ఫార్మాసిటీలో పెట్టుబడులు పెడతాం
యూఏఈ ఎక్సే్చంజ్ చైర్మన్ బీఆర్ శెట్టి ఆసక్తి
మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన పారిశ్రామికవేత్త
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొల్పనున్న ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త, యూఏఈ ఎక్సే్చంజ్ చైర్మన్ బీఆర్ శెట్టి ఆసక్తి చూపారు. హెల్త్‌కేర్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉందని ఆయన పేర్కొన్నారు. బేగంపేటలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావుతో సమావేశమయ్యారు.
రాష్ట్రంలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బీఆర్ షెట్టి సూచనప్రాయంగా అంగీకరించారు. తెలంగాణ గురించి తనకు చాలా మంది చాలా విషయాలు చెప్పారని, ఇప్పుడు మంత్రిని కలసి రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి గురించి స్వయంగా తెలుసుకున్నట్లు చెప్పారు. దుబాయ్, అబుదాబిల్లోని పారిశ్రామిక వేత్తలతో సమావేశం ఏర్పాటుచేసి తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు తెచ్చేలా తనవంతు కృషి చేస్తానని చెప్పారు.
సంస్థ తరపున సామాజిక సేవా కార్యక్రమాలను సైతం చేపట్టేందుకు అవకాశం ఇవ్వాలని, ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియజేస్తామన్నారు. ఫార్మాసిటీ, మెడికల్ డివైజెస్ పార్కుల్లో పెట్టుబడులు పెట్టాలని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా ఆహ్వానించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం, సింగిల్ విండో అనుమతుల వివరాలను వివరించారు. హైదరాబాద్ బల్క్ డ్రగ్స్ ఉత్పత్తులకు రాజధానిగా అభివృద్ధి చెందిందని, లైఫ్‌సైన్సెస్, ఏరోస్పేస్ రంగాల్లో కూడా అధికంగా పెట్టబడులు వస్తున్నాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తదితరులు పాల్గొన్నారు.