జనాగ్రహం
న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన
టేకులపల్లి : జనం కన్నెర్రజేశారు. రైతులు, ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందంటూ ప్రభుత్వ విధానాలపై విరుచుకుపడ్డారు. టేకులపల్లిలో వినూత్న ప్రదర్శన నిర్వహించి సర్కారు వైఖరిని ఎండగట్టారు. సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో ఈ నిరసన శుక్రవారం జరిగింది. మాంటిస్సోరీ స్కూల్ సమీపంలోని గ్రౌండ్ నుంచి బయల్దేరిన ఈ ప్రదర్శన తహశీల్దార్ కార్యాలయం వరకు కొనసాగింది.
అనంతరం తహశీల్దార్ కార్యాలయాన్ని ఆందోళనకారులు ముట్టడించారు. అనంతరం న్యూడెమోక్రసీ నాయకులు తహశీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. పింఛను రాలేదనే మనస్తాపంతో గుండెపోటు వచ్చి మరణించిన వృద్ధులుగా అరుణోదయ కళాకారులు ర్యాలీ సందర్భంగా చేసిన అభినయం సమకాలిన పరిస్థితులకు అద్దం పట్టింది. ఈ సందర్భంగా సీపీఐ(ఎంఎల్)-న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు మాట్లాడుతూ ప్రజల కష్టాలు తీర్చే తీరక లేదన్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవర్తిస్తున్నారనివిమర్శించారు. బంగారు తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పిన ఆయన అందుకు విరుద్ధంగా వ్యవరిస్తున్నారన్నారు.
తమ బతులు బాగుపడతాయనే నమ్మకంతో అధికారంలోకి తెచ్చిన ప్రజలను టీఆర్‌ఎస్ సర్కారు విస్మరించిందని ధ్వజమెత్తారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగులందరికీ పింఛన్లు మంజూరు చేయాలని, అర్హులైన వారికి రేషన్‌కార్డులు ఇవ్వాలని, పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వ్యవసాయ రుణాలన్నీ మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం చెల్లించాలని, గిరిజనుల భూముల్లో ఫారెస్టు అధికారుల దారులు, పంట ధ్వంసం చర్యలను నిలిపివేయాలని అన్నారు. కార్యక్రమంలో గుర్రం అచ్చయ్య, ఎట్టి ప్రసాద్, డి.ప్రసాద్, ధర్మపురి వీరబ్రహ్మాచారి, జర్పుల సుందర్, గణితి కోటేశ్వరరావు, రాంచంద్, రాములు, పోతయ్య తదితరులు పాల్గొన్నారు.