సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కప్పదాట్ల నేతలకు కలిసొస్తుందా? కండువాలు మార్చి పోటీ చేస్తున్న నేతలను ప్రజలు ఆదరిస్తారా? ఎన్నికల నగారా మోగే వరకు ఆయా పార్టీల్లో ఉండి.. ఎన్నికల్లో అతికొద్ది రోజుల ముందు పార్టీలు మార్చిన అభ్యర్థులు విజయతీరం చేరుకుంటారా? ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో ప్రధాన చర్చ జరుగుతోంది. ఇలా ఎన్నికలకు ముందు పార్టీలు మార్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు.
ఆయా నియోజకవర్గాల్లో వారి పరిస్థితిని పరిశీలిస్తే..
నగేశ్‌ది తుది వరకు చంద్రబాబు జపం నగేశ్ ఇన్నాళ్లు చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతాన్నే నమ్ముకున్నారు. తెలంగాణ ఉద్యమంలో అందరూ పాల్గొంటే ఆయన మాత్రం చంద్రబాబు జపమే చేశాడు. సకల జనుల సమ్మెతో అందరూ ఏకమై నిరసన కార్యక్రమాలతో హోరెత్తిస్తుంటే.. ఏనాడు ఉద్యమంలో పాల్గొనలేదనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించే వరకు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా కొనసాగారు.
ఇకపై ఆ పార్టీలో ఉంటే అ సలుకే ఎసరొస్తుందని భావించి.. రెండు నెలల క్రితం టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకుని ప్రస్తుతం ఆదిలాబాద్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణ మాటెత్తని ఆయన ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో తెలంగాణ పునర్‌నిర్మాణం తమతోనే సాధ్యమంటున్నారు. తెలంగాణవాదుల్లో వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఆయనకు ప్రత్యార్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. చివరి క్షణంలో పార్టీ మారిన నగేష్‌ను నియోజకవర్గ ప్రజలు ఏ మేరకు ఆదరిస్తారో ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.
కారు దిగి.. కాంగ్రెస్‌లోకి కాకా కుమారులు..
పెద్దపల్లి లోక్‌సభ అభ్యర్థి జి.వివేక్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. నగేష్ చంద్రబాబు జపం చేస్తే.. వివేక్ కేసీఆర్‌కు వంతపాడారు. కాంగ్రెస్ అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు ఉన్నా తెలంగాణ రాష్ట్ర సాధన కేసీఆర్‌తోనే సాధ్యమని కాంగ్రెస్ వీడి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఎన్నికల నగారా మోగిన తర్వాత కూడా ఆయన గులాబీ గూటిలోనే ఉన్నారు. తీరా ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత చివరి క్షణంలో టీఆర్‌ఎస్‌కు గుడ్‌బై చెప్పి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
వెంటనే ఆయనకు కాంగ్రెస్ టిక్కెట్ కూడా ఖరారైంది. ఇన్నాళ్లు టీఆర్‌ఎస్‌లో ఈ నాయకుడు ఇప్పుడు తన ప్రత్యర్థిగా మారిన టీఆర్‌ఎస్ అభ్యర్థిని విమర్శించాల్సి వస్తోంది. నియోజకవర్గ అభివృద్ధిని గాలికొదిలేశారనే విమర్శలు ఎదుర్కొంటున్న వివేక్ ఈ ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. కాకా మరో కుమారుడిది ఇదే పరిస్థితి. టీఆర్‌ఎస్ బెల్లంపల్లి నియోజకవర్గ ఇన్‌చార్జిగా చివరివరకు కొనసాగారు. వివేక్‌తోపాటు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఆయన ఇప్పుడు టీఆర్‌ఎస్ అభ్యర్థి ఓదేలు నుంచి చెన్నూరులో పోటీని ఎదుర్కొంటున్నారు. మంత్రిగా పనిచేసిన ఆయన చెన్నూరును అభివృద్ధి చేయలేదనే విమర్శలు ఉన్నాయి.
ఎమ్మెల్యే అభ్యర్థులు
కప్పదాట్ల నేతలు ఎమ్మెల్యే అభ్యర్థులుగా కూడా బరిలో ఉన్నారు. ఆదిలాబాద్, ముథోల్ బీజేపీ అభ్యర్థులుగా పోటీలో ఉన్న పాయల్ శంకర్, రమాదేవిలు కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పావులు కదిపిన చంద్రబాబుు వెంటే చివరి వరకు ఉన్నారు. టీడీపీలో కొనసాగితే భవిష్యత్తు ఉండదని భావించి కాషాయం కండువా కప్పుకున్నారు. తెలంగాణపై చంద్రబాబు తీరును నిరసిస్తూ వీరు పార్టీని వీడినా ఎన్నికల్లో టీడీపీతోనే పొత్తుండటంతో తిరిగి టీడీపీ కండువాను కూడా వేసుకుని ప్రజల్లోకి వెళ్లాల్సి వస్తోంది. చంద్రబాబును విమర్శించి, పార్టీ మారిన ఈ నేతలు అదే పార్టీ మద్దతుతో బరిలో ఉన్న వీరిపై నియోజకవర్గ ప్రజల ఆదరణ ఎలా ఉంటుందో చూడాల్సిందే.
కాంగ్రెస్‌లో సుదీర్ఘ కాలంపాటు పనిచేసిన దివాకర్‌రావు ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ తీర్థం తీసుకున్నారు. టీఆర్‌ఎస్‌లో ఉన్న సి ట్టింగ్ ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డి కాంగ్రెస్ గూటి కి చేరుకోవడంతో, దివాకర్‌రావు టీఆర్‌ఎస్‌లోకి వెళ్లారు. ఈ నియోజకవర్గంలో ఈ ఇద్దరు నేతలు కండువాలు మార్చుకుని తలపడుతుండగా, విజయం ఎవరిని వరిస్తుందో ఫలితాలు తేల్చనున్నాయి.
ఎన్నికల వరకు తటస్థంగా ఉంటూ.. టిక్కెట్ల గోల ప్రారంభం కాగానే కాంగ్రెస్‌లో చేరిన ఐకేరెడ్డి చివరకు కాంగ్రెస్ కండువా కోసం పోరాడి విఫలం అయ్యారు. అనంతరం బీ ఎస్పీ నుంచి బరిలో ఉన్నారు. ఆయన ప్రధా న అనుచరుడు కోనప్ప కూడా బీఎస్పీ నుం చి పోటీ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీని ఇస్తున్న వీరిని స్థానిక ప్రజలు ఆదరిస్తారో చూడాల్సిందే. కాంగ్రెస్‌ను వీడి ఎన్నికల వేళ టీడీపీలో చేరిన సోయం బాపురావుకు ప్రధాన పార్టీల అభ్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది.
జంప్ జిలానీలకు కలిసొచ్చేనా?
Published Fri, Apr 25 2014 1:37 AM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM
Advertisement