కేంద్ర బృందానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తున్న డీజీపీ మహేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కరోనా కట్టడికి రాష్ట్ర పోలీసులు చేపట్టిన చర్యలను ఢిల్లీ నుంచి వచ్చిన ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీం (ఐఎంసీటీ) ప్రశంసించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై కేంద్రానికి నివేదిక ఇచ్చేందుకు శనివారం నగరానికి చేరుకున్న ఐఎంసీటీ బృందం ఆదివారం ఉదయం డీజీపీ కార్యాలయానికి వచ్చింది. ఈ బృందంలో జలశక్తి అడిషనల్ సెక్రటరీ అరుణ్ బరోకా, పబ్లిక్ హెల్త్ సీనియర్ స్పెషలిస్ట్ డాక్టర్ చంద్రశేఖర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ డైరెక్టర్ డాక్టర్ హేమలత, జాతీయ వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ డైరెక్టర్ ఎస్.ఎస్. ఠాకూర్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ శేఖర్ చతుర్వేది ఉన్నారు. వారికి డీజీపీ మహేందర్‌రెడ్డి స్వాగతం పలికారు.
కోవిడ్‌పై రాష్ట్ర పోలీస్ శాఖ చేపడుతున్న కార్యక్రమాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆయన వివరించారు. కరీంనగర్‌లో ఇండోనేíసియా నుంచి వచ్చిన తబ్లిగీ జమాతే సభ్యుల గుర్తింపు నుంచి సూర్యాపేటలో కేసుల వరకు అన్నింటిని ఎలా వెలుగులోకి తీసుకొచ్చారో తెలిపారు. అత్యవసర సేవలైన ఆరోగ్యం, గుండె, డయాలసిస్, గర్భిణులు, ఇతర అనారోగ్య సమస్యలకు ఎక్కడా ఆటంకం రాకుండా చూసుకున్నామని వివరించారు. మర్కజ్ కేసుల గుర్తింపు కోసం ఏం చేసిందీ హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ వివరించారు. అంతర్జాతీయ విమాన సర్వీసుల నుంచి వచ్చిన వారికి స్క్రీనింగ్, క్వారంటైన్‌కు తరలించిన విధానాన్ని సైబరాబాద్ సీపీ సజ్జనార్, అత్యసవర సేవలకు ఇబ్బందులు రాకుండా రూపొందించిన వ్యూహాలపై రాచకొండ సీపీ మహేశ్‌భగవత్ బృందానికి విశదీకరించారు. సీఎం కేసీఆర్ సూచనలతోనే పోలీసులకు ప్రజల నుంచి సహకారం లభిస్తోందని వివరించారు.
రైతులతో మాటామంతీ
డీజీపీతో సమావేశం తర్వాత కేంద్ర బృందం మెహిదీపట్నం రైతుబజార్‌ను సందర్శించింది. రైతులు, వ్యాపారులు, కోనుగోలుదారులతో మాట్లాడి ధరలపై ఆరా తీసింది. కొనుగోలు, విక్రయదారులు, రైతులు విధిగా మాస్క్‌లు ధరిస్తున్నారా? భౌతికదూరం పాటిస్తున్నారా? వంటివి పరిశీలించి, రైతుబజార్ నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేసింది. నిత్యావసరాల విక్రయాలపై ఓ కిరాణాషాపు యజమానితో మాట్లాడింది. అనంతరం సనత్‌నగర్‌లోని నేచర్‌క్యూర్ ఆస్పత్రిలోని క్వారంటైన్ సెంటర్‌కు వెళ్లింది.
రోగులకు సేవలందిస్తున్న స్టాఫ్ నర్సులతో మాట్లాడి.. ఇప్పటి వరకు ఇక్కడ ఎంతమందిని క్వారంటైన్ చేశారు? ఎలాంటి సదుపాయాలు కల్పించారు? ఎలాంటి సేవలందించారు? వంటివి ఆరాతీసింది. సేకరించిన శాంపిల్స్, పరీక్షలు, వాటి ఫలితాల రికార్డులను పరిశీలించింది. శాంపిల్ టెస్టింగ్ ల్యాబ్‌ను కూడా సందర్శించింది. క్వారంటైన్ సెంటర్‌లోని ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తంచేసింది. అక్కడి నుంచి మలక్‌పేట కంటైన్మెంట్ జోన్‌కు వెళ్లిన కేంద్ర బృందం.. రెడ్‌జోన్ పరిధిలో ప్రజల రాకపోకలను నియంత్రించేందుకు ఏర్పాటుచేసిన బారికేడ్లను పరిశీలించింది. మెట్టుగూడ కంటైన్మెంట్ జోన్‌లోనూ పర్యటించింది. వెస్ట్ మారేడ్‌పల్లిలోని ఓ షెల్టర్‌జోన్‌కు వెళ్లి.. అక్కడి లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment