సాక్షి, హైదరాబాద్: రిషబ్ చిట్‌ఫండ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కేసులో ప్రధాన నిందితుడు శైలేశ్ గుజ్జర్ విచారణలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. గోవాలో కేసినోల ఏర్పాటులో తొందరపాటు నిర్ణయం భారీ నష్టాలను మిగిల్చింది. రిషబ్ కేసులో నిందితులుగా ఉన్న శైలేశ్ కుమార్ గుజ్జర్, అతడి భార్య నందిని గుజ్జర్‌లను శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వీరికి కోర్టు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధించింది. ఆ తర్వాత చంచల్‌గూడలోని జైలుకు తరలించారు.
క్యాసినోలకు రూ.30 కోట్లు..
శైలేశ్ స్నేహితుడైన సురేశ్ కుమార్ గోవాలో క్యాసినో లు నిర్వహిస్తూ భారీగా లాభాలు ఆర్జిస్తున్నాడు. తాను కూడా ఆ వ్యాపారంలోకి దిగాలని శైలేశ్ భావించాడు. అందుకు అవసరమైన పెట్టుబడుల కోసం రిషబ్ సంస్థలో ఉన్న చిట్టీలు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల సొమ్ము వాడేశాడు. క్యాసినోల అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియ కొనసాగిస్తూ.. అక్కడి నోవాటెల్ హోటల్, ఓ బీచ్ రిసార్ట్‌లో క్యాసినోల ఏర్పాటుకు ప్రయత్నాలు చేశాడు. అద్దెలు, లీజుల కోసం భారీ మొత్తంలో చెల్లించడంతో పాటు కోట్ల రూపాయలు వెచ్చించి వాటికి ఆధునీకరణ చేయించాడు. అయితే హఠాత్తుగా గోవా ప్రభుత్వం క్యాసినోల లైసెన్స్ ఫీజును రూ.6 కోట్ల నుంచి రూ.20 కోట్లకు పెంచేసింది. అయితే శైలేశ్ అప్పటికే క్యాసినోలు సిద్ధం చేయడానికి రూ.30 కోట్లు వెచ్చించడంతో ఇంత భారీ మొత్తం మళ్లీ సమీకరించలేకపోయాడు.
నోట్ల రద్దు వేళ భారీ పెట్టుబడులు..
అదే సమయంలో హైదరాబాద్‌లోని రెండు పబ్బుల్లో రూ.10 కోట్లు పెట్టి శైలేశ్ భాగస్వామిగా చేరాడు. ఇవీ ఆశించిన స్థాయిలో లాభాలు ఇవ్వకపోవడంతో అన్ని దారులూ మూసుకుపోయాయి. అలావాడిన సొమ్ము డిపాజిట్‌దారులదే కావడంతో రికవరీలకు ప్రయత్నాలు చేయాలని సీసీఎస్ పోలీసులు నిర్ణయించారు. మరోపక్క ఇప్పటి వరకు సీసీఎస్ పోలీసుల లెక్కల ప్రకారం ఈ స్కాం విలువ రూ.70 కోట్లకు మించట్లేదు. 2016 నవంబర్‌లో పెద్దనోట్ల రద్దు అమల్లోకి వచ్చాక డిపాజిట్లు భారీగా పెరిగినట్లు గుర్తించారు. అనేకమంది వ్యాపారులు తమ వద్ద ఉన్న పెద్ద నోట్లను నగదు రూపంలో పెట్టుబడులుగా పెట్టినట్లు తేల్చారు. వీరికి శైలేశ్ ప్రామిసరీ నోట్లు, పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు.
నగదు లావాదేవీలే అత్యధికం..
శైలేశ్ నిర్వహించిన రిషబ్ చిట్‌ఫండ్స్ సంస్థ రూ.కోట్లలో లావాదేవీలు చేసింది. వారి బ్యాంకు ఖాతాల వివరాలు పరిశీలించిన పోలీసులు.. వాటిలో ఆ స్థాయిలో లావాదేవీలు లేనట్లు గుర్తించారు. గడిచిన కొన్నాళ్లుగా శైలేశ్ నగదు లావాదేవీలే చేశాడని, ఆన్‌లైన్ లేదా చెక్కుల ద్వారా సాగించలేదని సీసీఎస్ పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది నిబంధనలకు విరుద్ధం కావడంతో ఈ విషయాన్నీ ఐటీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు. రిషబ్ సంస్థలో చిట్టీలు పాడుకున్న వారికి రూ.2 వడ్డీ ఇస్తానంటూ శైలేశ్ ఆ మొత్తాలను డిపాజిట్లుగా పెట్టుకున్నాడు. అయితే ఓ దశలో ఇతగాడు ఫైనాన్షియర్ల నుంచి రూ.6 వడ్డీకి నగదు తీసుకువచ్చి రోటేషన్ చేయడానికి ప్రయత్నించాడు. ఇలా భారీ మొత్తం వడ్డీ రూపంలో తీసుకున్న వ్యాపారులనూ పోలీసులు విచారించనున్నారు. రిషబ్ సంస్థలో పని చేస్తున్న పాత ఉద్యోగుల పేర్లతోనూ శైలేశ్ నిధుల మళ్లింపులకు పాల్పడ్డాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment