తగునా ఇది.. జానా
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల ఆరంభంలోనే చోటుచేసుకున్న ఘటనలతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. సోమవారం నాటి పరిణామాలతో పార్టీ సీనియర్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి.
హైదరాబాద్: బడ్జెట్ సమావేశాల ఆరంభంలోనే చోటుచేసుకున్న ఘటనలతో ప్రతిపక్ష కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. సోమవారం నాటి పరిణామాలతో పార్టీ సీనియర్ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. తొలిరోజు గవర్నర్ ప్రసంగానికి ముందు జాతీయ గీతాలాపన సమయంలో కొందరు టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు వ్యవహరించిన తీరుపై క్షమాపణ కోరాలని సోమవారం సభా వ్యవహారాల సంఘం సమావేశంలో నిర్ణయించారు. దీనికి ప్రతిపక్ష నేత జానారెడ్డి కూడా సమ్మతి తెలిపారు.
అయితే గందరగోళ పరిస్థితుల్లో టీడీపీ సభ్యులు సస్పెండ్ కావడంతో తర్వాత కాంగ్రెస్ వంతు వచ్చింది. పార్టీ సభ్యుడు సంపత్‌కుమార్ క్షమాపణ చెబుతారని ప్రతిపక్ష నేత కె.జానారెడ్డి సభలోనే చెప్పారు. అయితే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క మాత్రం జానా దగ్గరకు వెళ్లి ఆయన నిర్ణయంతో విభేదించారు. జాతీయ గీతాలాపన విషయంలో టీఆర్‌ఎస్ సభ్యులు కూడా తప్పుగా వ్యవహరించారని, వారి నుంచి క్షమాపణ కోరకుండా.. కాంగ్రెస్ సభ్యుడి క్షమాపణ అడగడమేంటని జానారెడ్డి దృష్టికి తెచ్చారు.
శాసనసభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు కూడా బాధ్యుడేనని ఆయనతో కాంగ్రెస్ నేతలు వాదించారు. అధికార పార్టీ సభ్యులు కూడా స్పీకర్ వెల్‌లోకి వెళ్లి ప్రతిపక్ష సభ్యులతో దురుసుగా ప్రవర్తించిన విషయంపై చర్చించిన తర్వాతే క్షమాపణ విషయం చూద్దామని పేర్కొన్నారు. దీనికి జానారెడ్డి ససేమిరా అన్నారు. సభా సాంప్రదాయాలు, శాసనసభ గౌరవం వంటి వాటిని విస్మరించి పనిచేయడం తన వల్ల కాదని తెగేసి చెప్పారు. అధికారపక్షంపై దూకుడుగా వ్యవహరించడానికి తనకు అభ్యంతరం లేదని, అందుకు అనుగుణంగా వ్యూహం రూపొందించుకోవచ్చునని జానా అన్నట్లు సమాచారం. ఆయనకు మంత్రి గీతారెడ్డి మద్దతుగా నిలిచినట్లు తెలిసింది.
కాంగ్రెస్ నేతలు ఇలా చర్చించుకుంటున్నంత సేపు సంపత్.. క్షమాపణ చెప్పవడానికి బదులు టీఆర్‌ఎస్ సభ్యులపై ఆరోపణలకు దిగారు. చివరకు క్షమాపణ చెప్పాలని ఓ కాగితంపై జానా రాసి పంపడంతో చేసేదేమీ లేక సంపత్ దాన్ని పాటించారు. తర్వాత లాబీల్లో జానాను కలిసిన ఉత్తమ్, భట్టి మరోసారి అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు తెలిసింది. అనంతరం జానా మీడియాతో మాట్లాడుతూ జాతీయగీతాన్ని అవమానించిన వారెవరైనా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. టీఆర్‌ఎస్ సభ్యులు కూడా తప్పుచేశారని, వాటికి సంబంధించిన వీడియో క్లిప్పింగుల కోసం కూడా అడిగినట్టుగా ఆయన చెప్పారు. వాటి ఆధారంగా సభ్యుల తప్పొప్పులపై నిర్ణయం జరగాలన్నారు.