‘ఆసరా’పై విజి‘లెన్స్’!
ఆసరా పింఛన్ల గోల్‌మాల్
వ్యవహారాలపై బాధ్యుల మెడకు ఉచ్చు బిగిసుకుంటోంది. అక్రమాల డొంక కదులుతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆసరా పథకం పింఛన్లలో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్టు ఫిర్యాదులు వస్తుండటంతో విజిలెన్స్ విచారణకు రంగం సిద్ధమైంది. బోగస్ పింఛన్లతో రూ.లక్షలు పక్కదారి పట్టాయని సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో విజిలెన్స్ విచారణ చేపట్టనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం.
తాండూరు: తాండూరు మున్సిపాలిటీలో పింఛన్ల గోల్‌మాల్ వ్యవహారాలపై విజిలెన్స్‌తోపాటు డీఆర్‌డీఏ కూడా విచారణకు సిద్ధమైంది. గత జూన్‌లో కౌన్సిల్ సాధారణ సమావేశంలో రూ.9 లక్షల పింఛన్లు పక్కదారి పట్టాయని, ప్రత్యేక కమిటీతో విచారణ జరిపించాలని పదో వార్డు కౌన్సిలర్ సుమిత్‌కుమార్ గౌడ్ చైర్‌పర్సన్ కోట్రిక విజయలక్ష్మిని కోరారు. గత ఏడాది నవంబర్ నుంచి ఆసరా పథకం ప్రారంభమైంది. సుమారు 6,493మంది వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పింఛన్లు మంజూరయ్యాయి.
ఈ పింఛన్ల పంపిణీలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నట్టు అధికారులకు ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో లబ్ధిదారుల బ్యాంకు అకౌంట్లు, ఆధార్ కార్డులు, పూర్తి చిరునామా తదితర వివరాలు అందజేయాలని డీఆర్‌డీఏ అధికారులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో మొత్తం పింఛన్‌దారుల్లో సుమారు 1,564 మందికి బ్యాంకు అకౌంట్లు, ఆధారు కార్డులు, చిరునామా ఇతర వివరాలు లేవని డీఆర్‌డీఏ అధికారుల దృష్టికి వచ్చింది. దీంతో పింఛన్లలో అవకతవకలు చోటుచేసుకున్నట్టు డీఆర్‌డీఏకు వస్తున్న ఫిర్యాదులకు బలం చేకూరినట్లయ్యింది. ఈ క్రమంలో విజిలెన్స్ విచారణకు అధికారులు రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇన్ని నెలలు పింఛన్లు ఎలా పంపిణీ చేశారు. ఎవరికి ఇచ్చారనే కోణంలో విజిలెన్స్ విచారణ కొనసాగుతుందని జిల్లా అధికారి ఒకరు చెప్పారు. బ్యాంకు, ఆధారు కార్డులేని వారిని బోగస్‌గానే పరిగణిస్తామని సదరు అధికారి స్పష్టం చేశారు.
చిరునామాలేని వారు 300మంది..
పింఛన్ల పంపిణీలో అవకతవకలు జరగలేదు. ఒకవేళ పాల్పడితే బాధ్యులపై చర్యలు ఉంటాయి. 6,493మందిలో అకౌంట్లు ఉన్న వారికి బ్యాంకుల ద్వారా పింఛన్లు పంపిణీ అవుతున్నాయి. కొందరికి బ్యాంకు అకౌంట్లు తీస్తున్నాం. కొంత మంది మృతి చెందారు. సుమారు 300మంది చిరునామా లేని వారు ఉన్నారు. 28 మంది మృతి చెందగా, మరో 27మందికి డబుల్ పింఛన్లు వచ్చాయి. వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తాం.
- గోపయ్య, మున్సిపల్ కమిషనర్, తాండూరు