సైదాబాద్: దొంగలు బరి తెగించారు... ఏకంగా ఓ ఇంటెలిజెన్స్ కార్యాలయ అధికారి ఇంటినే టార్గెట్ చేశారు... రూ. 30 లక్షల విలువ చేసే కిలో బంగారం, 7 తులాల వెండి ఎత్తుకెళ్లారు..
- కిలో బంగారం ఎత్తుకెళ్లిన దొంగలు
- దైవదర్శనానికి వెళ్లొచ్చేలోగా ఘటన
సైదాబాద్: దొంగలు బరి తెగించారు... ఏకంగా ఓ ఇంటెలిజెన్స్ కార్యాలయ అధికారి ఇంటినే టార్గెట్ చేశారు... రూ. 30 లక్షల విలువ చేసే కిలో బంగారం, 7 తులాల వెండి ఎత్తుకెళ్లారు.. సైదాబాద్ పోలీసుల కథనం ప్రకారం... లక్డీకాపూల్‌లోని ఇంటెలిజెన్స్ కార్యాలయంలో అడ్మిన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న వైవీఎస్ భాస్కరశర్మ సైదాబాద్ డివిజన్ లోకాయుక్తకాలనీలో నివాసం ఉంటున్నారు. ఆయన ఈనెల 27న కుటుంబసభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లారు.
గురువారం ఇంటికి తిరిగి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి ఉన్నాయి. ఆందోళనకు గురైన భాస్కరశర్మ కుటుంబసభ్యులు లోపలికి వెళ్లి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులోని వస్తువులన్నీ చిందర వందరగా పడి ఉన్నాయి. చోరీ జరిగిందని నిర్థారణకు వచ్చి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. బీరువాలో భద్రపర్చిన సుమారు రూ. 30 లక్షల విలువ చేసే కిలో బంగారు నగలు, 7 తులాల వెండి దొంగలు ఎత్తుకెళ్లినట్టు గుర్తించారు. మలక్‌పేట ఏసీపీ సీహెచ్ సుధాకర్, స్థానిక ఇన్‌స్పెక్టర్ శ్రీనివాసులు ఘటనా స్థలాన్ని సందర్శించి చోరీ తీరును పరిశీలించారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీమ్‌లను రప్పించి ఆధారాలు సేకరించారు.
ఇది తెలిసిన వారి పనా? లేక ప్రొఫెషనల్స్ చేసిన చోరీనా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఆఫీసర్ ఇంట్లోనే చోరీ జరగడంతో ఈ విషయం బయటకు పొక్కకుండా పోలీసులు మొదట జాగ్రత్తపడ్డారు. చివరకు విషయం బహిర్గతం కావడంతో చోరీ జరిగిందని అంగీకరించారు. మీడియాను మాత్రం ఘటనా స్థలంలోకి వెళ్లేందుకు అనుమతించలేదు.
కాగా, గత వారమే సరస్వతీనగర్‌లో న్యాయవాది ఇంట్లో 30 తులాల బంగారం చోరీ జరిగిన విషయం మరువకముందే తాజాగా.. ఇంటెలిజెన్స్ అధికారి ఇంట్లో భారీ దొంగతనం జరగడంతో ఈ స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. చోరీల నియంత్రణకు పోలీసులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.