నగరం నలుమూలల నుంచి 35 రేడియల్ రోడ్లకు వైఎస్సార్ హయాంలోనే బీజం పడింది. ఇందులో 19 రోడ్లు వైఎస్సార్ హయాంలోనే పూర్తయ్యాయి. 5 రేడియల్ రోడ్ల నిర్మాణం తుదిదశలో ఉంది. మరో 11 రేడియల్ రోడ్లకు ప్రాజెక్టు నివేదికలు సిద్ధం చేశారు. వైఎస్సార్ దూరదృష్టితో ఈ రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టడంతో నగరంపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గిందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఔటర్ ప్రస్థానం మొదలైందిలా
19–10–2004న జీవో నం.442 ద్వారా వైఎస్సార్ ప్రభుత్వం ఔటర్ రింగ్ రోడ్డు పనులకు పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.
2005లో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి 6,043 ఎకరాల పట్టా, ప్రభుత్వ, అటవీ భూములను సేకరించారు. బాధితులకు రూ.873 కోట్ల నష్టపరిహారాన్ని సకాలంలో చెల్లించారు.
2006 మే 29న అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, దివంగత మహానేత వైఎస్సార్‌తో కలసి నాటి దేశ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ ఓఆర్‌ఆర్ పనులకు శంకుస్థాపన చేశారు.
158 కిలోమీటర్ల ఓఆర్‌ఆర్ నిర్మాణానికి మూడు దశల్లో రూ.6,696 కోట్లు వ్యయం చేశారు.
22 కిలోమీటర్ల గచ్చిబౌలి–నార్సింగ్–శంషాబాద్ మార్గాన్ని 2008 నవంబర్ 14న పూర్తి చేశారు.
38 కిలోమీటర్ల శంషాబాద్–పెద్ద అంబర్‌పేట మార్గాన్ని 2010 జూలై 7న ప్రారంభించారు.
23.7 కిలోమీటర్ల నార్సింగి–పటాన్‌చెరు మార్గాన్ని 2011 ఆగస్టు 14న ప్రారంభించారు.
38 కిలోమీటర్ల పటాన్‌చెరు–గౌడవెల్లి, కండ్లకోయ–శామీర్‌పేట మార్గాన్ని 2012 డిసెంబర్ 3న ప్రారంభించారు.
14 కిలోమీటర్ల పెద్ద అంబర్‌పేట–ఘట్‌కేసర్ మార్గాన్ని 2015 మార్చి 4న ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు.
23 కిలోమీటర్ల ఘట్‌కేసర్–శామీర్‌పేట మార్గాన్ని 2016 జూలై 15న అందుబాటులోకి తెచ్చారు.- ఘట్‌కేసర్–గచ్చిబౌలి మార్గంలోని 1.1 కిలోమీటర్ల కండ్లకోయ జంక్షన్ పనులు కొందరు రైతులు భూసేకరణకు అంగీకరించకపోవడంతో ఆలస్యమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment