బోటులో షికారు చేస్తున్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తదితరులు
సాక్షి, హైదరాబాద్:ఎకో టూరిజం పేరుతో హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు గాను కొత్తగూడ బొటానికల్ గార్డెన్‌కు ఐఎస్‌వో 9001–2015 సర్టిఫికెట్ లభించింది. దీంతో రాష్ట్రంలోని నగరాలు, పట్టణాల శివార్లలోని అటవీ భూములను అర్బన్ ఫారెస్ట్ పార్కులుగా మలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పార్కుల్లో ఒకదానికి అంతర్జాతీయ గుర్తింపు లభించినట్లయింది. ఒక పార్కుకు ఐఎస్‌వో సర్టిఫికెట్ రావడం దేశంలోనే మొదటిసారి కాగా బొటానికల్ గార్డెన్ ఈ అరుదైన ఘనతను సాధించింది.
శనివారం బొటానికల్ గార్డెన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేతుల మీదుగా రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్ వీసీ అండ్ ఎండీ రఘువీర్, ఇతర అధికారులు ఐఎస్‌వో సర్టిఫికెట్ అందుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అటవీ శాఖ అర్బన్ ఫారెస్ట్ పార్కులను తీర్చిదిద్దుతోందని, బొటా నికల్ గార్డెన్‌కు ఐఎస్‌వో సర్టిఫికెట్ రావడానికి కృషి చేసిన ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ అధికారులు, సిబ్బందికి ఇంద్రకరణ్ అభినందనలు తెలిపారు.
రానున్న రోజుల్లో బొటానికల్ గార్డెన్‌ను మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని, సందర్శకులు, వాకర్స్‌కు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, ఫారెస్ట్ కార్పొరేషన్ వీసీ, ఎండీ రఘువీర్, హెచ్‌వైయం సీఈవో అలపాటి శివయ్య, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment