ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28నుంచే | intermediate exams on february 28th | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28నుంచే

Published Wed, Nov 15 2017 1:49 AM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM

intermediate exams on february 28th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను బోర్డు మంగళవారం సవరిం చింది. 2018 మార్చి 1 నుంచి ప్రారంభం కావాల్సిన పరీక్షలను ఫిబ్రవరి 28 నుంచే నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏపీలో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ పరీక్షలు జరగనుండటంతో అదే తేదీ నుంచి రాష్ట్రంలోనూ వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. రెగ్యులర్‌ పరీక్షలతోపాటు అంతకంటే ముందే నిర్వహించే ప్రాక్టికల్‌ పరీక్షలు, ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్, ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్, ప్రాక్టికల్‌ పరీక్షల సవరించిన టైంటేబుల్‌ను ఈ మేరకు విడుదల చేసింది. దీని ప్రకారం ఇంటర్‌ ఫస్టియర్‌ పరీక్షలు ఫిబ్రవరి 28 నుంచి మార్చి 17 వరకు, సెకండియర్‌ పరీక్షలు మార్చి 1 నుంచి 19 వరకు జరుగుతాయి. అలాగే జనవరి 27న, ఎథిక్స్‌ అండ్‌ హ్యూమన్‌ వ్యాల్యూస్‌ పరీక్ష, జనవరి 29న ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్ష ఉంటుంది. ఫిబ్రవరి 1 నుంచి 21 వరకు ప్రాక్టికల్‌ పరీక్షలు ఉంటాయి. జనరల్, వొకేషన్‌ కోర్సుల వారికి ఇదే షెడ్యూల్‌ వర్తిస్తుంది.

గందరగోళం, అనుమానాలు వద్దనే...
వాస్తవానికి మార్చి 1 నుంచి తెలంగాణలో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించేలా బోర్డు ఈ నెల 7న టైంటేబుల్‌ను ప్రకటించింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్‌ వార్షిక పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించడంతో తెలంగాణ ఇంటర్‌ బోర్డు పునరాలోచనలో పడింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఇంటర్‌ ఆప్షనల్‌ సబ్జెక్టుల్లో కామన్‌ సిలబస్‌ ఉండటంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి పరీక్ష జరిగిన మర్నాడే తెలంగాణలో అదే పరీక్షను నిర్వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పరీక్షల ప్రశ్నపత్రాన్ని తెలంగాణలో పేపర్‌ లీకేజీ పేరిట వదంతులు సృష్టిస్తే తీవ్ర గందరగోళం ఏర్పడుతుంది. పైగా ఆ ప్రశ్నపత్రాలపై అది ఏ రాష్ట్ర బోర్డుకు చెందిందో ఉండదు. ఈ పరిస్థితుల్లో విద్యార్థుల్లో ఎటువంటి గందరగోళం, ఆందోళన తలెత్తకుండా చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగే తేదీల్లోనే రాష్ట్రంలోనూ వార్షిక పరీక్షలు నిర్వహించేలా తెలంగాణ ఇంటర్‌ బోర్డు షెడ్యూల్‌ను సవరించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement