మార్చి 6న ఐసెట్‌ నోటిఫికేషన్‌ | Iset notification on March 6th | Sakshi
Sakshi News home page

మార్చి 6న ఐసెట్‌ నోటిఫికేషన్‌

Published Thu, Feb 13 2020 1:15 AM | Last Updated on Thu, Feb 13 2020 1:15 AM

Iset notification on March 6th - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఐసెట్‌–2020) నోటిఫికేషన్‌ను మార్చి 6వ తేదీన జారీ చేయాలని ఐసెట్‌ కమిటీ నిర్ణయించింది. దరఖాస్తులను వచ్చే నెల 9 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు స్వీకరించనున్నట్లు ఐసెట్‌ కన్వీనర్‌ కె.రాజిరెడ్డి వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన సెట్‌ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ తేదీలతోపాటు నిబంధనలను, అర్హతలను కమిటీ ఖరారు చేసింది.

ముఖ్యంగా యూనివర్సిటీ గ్రాంట్‌ కమిషన్‌ (యూజీసీ) జాయింట్‌ కమిటీ, ఏఐసీటీఈ, డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ కౌన్సిల్‌ (డీఈసీ)/డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ బోర్డు (డీఈబీ) గుర్తింపు కలిగిన యూనివర్సిటీల పరిధిలో దూర విద్య ద్వారా డిగ్రీ పొందిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అలాగే రెగ్యులర్‌ డిగ్రీ చేసిన వారు, డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని స్పష్టం చేసింది. ఎంబీఏలో ప్రవేశాల కోసం ఐసెట్‌ ప్రవేశ పరీక్ష రాసేందుకు డిగ్రీ ఉత్తీర్ణులైæన వారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని పేర్కొంది. ఎంసీఏలో ప్రవేశాల కోసం ఐసెట్‌ రాసేందుకు ఇంటర్మీడియట్‌ లేదా డిగ్రీలో మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టు కలిగి బీసీఏ/బీఎస్సీ/బీకాం/బీఏ ఉత్తీర్ణులైనవారు అర్హులని స్పష్టంచేసింది. 

25 శాతం మార్కులొస్తేనే అర్హులు
ఐసెట్‌లో 25 శాతం మార్కులు సాధిస్తే అర్హులుగా పరిగణనలోకి తీసుకుంటామని, ఎస్సీ, ఎస్టీలకు కనీస అర్హత మార్కులేవీ లేవని ఐసెట్‌ కమిటీ వెల్లడించింది. పరీక్ష ఫీజును రూ.650లుగా నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఈసారి వికలాంగులకు ఫీజును తగ్గించింది. వారంతా రూ. 450 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. విద్యార్థులు టీఎస్‌ ఆన్‌లైన్, సిటిజన్‌ సర్వీస్‌ సెంటర్లు, ఈసేవ కేంద్రాల్లో లేదా ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా ఫీజు చెల్లించవచ్చని నిర్ణయించింది. విద్యార్థులు దరఖాస్తులను ఆన్‌లైన్‌లో సబ్మిట్‌ చేయవచ్చని పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లింపు, ఇతర నిబంధనలు, అర్హతలకు సంబంధించిన సమగ్ర వివరాలు, సిలబస్‌ అంశాలను తమ వెబ్‌సైట్‌లో (http://icet.trche.ac.in,www.kakati ya.ac.in,www.trche.ac.in) పొందవచ్చని పేర్కొంది.

ఈ పరీక్ష కోసం ఆదిలాబాద్, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, నల్లగొండ, కోదాడ, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నిజామాబాద్, వరంగల్, కర్నూల్, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రాల పరిధిలో ఐసెట్‌ పరీక్షలను మే 20, 21 తేదీల్లో ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష ఉంటుంది. 21వ తేదీన ఉదయం సెషన్‌ మాత్రమే పరీక్ష నిర్వహించాలని నిర్ణ్ణయించింది. సమావేశంలో కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డి, రిజిస్ట్రార్‌ పురుషోత్తం, ఉన్నత విద్యా మండలి అధికారులు, సెట్‌ కమిటీ ఇతర సభ్యులు పాల్గొన్నారు.

ఇదీ షెడ్యూల్‌
6–3–2020: నోటిఫికేషన్‌
9–3–2020 నుంచి 30–4–2020 వరకు: ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
6–5–2020 వరకు: రూ.500 ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం
11–5–2020 వరకు: రూ.2 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం
16–5–2020 వరకు: రూ.5 వేల ఆలస్య రుసుముతో దరఖాస్తులకు అవకాశం
14–5–2020 నుంచి: హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌
మే 20, 21 తేదీల్లో: ఐసెట్‌ ఆన్‌లైన్‌ పరీక్షలు
27–5–2020: ప్రాథమిక కీ విడుదల
1–6–2020 వరకు: ప్రాథమిక కీపై అభ్యంతరాల స్వీకరణ
12–6–2020: ఫైనల్‌ కీ, ఫలితాలు విడుదల.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement