విద్యార్థి భవిష్యత్తును మలుపు తిప్పే ఇంటర్ పరీక్షలు 27వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లాలో 29 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు మొత్తం 15,273 మంది పరీక్షలు రాయనున్నారు. అయితే కొత్తగా జిల్లా ఏర్పాటయ్యి మూడేళ్లు గడుస్తున్నా ఇంత వరకు ఇంటర్‌లో జిల్లా ఫలితాలు 50 శాతం దాటలేదు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచే అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. ప్రతీవారం స్లిప్ టెస్టులు నిర్వహించారు. దీంతో కనీసం ఈ సారైనా ఫలితాలు మెరుగవుతాయా? అనే ఆశలు అందరి మదిలో మెదులుతున్నాయి.
పాపన్నపేట(మెదక్): జిల్లాలో 16 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 7 ఆదర్శ, 2 సాంఘిక సంక్షేమ పాఠశాలలతోపాటు మరో 24 ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి. ఇందులో మొత్తం 15,273 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందుకోసం 29 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. విద్యార్థులంతా అరగంట ముందే పరీక్ష కేంద్రానికి వెళ్లాల్సి ఉంది.
ఒక నిమిషం ఆలస్యమైన విద్యార్థులను పరీక్షలకు అనుమతించారు. ఈ ఏడాది జూన్, జూలైలో జరిగిన లెక్చర్ల బదిలీలు ఆగస్టులో విధుల్లో చేరిన గెస్ట్ లెక్చరర్లు, ఎన్నికల విధులు కొంత వరకు విద్యాసంవత్సరానికి ఆంతరాయం కలిగించాయనే ఆరోపణలున్నాయి. జిల్లా వ్యాప్తంగా గల 29 పరీక్ష కేంద్రాల్లో 26 జంబ్లింగ్ సెంటర్లు, 3 సెల్ఫ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు. జిల్లాలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ప్లయింగ్ స్క్వాడ్, డెక్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్, బోర్డు పరిశీలకులు నిరంతరం పరీక్షలను పర్యవేక్షిస్తుంటారు. ప్రతి ఉదయం 8గంటలకు ఏ సెట్ ప్రశ్నాపత్రం ఇవ్వాలో నిర్ణయిస్తారు.
మూడేళ్లుగా..
జిల్లా ఏర్పడిన తరువాత ఇంటర్ ఫలితాలు ఎప్పుడు కూడా 50శాతాన్ని దాటలేదు. 2016–17 ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో మెదక్ జిల్లా 16వ స్థానంలో నిలిచింది. 2017–18లో 49శాతం ఫలితాలతో 18వ స్థానానికి దిగజారింది. ఆదర్శ, గురుకుల కళాశాలల ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ ప్రభుత్వ కళాశాలల ఫలితాలు దిగజారాయి. ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలు మెదక్ బాలుర జూనియర్ కళాశాలలో 71 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా కేవలం 7మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించడం గమనార్హం.
మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక ప్రణాళిక
ఈ విద్యా సంవత్సరం మెరుగైన పలితాలు సాధించేందుకు ప్రిన్సిపల్స్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. విద్యార్థులను గ్రూప్‌లుగా విభజించి వెనకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిరోజు స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించి ఉత్తీర్ణత శాతం పెంచడానికి చర్యలు తీసుకున్నారు. జూన్, జూలైలో జరిగిన లెక్చరర్ల బదిలీలు, ఆగస్టు చివరి వారంలో ఆలస్యంగా గెస్ట్ లెక్చరర్లు విధుల్లో చేరడం, ఈ ఏడాది జరిగిన ఎన్నికల విధులు ఇంటర్ విద్యకు కొంత ప్రతికూల అంశాలుగా భావించవచ్చు.
ఈ ఏడాది మెరుగైన ఫలితాలు సాధిస్తాం..
ఈ ఏడాది ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రతి కళాశాలలో ప్రత్యేక తరగతులు, స్లిప్‌టెస్ట్‌లు నిర్వహించి 100శాతం ఉత్తీర్ణత కోసం కృషి చేశాం. గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు సాధిస్తాం. –సూర్యప్రకాశ్, నోడల్ అధికారి
Comments
Please login to add a commentAdd a comment