
భ (ర)క్షక భటులపై ‘నిఘా’
పోలీసు శాఖలో అవినీతి అధికారుల భరతం పట్టేందుకు ఎస్పీ వ్యూహం
♦ సివిల్‌తో పాటు, ఏఆర్ విభాగంలోనూ ప్రక్షాళన
♦ తాజాగా ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
కడప అర్బన్: జిల్లాలో పోలీసు యంత్రాంగంపై ‘పోలీస్ బాస్’ నిఘా పెంచారు. సమాజాన్ని సంరక్షించాల్సిన పోలీసులు అవినీతికి పాల్పడుతూ, ప్రజల సొమ్మును అప్పనంగా కాజేస్తూ , కేసులను తమ స్వార్థం కోసం ఎలాగైనా తారుమారు చేసేవారి తాట తీసేందుకు చర్యలు మొదలయ్యాయి. జిల్లా ఎస్పీగా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి పీహెచ్‌డీ రామకృష్ణ తన మార్కును ప్రదర్శిస్తున్నారు. ఒకవైపు పోలీసుల సంక్షేమాన్ని కాంక్షిస్తూనే, మరోవైపు అవినీతి పోలీసుల భరతం పడుతున్నారు.
⇒ కేసుల నమోదు వ్యవహారంలో అలసత్వం ప్రదర్శించినందుకు ఏకంగా ఇద్దరు సీఐలు, ఇద్దరు ఎస్‌ఐలకు ఛార్జ్‌మెమోలను జారీ చేశారు.
⇒ ఎర్రచందనం వ్యవహారాల్లో సంబంధాలున్నాయనే ఆరోపణలు తన దృష్టికి రావడంతో దువ్వూరు ఎస్‌ఐ మధుసూదన్ రెడ్డిని వీఆర్‌కు రప్పించారు.
⇒ జిల్లా పోలీసు కార్యాలయంలో విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే కారణంలో రాత్రి వేళ స్వయంగా ఆయన పర్యవేక్షించి వెంటనే ఐదుగురు ఏఆర్ పోలీసులను సస్పెండ్ చేశారు.
⇒ ఏఆర్ విభాగంలో ఎన్నో సంవత్సరాలుగా ఆర్‌ఐగా వ్యవహరిస్తున్న అధికారి, మరో ఆర్‌ఐ సిబ్బందిని వేధించడంతోపాటు అవినీతికి పాల్పడుతున్నారని ఫిర్యాదు రావడంతో వారిలో ఒకరిని వెంటనే హైదరాబాద్ ఇంటలిజెన్స్ విభాగానికి, మరొకరిని అనంతపురానికి బదిలీ చేశారు.
⇒ జిల్లా పోలీసు కార్యాలయం పరిధిలో ప్రధాన కీలక విభాగం ఎంటీఓ (మోటార్ ట్రాన్స్ పోర్టు). ఈ విభాగానికి చెందిన అధికారి దాదాపు లక్షల్లో అవినీతికి పాల్పడ్డారని, అతనికి మరో అధికారి అండదండలు ఉండటంతోనే అప్పనంగా దోచుకున్నారని తెలియడంతో సదరు అధికారిని హెచ్చరించారు. తనపై ఎక్కడ వేటు పడుతుందోనని ఆ అధికారి సెలవుపై వెళ్లినట్లు సమాచారం. అవినీతికి పాల్పడిన అధికారి స్థానంలో మరో ఆర్‌ఎస్‌ఐని నియమించినట్లు తెలిసింది.
⇒ఎంటీఓ సెక్షన్‌లో దాదాపు రూ. 80 లక్షల మేర అవినీతి జరిగిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఈ వ్యవహారంపై మరో ఉన్నతాధికారితో ‘పోలీస్ బాస్’ సమగ్రంగా విచారణ చేయిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
⇒ తాజాగా జిల్లాలో ముగ్గురు కానిస్టేబుళ్లను వివిధ కారణాలతో సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు ఏఆర్ విభాగానికి చెందిన వారు కాగా, మరొకరు సివిల్ కానిస్టేబుల్ కావడం గమనార్హం.
⇒ సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారులు కూడా అవినీతికి పాల్పడితే వారిపై చర్యలు తప్పవని అంటున్నారు.
⇒ఇటీవల సంబేపల్లె ఎస్‌ఐ పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసుల నమోదు, విచారణలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే కారణంగా వీఆర్‌కు రప్పించినట్లు సమాచారం.
⇒ కడప నగరంలో ఏకంగా ఓ ప్రధాన స్టేషన్ సీఐని, మరో స్టేషన్ ఎస్‌ఐని ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌లో విధులు నిర్వహించాలని మూడు వారాల నుంచి అటాచ్డ్ విధులకు ఆదేశించినట్లు తెలిసింది.
⇒ జిల్లాలో ఇప్పటికే మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్‌లతో ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలున్న పోలీ సు అధికారులు, సిబ్బంది జాబితాను సిద్ధం చేసి సమగ్ర విచారణ అనంతరం వారిపై కూడా చర్యలు తీసుకోనున్నారనే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. జిల్లాలోని ఆరు సబ్ డివిజన్‌ల పరిధిలో లోతుగా విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ముగ్గురు కానిస్టేబుళ్ల సస్పెన్షన్
కడప అర్బన్ : జిల్లాలోని పోలీసు యంత్రాంగంలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న ముగ్గురిని వివిధ కారణాలతో సస్పెండ్ చేస్తూ శనివారం జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. వీరిలో
⇒ సంబేపల్లె పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న టి. రాజగోపాల్ (పిసి. 1701) కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత నెల 18న జూదమాడుతూ పట్టుబడినట్లు సమాచారం. దీంతో అతన్ని సస్పెండ్ చేశారు.
⇒ గాలివీడు పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ డ్రైవర్‌గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ పెంచలయ్య (ఏఆర్ పిసి: 2217) గత నెల 21న నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వలన ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ కారణంగా అతన్ని సస్పెండ్ చేశారు.
⇒ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పి. నిత్యేశ్వరయ్య (ఏఆర్ పిసి: 689) రాయచోటిలో గత నెల 20న ఓ లాడ్జిలో వ్యభిచారానికి పాల్పడుతూ పట్టుబడటంతో అతన్ని సస్పెండ్ చేశారు.