హైదరాబాద్: సంక్షేమానికి మారు పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి అని మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ నేత బొత్స సత్యనారాయణ కొనియాడారు. ఆదివారం వైఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ జయంతి వేడుకలు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి బొత్స సత్యనారాయణ, వైఎస్ జగన్ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఏ ప్రభుత్వాలు తీసేసే పరిస్థితి లేదని, కొనసాగించక తప్పని పరిస్థితి తర్వాత ప్రభుత్వాలదని వ్యాఖ్యానించారు.
దేశంలోని ఏ రాష్ట్రమూ ఉచిత విద్యుత్ ఇవ్వలేదని, కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాత్రమే ఉచిత విద్యుత్ తొలిసారిగా ఇచ్చారని గుర్తు చేశారు. పేదలకు ఏ కష్టం వచ్చినా కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి తీరుస్తాడనే నమ్మకం ఉండేదని, ప్రజలు హాయిగా నిద్రపోయేవారని అన్నారు. అదే స్ఫూర్తితో నేడు వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతోందని అన్నారు. వైఎస్ జగన్ సీఎం అయితేనే మళ్లీ వైఎస్ ఆశయాలు నెరవేరుతాయని, అందుకే కార్యకర్తలు కష్టపడాలని కోరారు. ఈ ఐదేండ్ల కష్టాలు కొద్ది రోజుల్లోనే పోతాయని, ప్రజలు కొద్ది నెలలు ఓపికగా ఉండాలన్నారు.
సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ..వైఎస్ చేసిన పనులు, కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ స్ఫూర్తి పొందుతున్నామని అన్నారు. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు మంచి రోజులు వస్తాయని, ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ మొదలు పెట్టిన యజ్ఞాన్ని వైఎస్ జగన్ పూర్తి చేస్తారని అన్నారు. దౌర్జన్యం, దుష్ట పాలన ఎలా ఉంటుందో ప్రజలు ఇప్పుడు టీడీపీ పాలనలో చూస్తున్నారని చెప్పారు. రానున్న 5,6 నెలలు కార్యకర్తలు జాగరూకతతో వ్యవహరించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment