
బ్లాక్ దందా!
పక్కదారి పట్టిన ఐపీఎల్ టికెట్లు
► బ్లాక్‌లో 4 రెట్ల ధరకు అమ్మకం
► మండిపడుతున్న అభిమానులు
► పేరుకే ఆన్‌లైన్.. జరిగేదంతా ఆఫ్‌లైన్
► విక్రయ కేంద్రాల్లోనూ గోల్‌మాలే..
► రెండు మ్యాచ్‌ల్లో రూ.2 కోట్లకుపైగా దందా
► ఇప్పటిదాకా 40 మంది అరెస్టు.. బెట్టింగ్‌కూ రెక్కలు.. కోట్లలో లావాదేవీలు
జోరుగా బెట్టింగ్
ఐపీఎల్ ఫీవర్‌ను క్యాష్ చేసుకునేందుకు ఓవైపు బ్లాక్ టికెట్ ముఠాలు దందాకు తెరలేపగా.. మరోవైపు ఆన్‌లైన్ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. ఒక్క హైదరాబాద్‌లోనే ఒక్కో మ్యాచ్‌కు కోట్లలో బెట్టింగ్ జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌పై కన్నేసిన సైబరాబాద్ ఎస్‌వోటీ పోలీసులు జీడిమెట్ల హెచ్‌ఎంటీ సొసైటీకి చెందిన మహేందర్‌తాక్ (32)ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
సాక్షి, హైదరాబాద్:
ఐపీఎల్ ట్వంట్వీ–20 టికెట్లు పక్కదారి పట్టాయి. క్రికెట్ అభిమానులకు టికెట్ దొరకడమే గగనమవుతోంది. భారీ డిమాండ్, అభిమానుల్లో క్రికెట్ క్రేజ్‌ను సొమ్ము చేసుకుంటూ అక్రమార్కులు బ్లాక్ దందాకు తెరలేపారు. ఆన్‌లైన్‌తోపాటు హైదరాబాద్‌లో 12, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్‌లో మూడు టికెట్ విక్రయ కేంద్రాలున్నా అభిమానులకు అందడం లేదు. తమ అభిమాన క్రికెటర్ల ఆట చూసేందుకు.. చేసేది లేక బ్లాక్‌లో టికెట్ ధరకు నాలుగింతలు ఎక్కువ చెల్లించి హైదరాబాద్ ఉప్పల్ స్టేడియానికి క్యూ కడుతున్నారు. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో రూ.2 కోట్లకు పైనే బ్లాక్ టికెట్ల వ్యాపారం జరిగిందని సమాచారం.
పేరుకే ఆన్‌లైన్..
ఐపీఎల్ టికెట్లను www.sunrisershyderabad.in, ఈవెంట్స్ నౌ సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేందుకు యత్నిస్తున్న అభిమానులకు నిరాశే ఎదురవుతోంది. కొందరు వ్యక్తులు ఆన్‌లైన్‌లో ముందుగానే పెద్దమొత్తం(బల్క్)గా టికెట్లను బుక్ చేసుకొని మ్యాచ్ సమయానికల్లా వాటిని బ్లాక్‌లో విక్రయిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. బ్లాక్ టికెట్లను అమ్మేందుకు కొందరు ఏజెంట్‌లను నియమించుకొని మరీ దందా నడుపుతున్నారని పేర్కొంటున్నారు. నగరంలోని టికెట్ విక్రయ కేంద్రాల వద్దే కొందరు బ్లాక్ టికెట్లు విక్రయిస్తున్నారని అభిమానులు చెబుతున్నారు. టికెట్ కౌంటర్ల వద్ద భారీ క్యూ పెరిగే వరకు చూసి, ఆ తర్వాత కొందరికే టికెట్లు ఇచ్చి మిగతా వారికి లేవని చెబుతున్నారని ఆరోపిస్తున్నారు.
విక్రయ కేంద్రాల్లో టికెట్లేవీ?
సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్, బషీర్‌బాగ్‌లోని ఎల్బీ స్టేడియం, ఉప్పల్‌లోని జీహెచ్‌ఎంసీ గ్రౌండ్, సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో ప్రతిరోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా, జూబ్లీహిల్స్‌లోని హైలైఫ్ షాపింగ్ మాల్‌తోపాటు నగరంలోని పలు ’జస్ట్ బేక్’ఔట్‌లెట్లలో మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు టిక్కెట్లను అమ్ముతున్నామని హెచ్‌సీఏ అధికారులు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. టికెట్లన్నీ అమ్ముడు పోయాయని చెబుతుండడంతో చాలా మంది వెనుదిరుగుతున్నారు. కరీంనగర్‌లోని ప్రతిమ మల్టీప్లెక్స్, వరంగల్‌లోని గ్రీన్ స్క్వేర్ ప్లాజా, నిజామాబాద్‌లోని ఉషా మయూరి మల్టిప్లెక్స్‌లలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఉప్పల్ స్టేడియంలో ఇప్పటికే రెండు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇక్కడే మరో ఐదు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లకైనా బ్లాక్ టికెట్ దందాను అరికట్టాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
40 మంది అరెస్టు
మ్యాచ్ జరిగే రోజున ఉప్పల్ స్టేడియం వద్ద బ్లాక్ టికెట్ విక్రేతలు వాలిపోతున్నారు. రోడ్లపై నిలబడి ప్రేక్షకులతో బేరసారాలు నడుపుతున్నారు. రూ.500 టికెట్‌ను రూ.2,000కు, రూ.750 టికెట్‌ను రూ.3,000కు అమ్ముతున్నారు. తొలి మ్యాచ్ జరిగిన రోజున (ఏప్రిల్ 5న) 13 మందిని, ఆదివారం మరో 27 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 68 టిక్కెట్లు, రూ.32 వేలు స్వాధీనం చేసుకున్నారు.
బ్లాక్ దందా నడిపితే కఠిన చర్యలు
బ్లాక్ టికెట్ దందా నడిపేందుకు కొన్ని ముఠాలు రంగంలోకి దిగినట్టు మాకు సమాచారం ఉంది. వారు గంపగుత్తగా టికెట్లు కొని బ్లాక్‌లో భారీ ధరలకు విక్రయిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే వీరిపై కన్నేశాం. ఉప్పల్ స్టేడియం వద్ద పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ గట్టి నిఘా పెట్టాం. బ్లాక్ దందా చేసే వారిపై కఠిన చర్యలుంటాయి.
– మహేష్ భగవత్, రాచకొండ పోలీసు కమిషనర్
సీరియస్‌గా తీసుకోవాలి
ఐపీఎల్ టికెట్ల విక్రయాలకు సంబంధించి ఐపీఎల్, సన్‌రైజర్స్ సంస్థల మధ్య ఒప్పందం కుదిరింది. ఇందులో హైదరాబాద్ క్రికెట్ సంఘానికి ఎలాంటి పాత్ర లేదు. ఐపీఎల్ టికెట్లను పారదర్శక విధానంలో విక్రయించి అభిమానులకు అసౌకర్యం కలగకుండా చూడాలి. బ్లాక్ టికెట్ల అంశాన్ని సీరియస్‌గా పరిగణించాలి.
– గడ్డం వినోద్, హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు
నిరాశే మిగిలింది..
ఆదివారం ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ చూడాలని ఆశతో వస్తే టికెట్ దొరకకపోవడంతో నిరాశగా వెళ్లాల్సి వచ్చింది. టిక్కెట్ల జారీలో పారదర్శకత లోపించింది.
రత్నాకర్, అల్వాల్.
ఎక్కడికి వెళ్లినా దొరకడం లేదు
ఆన్‌లైన్‌లో సెర్చ్ చేశా. కౌంటర్ల వద్దకు పరుగులు తీశా. ఎక్కడ వెళ్లినా టికెట్లు దొరకడం లేదు. స్నేహితులతో కలసి మ్యాచ్ చూడాలని వస్తే మనశ్శాంతి లేకుండా పోయింది.
మేక విశ్వంత్, ఆనంద్‌భాగ్