సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అన్నదాతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది. 2018–19 ఆర్థిక సంవత్సరంలో రైతుల కోసం కొత్తగా ప్రారంభించే రెండు పథకాలకు భారీగా నిధులు కేటాయించింది. ఖరీఫ్, రబీలకు కలిపి ఎకరాకు రూ. 8 వేల చొప్పున అందజేసే ‘పెట్టుబడి’ పథకానికి రూ. 12 వేల కోట్లు కేటాయించింది. అందులో ఎస్సీ సబ్‌ప్లాన్ కింద రూ. 1,854 కోట్లు, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రూ. 1,089.60 కోట్లు కేటాయింపులు చేసింది. ప్రస్తుత లెక్కల ప్రకారం దాదాపు 72 లక్షల మంది రైతులకు 1.65 కోట్ల ఎకరాల భూమికి పెట్టుబడి పథకం కింద సీజన్‌కు రూ. 4 వేల చొప్పున ప్రభుత్వం అందించనుంది. వచ్చే నెల 19 నుంచి పెట్టుబడి సాయాన్ని రైతులకు అందిస్తారు. రబీ సీజన్‌కు నవంబర్‌లో పెట్టుబడి సాయం అందజేస్తారు. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. చెక్కుల ద్వారా రైతులకు పెట్టుబడి సాయం ఇస్తారు. ఖరీఫ్‌లో రైతులందరికీ పెట్టుబడి సాయం అందజేస్తారు. 1.65 కోట్ల ఎకరాలకు రైతులకు రూ. 6,600 కోట్లు అందజేస్తారు. ఇక మిగిలే రూ. 5,400 కోట్లు రబీలో రైతులకు ఇస్తారు. రబీలో పంట సాగు చేసే రైతులను గుర్తించి వారికి మాత్రమే పెట్టుబడి సాయం అందజేస్తారు.
రైతు బీమాకు రూ. 500 కోట్లు
రైతుల కోసం కొత్త బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు కేవలం పంటలు నష్టపోతేనే వాటి కింద రైతుకు బీమా పరిహారం ఇచ్చేవారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఎక్స్‌గ్రేషియా కింద రూ. 6 లక్షలు ఇచ్చే అవకాశం ఉండేది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త పథకంలో అన్నదాతలు ఒకవేళ సాధారణ మరణం పొందినా, ఆత్మహత్యలు చేసుకున్నా, ప్రమాదంలో చనిపోయినా కూడా ఆయా రైతు కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందజేస్తారు. ఇందుకోసం బడ్జెట్‌లో రూ. 500 కోట్లు కేటాయించారు. ఆ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 72 లక్షల మంది రైతుల తరపున ప్రభుత్వం బీమా ప్రీమియం చెల్లిస్తుంది. కాగా, కీలకమైన రైతు సమన్వయ సమితి కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులేమీ కేటాయించలేదు. కార్పొరేషన్‌కు ప్రభుత్వం ఇప్పటికే రూ. 200 కోట్లను మూలనిధి కింద విడుదల చేయడంతో బడ్జెట్‌లో కేటాయింపులేవీ చూపించలేదు.
వ్యవసాయానికి రూ.9 వేల కోట్లు అదనం
2017–18 బడ్జెట్‌కంటే భారీగా పెరిగిన నిధులు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం వ్యవసాయానికి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. 2017–18 బడ్జెట్లో రూ.6,498.15 కోట్లు కేటాయిస్తే, 2018–19 ప్రగతి బడ్జెట్లో రూ.15,511 కోట్లు కేటాయించింది. ఏకంగా రూ.9,013 కోట్లు అదనంగా కేటాయించడం గమనార్హం. అందులో ఈసారి కొత్తగా ప్రవేశపెట్టబోయే ‘పెట్టుబడి’ పథకానికి రూ.12 వేల కోట్లు, రైతు బీమాకు రూ.500 కోట్లు కేటాయించారు. ఇవిగాక వ్యవసాయ యాంత్రీకరణకు 2017–18 బడ్జెట్లో రూ.336.80 కోట్లు కేటాయిస్తే, 2018–19 బడ్జెట్లో రూ.522 కోట్లు కేటాయించారు. ఈసారి వరినాటు యంత్రాలను రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు పంచేందుకు సర్కారు సన్నద్ధం కావడంతో ఈ మేరకు నిధులు కేటాయించారు. ఇక పంటల బీమా పథకానికి గత బడ్జెట్లో రూ.343 కోట్లు కేటాయిస్తే, ఈసారి 500 కోట్లు కేటాయించారు. విత్తన సరఫరాకు గత బడ్జెట్లో రూ.138 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో రూ.178 కోట్లు కేటాయించారు. రైతు వేదికల కోసం రూ.158 కోట్లు కేటాయించారు. ఉద్యానశాఖకు 2017–18 బడ్జెట్లో రూ.207 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో రూ.376 కోట్లు కేటాయించడం గమనార్హం. అయితే వ్యవసాయ మార్కెటింగ్‌కు 2017–18 బడ్జెట్లో రూ. 457 కోట్లు కేటాయిస్తే, తాజా బడ్జెట్లో కేవలం రూ.122 కోట్లు మాత్రమే కేటాయించారు. ఏకంగా రూ. 335 కోట్లు తగ్గించారు.
దేశంలో ఎక్కడా లేనివిధంగా..
పెట్టుబడి పథకం, రైతు బీమా వంటి రెండు పథకాలు బడ్జెట్లో ప్రవేశపెట్టడం అభినందనీయం. ఈ బడ్జెట్ పూర్తిగా రైతును రాజుగా చేసేదిలా ఉంది. ఈ రెండు పథకాలు దేశంలో ఎక్కడా లేవు. ఇక రైతు బీమా పథకం అనేది ఆయా కుటుంబాలకు విశ్వాసాన్ని కలిగిస్తుంది. సన్న చిన్నకారు రైతులకు పెట్టుబడి పథకం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అనేకమంది రైతులు సాగు చేసేందుకు ముందుకు వస్తారు.
– డాక్టర్ పిడిగం సైదయ్య, ఉద్యాన వర్సిటీ
పెట్టుబడి పథకంపై అనుమానాలు
పెట్టుబడి పథకానికి రూ.12 వేల కోట్లు కేటాయించారు. ఖరీఫ్‌కు అందరికీ ఇచ్చినా, రబీలో సాగు చేసే రైతులకే ఇస్తారు. అప్పుడు ఇంత సొమ్ము అవసరంలేదు. ఇందులో ఏదో మతలబు ఉంది. రైతులను మభ్య పెట్టేందుకే సర్కారు పెట్టుబడి పథకానికి ఎక్కువ నిధులు కేటాయించినట్లు చూపిస్తుంది.
– సారంపల్లి మల్లారెడ్డి,రైతు సంఘం జాతీయ నేత
అప్పుల రాష్ట్రంగా తయారు చేశారు
కేసీఆర్‌పై జీవన్‌రెడ్డి మండిపాటు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణరాష్ట్ర ఏర్పాటుకు ముందు రూ.70 వేల కోట్ల అప్పు ఉండేదని, రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత టీఆర్‌ఎస్ నాలుగేళ్ల పాలనలో అది మరో రూ.70 వేల కోట్లు పెరిగిందని కాంగ్రెస్ శాసనసభాపక్ష ఉపనేత జీవన్‌రెడ్డి ఆరోపించారు. అప్పుల రాష్ట్రంగా తెలంగాణను తయారు చేశారన్నారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ నాలుగేళ్లపాటు ప్రధాని మోదీ పాట పాడిన సీఎం కేసీఆర్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్లేట్ ఫిరాయించారని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment