- విజయ డెయిరీ పార్లర్ల కేటాయింపుపై లోకాయుక్తకు ఫిర్యాదు
- విచారణ జరపాలంటూ మహిళా సంఘం విజ్ఞప్తి
సాక్షి,సిటీబ్యూరో: ఆంధ్రప్రదేశ్ డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) మార్కెటింగ్ జీఎం ప్రవీణ్‌కుమార్ నిబంధనలకు విరుద్ధంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తిరుపతి, విజయవాడ రైల్వే స్టేషన్లల్లో శ్రీ వెంకటేశ్వర ఫుడ్స్ అండ్ బేవరేజేస్ సంస్థకు విజయ డెయిరీ పార్లర్ల మంజూరు చేసిన వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ తిరుపతికి చెందిన ‘సేవ్ జనని’ మహిళా సంఘం డిమాండ్ చేసింది.
ఈ మేరకు గురువారం సంఘం అధ్యక్షురాలు శివలీలాదేవీ ఆధ్వర్యంలో సభ్యుల బృందం రాష్ట్ర లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. దివంగత ముఖ్యమంతి వైఎస్సార్ హయాంలో ఇందిరాక్రాంతి పథం కింద స్వయంసహాయక సంఘాలను ప్రోత్సహించే ఉద్దేశంతో 2007లో డెయిరీ కార్పొరేషన్ ద్వారా తమ సంఘానికి తిరుపతి రైల్వేస్టేషన్‌లో విజయ డెయిరీ పార్లర్‌ను మంజూరు చేశారని, రాష్ట్రవ్యాప్తంగా కూడా పలు స్వయంసహాయక సంఘాలకు రైల్వే, బస్‌స్టేషన్లలో ఈ పార్లర్లను కేటాయించారని చెప్పారు.
ప్రతి మూడేళ్లకోసారి పార్లర్ లెసైన్స్ రెన్యూవల్ చేస్తుండగా, ఇటీవల నిబంధనల విరుద్ధంగా శ్రీ వెంకటేశ్వర ఫుడ్ అండ్ బేవరేజస్‌కు సుమారు 70 వరకు డెయిరీ పార్లర్లను కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. సదరు సంస్థతో లోపాయికారి ఒప్పందం జరగడం వల్లే తమ లెసైన్స్ పునరుద్ధరించలేదని విమర్శించారు. ప్రైవేటు సంస్థకు డెయిరీ పార్లర్ల కేటాయింపుపై తగు విచారణ జరిపి తమ లెసైన్స్‌లను రెన్యూవల్ చేసేలా ఆదేశాలివ్వాలని ఫిర్యాదులో విజ్ఞప్తి చేశారు.
28న విచారణ : మహిళా సంఘం ఫిర్యాదు మేరకు లోకాయుక్త జస్టిస్ సుభాషణ్‌రెడ్డి స్పందించి ఏపీడీడీసీఎఫ్‌కు నోటీసు జారీచేశారు. దీనిపై ఈనెల 28న విచారణకు హాజరుకావాలని ఏపీడీడీసీఎఫ్ జీఎం ప్రవీణ్‌కుమార్‌ను ఆదేశించారు.