ఇనుపరాడ్లు పడి నలుగురు మృతి
► మరో నలుగురికి తీవ్ర గాయాలు
► ట్రెయిలర్ లారీ పైనుంచి పక్కన వెళుతున్న ఆటోపై పడిన రాడ్లు
► మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలే
► సంగారెడ్డి జిల్లా ఇంద్రకరణ్ వద్ద ఘటన
సాక్షి, సంగారెడ్డి రూరల్
ఓ ట్రెయిలర్ లారీలో తరలిస్తున్న ఇనుప రాడ్లు ఆటోపై కూలిపడడంతో నలుగురు కూలీలు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఎగుడుదిగుడుగా ఉన్న మట్టి రోడ్డు కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతులంతా అస్సాం రాష్ట్రానికి చెందిన కూలీలే. సంగారెడ్డి జిల్లా కంది మండలం ఇంద్రకరణ్ వద్ద సోమవారం రాత్రి ఈ దుర్ఘటన జరిగింది.
పనికోసం వెళుతూ..
ఇంద్రకరణ్ గ్రామ శివారులో నువోసాల్ అనే సోలార్ కంపెనీ నిర్మాణం జరుగుతోంది. ఆ కంపెనీ షెడ్డు నిర్మాణం కోసం సోమవారం రాత్రి ఓ ట్రెయిలర్ లారీలో పర్లిన్ బండిల్స్ (షెడ్డు పైకప్పు వేసేందుకు ఉపయోగించే ఇనుప రాడ్లు)ను తీసుకువచ్చారు. అయితే అప్పటికే రాత్రి 7.30 దాటిపోవడంతో తాము అన్‌లోడ్ చేసుకోబోమంటూ కంపెనీ ప్రతినిధులు తిప్పి పంపారు. ఇదే సమయంలో ఆ కంపెనీలోనే క్యాజువల్ కార్మికులుగా పనిచేస్తున్న అస్సాం కార్మికులు కొందరు ఓ ఆటోలో పనికోసం వస్తున్నారు. ఎదురుగా వస్తున్న ట్రెయిలర్ లారీని చూసిన ఆటో డ్రైవర్ కాస్త పక్కగా జరిపి నిలిపాడు. అయితే రోడ్డు ఎగుడుదిగుడుగా ఉండడంతో.. ట్రెయిలర్ తీవ్రంగా ఊగి పర్లిన్ బండిల్స్ ఆటోపై పడిపోయాయి. దీంతో అందులో ఉన్న సరోజ్‌కుమార్ (28), సూరజ్ కుమార్ భక్తా (23), చుట్టూ భక్తా (18), సుధామ (20) అక్కడికక్కడే మృతి చెందారు. పటాన్‌చెరు మండలం క్యాసారానికి చెందిన ఆటోడ్రైవర్ పాండుగౌడ్‌తో పాటు అస్సోంకు చెందిన మానస్ మజ్జి, రూబెన్, ప్రదీప్‌లు తీవ్రంగా గాయపడ్డారు. మృతులంతా అస్సాం రాష్ట్రంలోని నవగాం జిల్లా ఇటాసలి పంచాయతీ సమితి పరిధిలోని బర్హాపూర్ వాసులుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.