నల్లగొండ : మార్చి రెండో తేదీ నుంచి జరిగే ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఏజేసీ వెంకట్రావు ఆదేశించారు. కలెక్టరేట్‌లోని ఏజేసీ చాంబర్‌లో బుధవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్ ఫస్టియర్‌లో 41,724 మంది పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఇందులో జనరల్ విద్యార్థులు 37,758 మంది, ఒకేషనల్ విద్యార్థులు 3,966 మంది ఉన్నట్లు వివరించారు. సెకండియర్‌లో 42,556 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని.. ఇందులో జనరల్ విభాగంలో 39,040 మంది, ఒకేషనల్‌లో 3,516 మంది ఉన్నట్లు వెల్లడించారు.
ఈ మేరకు జిల్లాలో 244 కాలేజీలకు గాను 108 కాలేజీల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తుగా తాగునీటి వసతితోపాటు పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని మునిసిపల్ కమిషనర్లను ఆ దేశించారు. పరీక్షల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సులు నడపాల,విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్‌ఈకి సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఏఎస్పీ గంగారాం తెలిపారు. మునిసిపల్ కమిషనర్ మంగతాయారు, ఇంటర్మీడియట్ కన్వీనర్ ప్రభాకర్‌రావు పాల్గొన్నారు.
ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాటు
Published Thu, Feb 4 2016 3:49 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 PM
Advertisement
Advertisement